“కోత” పెట్టడం మామూలుగా లేదుగా?

వందేళ్లకు పైగా చరిత్ర, సుదీర్ఘకాలం ఇటు కేంద్రంలో, అటు రాష్రాల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సమస్యల సంద్రంలో కొట్టుమిట్టాడుతోంది. ఏం చేయాలోతెలియక అయోమయంలో ఉంది. [more]

Update: 2021-09-06 16:30 GMT

వందేళ్లకు పైగా చరిత్ర, సుదీర్ఘకాలం ఇటు కేంద్రంలో, అటు రాష్రాల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సమస్యల సంద్రంలో కొట్టుమిట్టాడుతోంది. ఏం చేయాలోతెలియక అయోమయంలో ఉంది. వరుసగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి, ఒక్కొక్కటిగా చేజారిపోతున్న రాష్రాలు, అధికారంలో ఉన్నచోట్ల అంతర్గత కలహాలు పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ ల్లో పరిస్థితులు ఎంతమాత్రం సాఫీగా లేవు. సహజంగానే ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దీనికి తోడు తాజాగా మరో సమస్య కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అదే ఆర్థిక సంక్షోభం.
రోజువారీ అవసరాలకు కటకటలాడాలల్సిన పరిస్థితి నెలకొంది.

పొదుపు మంత్రం….

దీంతో కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా పొదుపు మంత్రం జపిస్తోంది. కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకుఅంటే కార్యకర్త నుంచి కార్యదర్శి వరకు ప్రతి ఒక్కరూ పొదుపు పాటించాలని సూచించింది. ఈ మేరకు కేంద్రమాజీ మంత్రి, పార్టీ కోశాధికారి పవన్ కుమార్ బన్సల్ పార్టీ ప్రముఖులకు వ్యక్తిగతంగా లేఖలు రాశారు. పార్టీ ఆర్థిక పరిస్థితి ఎంతమాత్రం బాగాలేదని, ఖర్చులు తగ్గించుకోవాలని బన్సల్ ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభ్యర్థించారు. అంతేకాక పార్టీకి చెందిన ప్రతి పార్లమెంటు సభ్యుడు ఏటా కనీసం రూ.50 వేలు విరాళంగా ఇవ్వాలని కోరారు. దీనితో పాటు ఏటా కనీసం ఇద్దరు సానుభూతి పరులతో రూ.40,000 వంతున విరాళం ఇప్పించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ పరమైన పనులకు సంబంధించి రైలు, విమాన ప్రయాణాల్లో అధికారికంగా లభించే సౌకర్యాలను వాడుకోవాలని తెలిపారు. దీని ద్వారా పార్టీ పై అదనపు భారం కొంతవరకు తగ్గుతుందని వివరించారు. కొందరు పార్లమెంటు సభ్యులు పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఉండటంతో బన్సల్ ఈ సూచన చేశారు.

ఖర్చులు తగ్గించుకోవాలని…

కాంగ్రెస్ పార్టీ కార్యదర్శులు అయితే 1400 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అది దాటితే తక్కువశ్రేణి విమాన ఛార్జీలు వారికి చెల్లిస్తారు. అది కూడా రైలు టిక్కెట్ కన్నా విమాన చార్జీ తక్కువగా ఉన్నప్పుడే ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. దీనిని కూడా నెలకు రెండుసార్లకే పార్టీ పరిమితం చేయడం గమనార్హం. రోజువారీ ఖర్చులపైనా పార్టీ పరిమితులు విధించింది. విద్యుత్తు, ఇంధనం, క్యాంటీన్ తదితర ఖర్చులనూ తగ్గించుకోవాలని పవన్ కుమార్ బన్సల్ ప్రత్యేకంగా కోశాధికారి హోదాలో సూచించారు. ఇక కాంగ్రెస్ పార్టీ కార్యదర్శులకు ఇచ్చే భ్రుతిలోనూ కోత విధించారు. పార్టీ కార్యదర్శికి రూ.12వేలు, ప్రధాన కార్యదర్శికి రూ.15వేలు వంతు న భృతి ఇస్తుండగా దానిలోనూ కోత విధించారు. పార్టీకి వచ్చే ఆదాయంలోనూ గణనీయంగా కోత పడటం ఆందోళనకు గురి చేస్తోంది.

అధికారంలో లేకపోవడంతో…

గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆదాయం బాగా పడిపోయింది. 2018-19లో పార్టీకి రూ.383 కోట్ల మేరకు ఎన్నికల బాండ్లు రాగా, 2019-20లో రూ.318 కోట్లకు తగ్గడం పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదు. అదే సమయంలో అధికార భారతీయ జనతా పార్టీ ఆదాయంలో విశేష వృద్ధి కనపడుతోంది. కేంద్రంలో వివిధ రాష్టాల్లో అధికారంలో కొనసాగుతున్న కాషాయ పార్టీ ఆదాయం రూ.1450 కోట్ల నుంచి ఏకంగా రూ.2,555 కోట్లకు పెరగడం విశేషం. సహజంగా ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు దాని ఆర్థిక పరిస్థితి కచ్చితంగా బాగానే ఉంటుంది. పారిశ్రామికవేత్తలు విరాళాలు ఇవ్వడానికి బారులు తీరుతుంటారు. అడిగినంత ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఇందుకు కారణాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అధికార పార్టీతో వారికుండే వివిధ రకాల అవసరాలే వారిని ఈ దిశగా పయనింపజేస్తుంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో లేదు. అందువల్లే పార్టీకి వివిధ వర్గాల నుంచి విరాళాలు, రాబడిలో కోత పడుతోంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ కోశాధికారుల చాకచక్యం కూడా కొంతవరకు కారణమవుతుంది. గతంలో బిహార్ కు చెందిన సీతారాం కేసరి, మధ్యప్రదేశ్ కు చెందిన మోతీలాల్ వోరా వంటి దిగ్గజాలు ఆర్థిక వ్యవహారాలను పకడ్బందీగా నిర్వహించే వారు. ఇప్పుడూ పవన్ కుమార్ బన్సల్ పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు తన వంతు శ్రమిస్తున్నారు. అందులో భాగమే ఈ పొదుపు మంత్రం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News