ఓవర్ నైట్ ఛేంజ్ అయిందే

బెజవాడ రాజకీయాలు ఓవర్‌ నైట్‌లోనే ఆసక్తిగా మారాయి. నిన్న మొన్నటి వరకు విజయవాడలో బలమైన శక్తిగా ఉన్న టీడీపీ కేవలం తాజాగా జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక్క [more]

Update: 2019-08-04 05:00 GMT

బెజవాడ రాజకీయాలు ఓవర్‌ నైట్‌లోనే ఆసక్తిగా మారాయి. నిన్న మొన్నటి వరకు విజయవాడలో బలమైన శక్తిగా ఉన్న టీడీపీ కేవలం తాజాగా జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటమితో పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చి పడింది. గత 2014లో ఎన్నికల్లో తన సత్తాచాటిన టీడీపీ.. విజయవాడలోని ఒక్క పశ్చిమలో తప్ప మిగిలిన రెండు నియోజకవర్గాల్లోనూ విజయం సాధించింది. ఆ త‌ర్వాత ప‌శ్చిమ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ కూడా టీడీపీలో చేరిపోవ‌డంతో అస‌లు విజ‌య‌వాడ‌లో వైసీపీ ఉందా ? అన్న సందేహాలు క‌లిగాయి.

రెండు చోట్ల కూడా…..

అలాంటి ప‌రిస్థితి నుంచి ఐదేళ్లలో విజ‌య‌వాడ‌లో టీడీపీకి పూర్తి డిఫెన్స్‌లో ప‌డేసే స్థాయికి వైసీపీ ఎదిగిపోయింది. ఇక, ఇటీవల జరిగిన ఎన్నికల్లో.. పార్టీ విజయం సాధించడం ఖాయమని .. చంద్రబాబు భావించారు. అయితే, తూర్పు నియోజకవర్గం మినహా రెండు చోట్లా విజయం సాధించలేక పోయింది. తూర్పులో ఒక్క గ‌ద్దె రామ్మోహ‌న్ ఒక్క‌రు మాత్రమే విజ‌యం సాధించారు. ఇక ఎంపీగా కేశినేని నాని కొంత వ్యక్తిగ‌త ఇమేజ్‌తో గ‌ట్టెక్కారు.

ఉమ, అవినాష్ లు….

పార్టీ ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో పార్టీలో నేతలు జంప్‌ చేస్తారనే ప్రచారం సాగింది. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో 25 ఓట్ల కనీస తేడాతో ఓటమి పాలైన కాపు వర్గానికి చెందిన నాయకుడు బొండా ఉమా.. పార్టీ మార్పుపై అనేక ఊహాగానాలు వినిపించాయి. నిన్నటికి నిన్న ఆయన టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఇక, ఇప్పుడు ఏకంగా ఉరుములు లేని పిడుగు మాదిరిగా విజయవాడకే చెందిన యువ నాయకుడు దేవినేని అవినాష్‌తో పాటు ఆయ‌న భారీ అనుచరవర్గం కూడా టీడీపీకి దూరమైంది.

టీడీపీకి ఇబ్బందేనా…?

ఆయన సకుటుంబ సపరివార సమేతంగా టీడీపీకి రాజీనామా చేశారనే వార్త రాష్ట్రంలో అలజడి రేపుతోంది. ప్రస్తుతం ఆయన తెలుగు యువత అధ్యక్షుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఇక, దేవినేని వర్గం, వారి బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఈయన పార్టీ మార్పు ఖాయమైన నేపథ్యంలో టీడీపీకి ఇబ్బందేనని అంటున్నారు పరిశీలకులు. మరోపక్క, విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నాని కూడా పార్టీని వీడేందుకు మార్గం సుగమం చేసుకున్నట్టు ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన‌ప్ప‌టి నుంచే వార్త‌లు వ‌స్తున్నాయి.

చేతులెత్తేయడంతో…..

ఇక ఎంపీ కేశినేని వ‌ర్సెస్ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న సోష‌ల్ మీడియా వేదిక‌గా కొన‌సాగించిన వార్‌తో పార్టీ ప‌రువు కాస్తా బ‌జారున ప‌డిన‌ట్ల‌య్యింది. చివ‌ర‌కు శ‌నివారం జ‌రిగిన జిల్లా పార్టీ స‌మావేశంలో తాను న‌గ‌ర పార్టీ అధ్యక్షుడిగా ఉండ‌న‌ని వెంక‌న్న స‌మావేశం మ‌ధ్యలో నుంచే వెళ్లిపోయారు. ఇక కేశినేని అయితే ఆయన ఏకంగా జాతీయ పార్టీఈ బీజేపీనే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. గడిచిన రెండు నెలలుగా ఆయన టీడీపీలో రెబల్‌ ఎంపీగా ఉన్న‌ట్టే ఆయ‌న వ్య‌వ‌హారం ఉంది. వివాదాస్పద వ్యాఖ్యలను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం, సొంత పార్టీ నేతలపై ఆయన కస్సుబుస్సు లాడడం వంటివి ఆయన ఎంతో కాలం పార్టీలో ఉండరనే వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

ఖాళీ అవుతుందా…?

ఇక గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీపై వైసీపీలోకి వెళ్లిపోతార‌న్న పుకార్లు వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల‌కు ముందు నుంచే ఆయ‌న‌పై ఈ పుకార్లు ఉన్నాయి. చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్న వంశీ ఎప్పుడు ఎలాంటి డెసిష‌న్ అయినా తీసుకోవ‌చ్చంటున్నారు. ఇక మాజీ డిప్యూటీ స్పీక‌ర్ మండ‌లి బుద్ధప్ర‌సాద్ కూడా టీడీపీని వీడే ఆలోచ‌న‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా విజయవాడలోని కీలక నాయకులుగా ఉన్న బొండా, దేవినేని, కేశినేని కనుక పార్టీ వీడితే.. దాదాపు విజయవాడలో టీడీపీ ఖాళీ పోయినట్టేనని అంటున్నారు పరిశీలకులు.

Tags:    

Similar News