లక్ష్మణుడే ..రేఖ దాటితే…?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజ్యాంగబద్ధమైన పదవి. రాజకీయ చదరంగంలో పడితే బురద పులుముకోక తప్పదు. నిజమా? అబద్ధమా? అన్నది తర్వాత తేలే సంగతి. ముందుగా ప్రజల [more]

Update: 2020-06-25 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజ్యాంగబద్ధమైన పదవి. రాజకీయ చదరంగంలో పడితే బురద పులుముకోక తప్పదు. నిజమా? అబద్ధమా? అన్నది తర్వాత తేలే సంగతి. ముందుగా ప్రజల దృష్టిలో పలచన అయిపోతే చాలు. ప్రత్యర్థి రాజకీయ పార్టీకి ఆ మేరకు ప్రయోజనం సిద్ధించినట్లే. అందుకే రాజకీయ పార్టీలు అదిగో పులి. అంటే ఇదిగో తోక అంటుంటాయి. కనీస ఆధారాలు సైతం లేకుండా ప్రత్యర్థులపై ఆరోపణలు గుప్పిస్తుంటాయి. లేదంటే ఉన్న చిన్నపాటి ఆధారాలకు అతిశయోక్తులు జోడిస్తుంటాయి. ఏపీలో ప్రధాన ప్రాంతీయ పార్టీల అధినేతల మధ్య వ్యక్తిగత శత్రుత్వం బాగా ముదిరిపోయింది. రాజకీయాల స్థాయిని ఎప్పుడో దాటిపోయింది. పార్టీలు కుటుంబ ఆస్తులుగా మారిపోయిన క్రమంలో ఈ దురవస్థ తప్పదు. కానీ ఈ క్రమంలో రాజ్యాంగ వ్యవస్థలు బదనాం అయిపోతున్నాయి. పార్టీ పాలిటిక్స్ కు బలైపోతున్నాయి.

పావుగా మారి…

ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిన్నామొన్నటివరకూ పెద్దగా వివాదాస్పదుడు కాదు. ఐఏఎస్ అధికారిగా తన కెరియర్ లోనూ ఆరోపణలు తక్కువే. రాజకీయ పార్టీలకు ఆయన చేరువా కాదు. దూరమూ కాదు. గవర్నర్ గా పనిచేసిన నరసింహన్ పుణ్యమా, అని రాజ్యాంగ పదవిలో ప్రతిష్ఠితుడయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ పెట్టిన దాఖలాలు లేవు. అందువల్ల ఆ పదవిలో ఎవరున్నా ఫర్వాలేదనే ధోరణితోనే అంగీకరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాతనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రాధాన్యం పెరిగింది. ప్రభుత్వానికి, ఆయనకు సత్సంబంధాలకు మొదట్లో ఇబ్బందులేమీ ఎదురు కాలేదు. కరోనా పేరుతో ఎన్నికల వాయిదా వేయడంతో మొదలైన గొడవను ప్రభుత్వము, ప్రధాన ప్రతిపక్షమూ తమ బలాబలాలు తేల్చుకునే ప్రహసనంగా మార్చివేశాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పావుగా మారిపోయారు. పదవి రీత్యా, వ్యక్తిగతంగా ఆయనకు జరిగిన నష్టం ఎక్కువే. కానీ నిస్సహాయ స్థితిలో కూడా బ్యాలెన్స్ పాటించాలనే నియమాన్ని పక్కన పెట్టేయడంతో రాజకీయ ముద్ర వేయించుకోవాల్సి వచ్చింది.

రెంటికీ చెడి…

ప్రభుత్వం తో తన పదవి కోసం న్యాయపోరాటం చేస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. తన ప్రవర్తనను , దైనందిన చర్యలను సైతం సర్కారు నిశితంగా గమనిస్తోందని తెలుసు. హైకోర్టులో తీర్పు తనకు అనుకూలంగా వచ్చింది. సుప్రీం కోర్టు సైతం రాజ్యాంగ వ్యవస్థల స్వేచ్ఛను కాపాడాలనే చెప్పింది. హైకోర్టు తీర్పును నిలుపుదల చేయలేదు. న్యాయ వ్యవస్థతో పాటు ఎన్నికల కమిషనర్ నియామక అధికారం కలిగిన గవర్నర్ ను, రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నిర్వహణకు ఆటంకం కలిగిస్తోంది కాబట్టి కేంద్ర న్యాయ, హోంశాఖలను సంప్రతించే స్వేచ్ఛ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఉంటుంది. రాజకీయ నాయకుల చేతిలో పావుగా మారిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ విషయాన్ని విస్మరించారు. సుజనా చౌదరి వంటి వ్యక్తిని కలిసి తన నిష్పాక్షికతను ప్రశ్నార్థకం చేసుకున్నారు. న్యాయపరంగా ఇంతవరకూ లభించిన అడ్వాంటేజ్ ను నైతికంగా చేజేతులారా పోగొట్టుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి నిజంగా కావాల్సింది రమేశ్ కుమార్ పై ఆధిపత్యం కాదు. అతనిని ప్రాతిపదికగా చూపిస్తూ తెలుగుదేశం పార్టీని ప్రజల్లో పలచన చేయడమే. న్యాయపరంగా తన నిర్ణయాలు వీగిపోయినప్పటికీ రాజకీయంగా ఆమేరకు సర్కారు పైచేయి సాధించిందనే చెప్పాలి. సుజనా చౌదరితో భేటీ కావడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వయంగా ఆ అవకాశం కల్పించారు. తెలుగుదేశం అధిష్టానం సైతం ఈ ఎపిసోడ్ లో అతని తీరును సమర్థించలేకపోతోంది.

న్యాయంగా…

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమంటే ఇదే. రాజకీయ పార్టీల అండతో న్యాయపరంగా పోరాటం చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగ వ్యవస్థలను వినియోగించుకోవడంలో వైఫల్యం చెందారనే చెప్పాలి. హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే గవర్నర్ ను ఆశ్రయించి ఉండాల్సిందనేది నిపుణుల మాట. ఒకవేళ తనకు న్యాయం జరగకపోతే కేంద్ర హోం, న్యాయశాఖలనూ సంప్రదించి ఫిర్యాదులు చేసేందుకు ఆస్కారం ఉంది. సుప్రీం కోర్టు తీర్పు వచ్చేలోపు తనకున్న రాజ్యాంగ పరిధులను వినియోగించుకోలేదు. గవర్నర్ ను, కేంద్రాన్ని ఆశ్రయిస్తే రాష్ట్రప్రభుత్వం ,వైఎస్సార్ కాంగ్రెసుపార్టీ తప్పు పట్టే పరిస్థితి ఉండదు. కానీ తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిన నేతను ఆశ్రయించి ఉపశమనం పొందాలనుకోవడంతోనే సమస్య వచ్చి పడింది. నిష్పక్షపాతంగా ఉండటమే కాదు, ఉన్నట్లుగా కనిపించడమూ రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి అవసరం. అందులోనూ సందర్బాన్ని మరిచి వ్యవహరిస్తే నష్టపోక తప్పదు. న్యాయస్థానాల చీవాట్లు, వ్యతిరేక తీర్పులతో తలబొప్పి కట్టి ఉన్న వైసీపీ సర్కారుకు ‘నిమ్మగడ్డ’ రాజకీయంగా ఉపశమనం కలిగించారు. అందుకే అంటారు ‘సీజర్స్ వైఫ్ మస్ట్ బీ ఎబౌ సస్పిషన్’ అని. సంయమనం పాటించలేకపోతే చతికిలపడటం ఖాయం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News