ప్రజల వద్దకు పాలన – “సఫోకేషన్”

మహా నటుడు, మహా నాయకుడు ఎన్టీఆర్ జయంతి నేడు. తెలుగు సినిమా రంగంలో తిరుగులేని మహానటుడు ఎన్టీఆర్ 1980 దశకంలో రాజకీయ రంగప్రవేశం చేసి మహా నాయకుడిగా [more]

Update: 2020-05-28 12:30 GMT

మహా నటుడు, మహా నాయకుడు ఎన్టీఆర్ జయంతి నేడు. తెలుగు సినిమా రంగంలో తిరుగులేని మహానటుడు ఎన్టీఆర్ 1980 దశకంలో రాజకీయ రంగప్రవేశం చేసి మహా నాయకుడిగా ఎదిగారు. చెన్నైలో ఉండడం వల్ల, అప్పటికే సినిమా రంగం నుండి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతుండడంతో, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీకి “స్పేస్” ఉండడంతో ఇంకా అనేకానేక కారణాలతో ఎన్టీఆర్ తెలుగు ప్రజల రాజకీయ కథానాయకుడు కూడా అయ్యారు.

ప్రజలకు పెద్ద పీట…..

సినిమాల్లో హీరోగా నటించిన ప్రభావమో లేక స్వతహాగా ఉన్న అభిప్రాయమో కానీ తన రాజకీయాల్లో, పరిపాలనలో ప్రజలకు ఎన్టీఆర్ అగ్రపీఠం వేశారు. “ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం” అనే నినాదం కేవలం జనాకర్షక నినాదంగా మిగిలిపోకుండా వాస్తవ రూపం ఇచ్చారు. కిలో రెండురూపాయలకే బియ్యం ఇచ్చి లక్షలాది లోగిళ్ళలో అన్నం పెట్టిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్. అప్పటికే ఇందిరా గాంధీ తెచ్చిన 20 సూత్రాల పధకం అమలులో ఉన్నప్పటికీ అది చాలా వరకు కాగితాలకే పరిమితమైన కాలంలో అందులోని ప్రాధమిక సూత్రాలకు కార్యరూపం ఇచ్చింది మాత్రం ఎన్టీఆర్. పేదరిక నిర్మూలన, ప్రజలకు అధికారం, రైతులకు చేయూత, కార్మిక సంక్షేమం, ఆహార భద్రత, అందరికీ పక్కా ఇళ్ళు, ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఎస్సి, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం, మహిళా సంక్షేమం, బాలల సంక్షేమం వంటి కార్యక్రమాలను కాగితాలనుండి బయటకు తీసి అమలులో పెట్టిన ఘనత ఎన్టీఆర్ దే.

కిలో రెండు రూపాయల బియ్యంతో….

కిలో రెండు రూపాయల బియ్యం చాలా గొంతులోకి వెచ్చగా దిగింది. అప్పటికి సజ్జలు, రాగులు, జొన్నలు తింటున్న అనేకానేక కుటుంబాలు మొదటిసారి వరి అన్నం తిన్న అదృష్టాన్ని కల్పించింది ఎన్టీఆర్. ఇక పక్కా ఇళ్ళు (పెంకుటిళ్ళు) నిర్మించడం, పరిపాలనను ప్రజల ముంగిటకు తెచ్చేందుకు సంస్కరణలు చేపట్టి తాలూకాలను రద్దు చేసి మండల వ్యవస్థ తీసుకురావడం, కారణం, మునుసుబుల పాలన తొలగించి వారి స్థానంలో అధికారులను కూర్చోబెట్టడం చాలా ప్రాముఖ్యమైన సంస్కరణలు.రాజధాని నగరానికి పరిమితమైన పాలనను, ప్రభుత్వ కార్యాలయాల్లో కాగితాలకు పరిమితమైన సంక్షేమ పధకాలను జుట్టుపట్టుకుని ప్రజల గుమ్మంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దే.

వారి ప్రాముఖ్యత దెబ్బతినడంతో…..

ఈ చర్యలతో అధికారులు, రాజకీయ నాయకులు, ఇతరత్రా వ్యక్తులకు ప్రాముఖ్యత పోయింది. తినడానికి కిలో రెండురూపాయల బియ్యం, ఉండడానికి పక్కా ఇల్లు, ఆమడ దూరంలోనే అధికారులు (మండల కార్యాలయం) ఉండడంతో రాజకీయనాయకులు, గ్రామ పెద్దల ప్రభావం తగ్గిపోయింది. పైగా ఎన్టీఆర్ ప్రజలకు అన్నీ తానే అయి అధికారులను పరుగెత్తించడం, ప్రజలవద్దకు పాలన తీసుకెళ్ళడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు జవాబుదారిగా చేయడంతో అధికారులకు పని భారం పెరిగింది, రాజకీయ నాయకులకు పనిలేకుండా పోయింది. ఒకటికి పాతిక సార్లు తమ చుట్టూ ప్రజలను తిప్పుకోడానికి అలవాటుపడిన అధికారులు (ఉద్యోగులు) ప్రజలవద్దకు పాలన అంటే కష్టంగా అనిపించింది. ప్రతి పనికీ తమపై ఆధారపడే ప్రజలు ఇప్పుడు తమకోసం రాకపోవడంతో రాజకీయ నాయకులకు ఊపిరి ఆడలేదు.

