ఆత్మకూరు ఏ పార్టీని అందలం ఎక్కిస్తుందో…!

నెల్లూరు జిల్లాలోనే ఆత్మకూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి, రాజకీయ యోధుడుగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎమ్‌.వెంకయ్య నాయుడిని ఓడించిన చరిత్ర [more]

Update: 2019-02-10 01:30 GMT

నెల్లూరు జిల్లాలోనే ఆత్మకూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి, రాజకీయ యోధుడుగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎమ్‌.వెంకయ్య నాయుడిని ఓడించిన చరిత్ర ఈ నియోజకవర్గ ప్రజలదే. అలాగే ఆనం కుటుంబీకులతో పాటు బొమ్మిరెడ్డి ఫ్యామిలీ అత్యధికంగా ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం కూడా ఆత్మకూరే. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఒక ఉపఎన్నికతో సహా 15 సార్లు ఎన్నికలు జరగగా వీటిలో అత్యధిక సార్లు కాంగ్రెస్‌ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి ఆత్మకూరు అంత అనుకూలమైన నియోజకవర్గం కాదు. ఇక్కడ నుంచి టీడీపీ రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. ఇక గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీకి గత దశాబ్ద కాలంగా ఈ నియోజకవర్గంలో సరైన అభ్యర్థి లేకపోవడం కూడా ప్రధాన మైన‌స్‌. తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో 1983, 1994లో మాత్రమే విజయం సాధించింది.

ఆనం కంచుకోట‌గా ఆత్మ‌కూరు

గత ఎన్నికల్లో ఇక్కడ ఫ్యాన్‌ జోరుకు టీడీపీ పూర్తిగా బేజారైంది. వైసీపీ నుంచి పోటీ చేసిన మేకపాటి గౌతమ్‌ రెడ్డి తన సమీప ప్రత్యర్థి జీఎమ్‌.కన్నబాబుపై ఏకంగా 31,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో వైసీపీకి వచ్చిన ఓట్ల మెజారిటీతోనే టీడీపీ నెల్లూరు లోక్‌సభ సీటును సైతం స్వల్ప తేడాతో కోల్పోయింది. ఆ ఎన్నికల్లోనే కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన అప్పటి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఓటమి పాలయ్యారు. ఇక ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకుని కొద్ది రోజుల పాటు ఆత్మకూరు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. అయితే జిల్లాలో ఉన్న గ్రూపు తగాదాల నేపథ్యంలో ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలోకి జంప్‌ చేసి ప్రస్తుతం వెంకటగిరి నుంచి పోటీలో ఉన్నారు. అయితే గతంలో ఆనం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడంతో ఇప్పుడు వైసీపీకి ఆయన వర్గం అదనపు బలం అయ్యింది.

పారిశ్రామిక‌వేత్త‌ను దింపిన టీడీపీ

ఆనం పార్టీ మారాక ఆత్మకూరు టీడీపీ మళ్ళీ దిగజారగా టీడీపీ వ్యూహాత్మకంగా 1999లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి 2000 ఓట్ల మెజారిటీతో అప్పటి టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడుపై విజయం సాధించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త బొల్లినేని కృష్ణయ్యను రంగంలోకి దింపింది. వచ్చే ఎన్నికల్లో కృష్ణయ్య ఆత్మకూరు అభ్యర్థి అవ్వడం దాదాపు ఖరారు అయినట్టే. కృష్ణయ్య ఎంట్రీతో ఆత్మకూరు పాలిటిక్స్‌లో సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆయనకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడుతో పాటు జిల్లా పరిషత్ ఛైర్మ‌న్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, డీసీసీబీ ఛైర్మ‌న్‌ ధనుంజయ్‌ రెడ్డి తదితరులు ప్రచారం చేస్తుండడంతో టీడీపీకి ఇక్కడ బలం పెరిగినట్లు అయ్యింది. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కన్నబాబు మాత్రం కృష్ణయ్యకు ఎంత వరకు సపోర్ట్‌ చేస్తారన్నది చెప్పలేని పరిస్థితి.

ఇప్ప‌టికైతే ముందంజ‌లో వైసీపీ

వాస్తవంగా చూస్తే బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కొమ్మి లక్ష్మయ్య నాయుడు, కన్నబాబు వీళ్లంతా కూడా టీడీపీ టిక్కెట్‌ ఆశించే వారే. టీడీపీకి సపోర్ట్‌ చేసే వారి పరిస్థితి ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం ప్రస్తుతం నియోజకవర్గంలో వైసీపీకి కాస్త ఎడ్జ్‌ కనపడుతోంది. అయితే టీడీపీలో టిక్కెట్‌ ఆశిస్తున్న పంచ పాండవులందరూ కృష్ణయ్యకు ఏకతాటి మీదకు వచ్చి సపోర్ట్‌ చేస్తే ఆయన గెలిచే ఛాన్సులు కూడా ఉన్నాయి. కృష్ణయ్యకు వ్యక్తిగతంగా సౌమ్యుడిగా, అందరివాడుగా గుర్తింపు ఉండడం కలిసి రానుంది. ఏదేమైన ఆత్మకూరులో తుది పోరు బొల్లినేని కృష్ణయ్య వర్సెస్‌ గౌతమ్‌ రెడ్డి మధ్య‌ జరగనుంది. మరి వీరిలో ఆత్మకూరు ప్రజలు ఎవరిని అందలం ఎక్కిస్తారో చూడాల్సి ఉంది.

 

Tags:    

Similar News