నిమ్మగడ్డను వదిలే ప్రసక్తి లేదట..తిరుపతి ఎన్నిక తర్వాత?

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను భవిష్యత్ లో అనేక కేసులు ఎదురు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డను ఉపేక్షించే అవకాశాలు లేవని [more]

Update: 2021-04-20 08:00 GMT

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను భవిష్యత్ లో అనేక కేసులు ఎదురు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డను ఉపేక్షించే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పదవీ విరమణ చేశారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ కే పరిమితమయ్యారు. అయితే గత ఒకటిన్నర సంవత్సరాల నుంచి ఆయన రాష్ట్ర ప్రభుత్వం పట్ల వ్యవహరించిన తీరును ఇప్పటికీ జగన్ సర్కార్ మర్చిపోలేకపోతుందట.

కేసులు తవ్వి తీయాలని…..

అందుకే ఆయనపై కేసులు తవ్వి తీయాలన్న యోచనలో జగన్ సర్కార్ ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోంశాఖకు గతంలో రాసిన లేఖ పై సీఐడీ విచారణ అప్పట్లో జరిగింది. ఆ లేఖ టీడీపీ కార్యాలయంలో తయారయిందని అప్పట్లో ఆరోపణలు విన్పించాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తయారైన ఆ లేఖను కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంపారని ప్రభుత్వం అనుమానిస్తుంది.

జగన్ ను ఫ్యాక్షనిస్టుగా…..

ఆ లేఖలో కూడా జగన్ ను ఫ్యాక్షనిస్టుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొనడాన్ని జగన్ ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారట. దీంతో ఆ కేసును తవ్వితీసేందుకు యత్నాలు ప్రారంభమయినట్లు తెలిసింది. ఈ కేసులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఖచ్చితంగా ఇబ్బంది పడతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రిపై తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉండి టీడీపీ, బీజేపీ నేతలతో సంబంధాలు కొనసాగించడంపైన కూడా సీఐడీ ఆరా తీయనుంది. దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించింది.

ప్రివిలేజ్ కమిటీ…..

ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై హక్కుల ఉల్లంఘన తీర్మానం ఎటూ ఉండనే ఉంది. ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. తనను హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఇప్పటికీ ఆయన సహించలేకపోతున్నారు. దీంతో తిరుపతి ఉప ఎన్నికల తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వరస కేసులు చుట్టుముట్టే అవకాశముందని తెలుస్తోంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ నిధులతో న్యాయవాదులను నియమించుకున్న నిమ్మగడ్డఇక సొంత ఖర్చులు భరించాల్సిందేనని ఒక వైసీపీ నేత వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News