వారికి పనేముంటుంది?

పాలకుడు ప్రజల సంక్షేమానికి అగ్రపీఠం వేస్తే అధికారులకు, రాజకీయనాయకులకు పనీ, ప్రాబల్యం ఏముంటుంది? పరిపాలన ప్రజల ముంగిట్లో పెట్టడంతో అధికారులకు, రాజకీయ నాయకులకు పనిలేకుండా పోవడమే కాదు, వారి ప్రాధాన్యత తగ్గి చాలా అసౌకర్యంగా “ఫీల్” అవడం మొదలు పెట్టారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అధికారులు తమ దర్పం ప్రదర్శించుకునే అవకాశం ఉండదు. రాజకీయ నాయకుల పెత్తనం చెల్లదు. అలవాటుపడి, అంగీకరించి ఎన్టీఆర్ అందించజూసిన స్వాతంత్య్ర ఫలాలు ప్రజలకు అందేందుకు సహకరించి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవి. కానీ అవి మింగుడు పడలేదు. జీర్ణం కాలేదు.అటు అధికారుల్లోనూ, ఇటు రాజకీయ నేతల్లోనూ చాలా “సఫోకేషన్” (suffocation) మొదలయ్యింది.

ప్రయత్నం ఫలించడంతో……

ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకున్న ఎన్టీఆర్ ను ధిక్కరించడం అందునా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతను కాదని “ప్రజలు దేవుళ్ళు కారు – సమాజం దేవాలయం కాదు” అని చెప్పడానికి, “అధికారులే దేవుళ్ళు, రాజకీయమే దేవాలయం” అని నిరూపించడానికి, “సఫోకేషన్” నుండి బయటపడడానికి అధికారులు, రాజకీయ నాయకులూ ఎదురు చూస్తున్న సమయంలో “లక్ష్మీ పార్వతి” రూపంలో వారికో అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని వాస్తవరూపంలోకి తెచ్చేందుకు ఒక నాయకుడు దొరికాడు. ప్రయత్నం ఫలించింది. “సఫోకేషన్” నుండి ఉపశమనం దొరికింది. ప్రజలు వెనక్కు వెళ్ళారు. రాజకీయ నాయకుడు దేవుడయ్యాడు. రాజకీయం దేవాలయం అయింది. అధికారులు మాత్రం అటు సేవకులు కాలేక, ఇటు ఆధిపత్యం చలాయించలేక పోకచెక్కల్లా మిగిలిపోయారు.

గ్రామ సచివాలయాల పేరుతో….

ఎన్టీఆర్ తర్వాత ప్రజలకు, ప్రజా సంక్షేమానికి మరోసారి పట్టం కట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అధికారం గ్రామ సచివాలయాల రూపంలో ప్రజల గుమ్మాల్లోకి వెళ్ళింది. పాలన ప్రజల వాకిట్లోకి వచ్చింది. సంక్షేమం బ్యాంకు ఖాతాల్లోకి వెళుతోంది. ఈ వ్యవహారంతో అటు అధికారుల్లో అలజడి, ఇటు రాజకీయ నాయకుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. పాలన మళ్ళీ ప్రజలవద్దకు వెళుతోంది. ప్రజలు దేవుళ్ళు అవుతారో, సమాజం దేవాలయం అవుతుందో లేదో తెలియదు గాని ప్రయాణం అటువైపే సాగుతోంది.సంక్షేమ లబ్ధిదారుల ఎంపిక నేరుగా జరుగుతోంది. అధికారుల దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. ప్రజల సంక్షేమం ప్రాధమిక సూత్రంగా పాలన నడుస్తున్నప్పుడు, తమ ప్రాధాన్యం తగ్గుతున్నప్పుడు, తమ ప్రాబల్యం క్షీణిస్తున్నప్పుడు అధికారుల్లో, మరీ ముఖ్యంగా నాయకుల్లో “సఫోకేషన్” మొదలవుతుంది.

సఫొకేషన్ నుంచి బయటపడతారా?

అది ఇప్పుడు కూడా మెల్లగా మొదలవుతోంది. “ప్రజలే దేవుళ్ళు” అనడానికి బాగుంటుంది కానీ అది కార్యరూపంలో చూడ్డం మింగుడు పడని పరిస్థితి. అధికారులు పెత్తనాన్ని వదులుకోరు. రాజకీయ నాయకులు తమ ప్రాబల్యం కోల్పోవడానికి ఇష్టపడరు. అధికారుల ప్రభావం, నాయకుల ప్రమేయం తగ్గుతోంది. తమ ప్రమేయం లేకుండా జరిగిపోతున్న పనుల పట్ల నేతల్లో అసంతృప్తి రేగుతోంది. ఈ పరిస్థితే వారిలో “సఫోకేషన్” తెస్తుంది. ఈ “సఫోకేషన్” నుండి బయటపడేందుకు అప్పట్లో ఒక కారణం దొరికింది. ఒక నేత దొరికారు. ఒక విజయం వరించింది. మరి ఇప్పుడు?

 

-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News