నిమ్మగడ్డ సీటుకు సీఎం పదవి తూకమా ?

నిమ్మగడ్డ రమేష్ కుమార్. మాజీ ఐఏఎస్ అధికారి. ఆయన గతంలో వివిధ హోదాల్లో ఏపీకి ఒక ఉన్నతాధికారిగా సేవలు అందించారు. పదవీ విరమణ అనంతరం ఆయన్ని మెచ్చి [more]

Update: 2020-07-27 03:30 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్. మాజీ ఐఏఎస్ అధికారి. ఆయన గతంలో వివిధ హోదాల్లో ఏపీకి ఒక ఉన్నతాధికారిగా సేవలు అందించారు. పదవీ విరమణ అనంతరం ఆయన్ని మెచ్చి చంద్రబాబు ఎస్ఈసీగా నియమించారు. ఆయన పేరు ఎక్కడా ఈ ఏడాది మార్చి వరకూ బయటకు వచ్చిన దాఖలాలు లేవు. ఆయన గురించి తెలియాల్సిన అవసరం కూడాలేదు. ఆయన బాధ్యత స్థానిక ఎన్నికలు నిర్వహించడం వరకే. చంద్రబాబు ఏరి కోరి తెచ్చి పెట్టుకున్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు పని అప్పగించలేకపోయారు. కానీ జగన్ సీఎం అయిన ఏడాదిలోనే ఎన్నికలు నిర్వహించాలనుకోవడంతోనే నిమ్మగడ్డకు చేతి నిండా పని తగిలింది. ఆయన అసలైన హోదా కూడా అపుడే బయటకు వచ్చింది.

చెప్పేసుకున్నారుగా …..

సరే నిమ్మగడ్డ రమేష్ కుమార్ హఠాత్తుగా స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో కనీస మాత్రంగా కూడా చెప్పకుండా తీసుకున్న నిర్ణయం తప్పే. ఎందుకంటే నిమ్మగడ్డ ఒక్కరే ఎన్నికలను నిర్వహించలేరు. అలాంటపుడు ఆయన ఒక్కరే కీలక నిర్ణయం కూడా తీసులేరు. ఇది లాజిక్ కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మనసులో ఏదో ఉంచుకునే అలా చేశారన్నది తరువాత ఆయన కేంద్రానికి రాసినట్లుగా చెప్పబడుతున్న ఒక లేఖ ద్వారా స్పష్టమైంది. ఆ తరువాత నిన్నటి దాకా ఆయన పోయిన పోకడలన్నీ జగన్ కి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఒక హోటల్లో ఆయన టీడీపీ బీజేపీ నేతలతో భేటీలు వేయడం కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అచ్చమైన రాజకీయ ప్రత్యర్ధి అని తటస్తులు సైతం అనుకునేట్లుగా చేశాయి.

అంత పంతమా….?

సరే ఇవన్నీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద వచ్చిన నిందలు, అపనిందలు అనుకున్నా కూడా ప్రభుత్వ పెద్దగా జగన్ కి అంత పంతమా అన్న చర్చ ఇపుడు వస్తోంది. హైకోర్టు, సుప్రీం కోర్టులో న్యాయమూర్తులు చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు చూసినపుడు జగన్ సర్కార్ మొండితనం ఏంటన్నది అర్ధమవుతోంది. ఒక రాజ్యాంగబధ్ధమైన పదవిలో ప్రభుత్వాధినేతగా జగన్ ఉన్నారు. ఆయనకు మరో రాజ్యాంగ వ్యవస్థతో ఘర్షణలు అవసరం లేదు, అది వీలు కాదు కూడా. ప్రజాస్వామ్యంలో ప్రతీ వ్యవస్థకూ ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా అందరి కంటే ముందుగా ఈ వ్యవస్థలను గౌరవించాల్సిన అవసరం ఉంది. పంతానికి పోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని విశ్లేషణలు ఉన్నాయి.

అవసరమా…?

జగన్ విషయం తీసుకుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన రచ్చ విషయంలో ఎక్కడా తగ్గదలచుకోలేదని స్పష్టమవుతోంది. ఓ విధంగా జగన్ ఇగోను నిమ్మగడ్డ బాగా హర్ట్ చేశారని అన్న మాట ఉంది. జగన్ సర్కార్ని ఫ్రాక్సనిస్టులతో గా పోల్చడం నిజంగా తట్టుకోలేనిదే. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక చంద్రబాబు ఉన్నారని జగన్ అనుమానం. దాన్ని నిజం చేసేలా బాబు నీడ లాంటి సుజనా చౌదరితో నిమ్మగడ్డ భేటీలు వేయడం కూడా యువ సీఎం తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. ఆయనకు ఆ సీటు అప్పగించి ఆయన ముఖం జగన్ చూడాలనుకోవడంలేదుట. దాని కోసం ఎందాకైనా వెళ్ళాలనుకుంటున్నట్లుగా కూడా చెబుతున్నారు. ఇక తాను నియమించిన జస్టిస్ కనగరాజ్ ని కూడా సుప్రీం కోర్టులో వేసిన కేసులో ఇంప్లీడ్ అయ్యేలా వైసీపీ పెద్దలు పావులు కదుపుతున్నారన్నది తాజా ప్రచారం.

కలవరమేనా …..

జగన్ పదేళ్ళ పోరాటం చేసి సంపాదించుకున్నది సీఎం సీటు. ఆయన ముప్పయ్యేళ్ళ పాటు ఉంటానని చెప్పారు. అలాగే కార్యాచర‌ణ కూడా రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నియమించబడినది. ఆయన మహా అయితే మరో ఏడెనిమిది నెలలు మాత్రమే ఎస్ఈసీగా ఉంటారు. అటువంటి పదవి విషయంలో జగన్ ఇంత పట్టుదలగా పోవడం మంచిదేనా అన్న మాట వైసీపీలో ఉంది. పైగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద కసి కోపం కాస్తా ఇపుడు వేరేగా మారుతోంది అంటున్నారు. ఓ వైపు న్యాయ స్థానాలు ఉన్నాయి. వాటితో ఘర్షణ మంచిది కాదని కూడా సూచనలు వైసీపీకి అందుతున్నాయి. ఏపీలో రాష్ట్రపతి పాలన పెడతారు అని ప్రత్యర్ధులు అంటున్నారు. కోర్టులతో ఘర్షణ ముదిరితే ఏం జరుగుతుందో కూడా ఎవరూ ఊహించలేనిదే. కానీ జగన్ మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీటుకు తన సీఎం పదవినే తూకానికి పెట్టేస్తున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News