Ys jagan : సలహాదారులు ఎక్కువైపోతున్నారేమో?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సలహాదారులు ఎక్కువయ్యారు. హైకోర్టు తప్పు పట్టినా జగన్ ప్రభుత్వం మాత్రం సలహాదారుల నియామకం విషయంలో వెనక్కు తగ్గడం లేదు. తాజాగా ఏపీ ఎన్జీవోల సంఘం [more]

Update: 2021-10-05 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సలహాదారులు ఎక్కువయ్యారు. హైకోర్టు తప్పు పట్టినా జగన్ ప్రభుత్వం మాత్రం సలహాదారుల నియామకం విషయంలో వెనక్కు తగ్గడం లేదు. తాజాగా ఏపీ ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిని ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. ఆయనను ఉద్యోగుల సర్వీస్ ల మ్యాటర్ విషయంలో సలహాదారుగా నియమించారు. దీంతో ప్రభుత్వ సలహాదారుల సంఖ్యను మరింత పెంచుకుంది.

యాభై మందికి పైగానే…

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు యాభై మంది సలహాదారులను నియమించింది. వీరికి లక్షల్లో వేతనంతో పాటు వసతి, వాహన సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. సలహాదారులను నియమించుకోవడంలో తప్పులేదు. కానీ ఇంత పెద్ద సంఖ్యలో నియమించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీరి నియామకం తర్వాత కొందరి ఆచూకీ కూడా కన్పించకపోవడం విశేషం.

తప్పులేదు కాని….

ఇప్పటికే హైకోర్టు సలహాదారుల నియామకంపై తప్పుపట్టింది. సలహాదారులను నియమించుకోవడంలో తప్పు లేదు కాని వారు రాజకీయ వ్యాఖ్యలు చేయడం, సమీక్షల్లో పాల్గొనడాన్ని హైకోర్టు గతంలో తప్పుపట్టింది. ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన వారి పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. వీరు తమ పదవీకాలంలో ప్రభుత్వానికి అవసరమైన సలహాలను, సూచనలను ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితులలో…

జగన్ సంగతి తెలిసిన వారు ఎవరైనా సలహాలు స్వీకరించరంటారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఏమాత్రం బాగాలేదు. ఈ పరిస్థితుల్లో సలహాదారులను నియమించుకోవడం ఎందుకన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య సంధాన కర్తగా చంద్రశేఖర్ రెడ్డి నియామకం జరిగిందంటున్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో నేరుగా చర్చించడానికి ఈయన ఉపయోగపడతారు. ఉద్యోగుల బదిలీలు, సీపీఎస్ విధానం, డీఏ తదితర అంశాలపై ఉద్యోగ సంఘాలతో ఈయన సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. చంద్రశేఖర్ రెడ్డి నియామకంతో మరోసారి సలహాదారుల అంశం తెరపైకి వచ్చింది.

Tags:    

Similar News