టీడీపీలోకి మ‌ళ్లీ ఆయన.. మారుతున్న రాజ‌కీయం

టీడీపీ మాజీ నాయ‌కుడు, ఆ పార్టీ నుంచి ప‌లుమార్లు గెలిచి.. గ‌తంలో మంత్రిగా కూడా ప‌నిచేసిన పాలేటి రామారావు.. ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. అయితే.. ఇక్కడ రాజ‌కీయాలు [more]

Update: 2021-04-23 00:30 GMT

టీడీపీ మాజీ నాయ‌కుడు, ఆ పార్టీ నుంచి ప‌లుమార్లు గెలిచి.. గ‌తంలో మంత్రిగా కూడా ప‌నిచేసిన పాలేటి రామారావు.. ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. అయితే.. ఇక్కడ రాజ‌కీయాలు ఆయ‌న‌కు న‌చ్చడం లేద‌ని.. త‌న‌పై ఆధిప‌త్య ధోర‌ణి కొన‌సాగుతోంద‌ని భావించిన ఆయ‌న తిరిగి.. త‌న పాత గూటికి చేరిపోవ‌డం ఖాయమైన‌ట్టే తెలుస్తోంది. దీనివెనుక ఏం జ‌రిగింది? పాలేటి రామారావు ఎందుకు తిరిగి టీడీపీలోకి రావాల‌ని అనుకుంటున్నారు? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. చీరాల నుంచి గెలిచిన క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణమూర్తి.. వ్యాపారాలు, కుమారుడి రాజ‌కీయ భ‌విష్యత్తు త‌దిత‌ర విష‌యాల నేప‌థ్యంలో ఆయ‌న అనూహ్యంగా వైసీపీకి మ‌ద్దతు దారుగా మారారు.

విలువ లేకుండా పోవడంతో….

ఇక‌, ఆయ‌నకు స్నేహితుడైన పాలేటి రామారావు కూడా టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరుకున్నారు. నాడు ఆమంచికి వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్సీ పోతుల సునీత‌, ప్రస్తుత చీరాల ఇన్‌చార్జ్ యెడం బాలాజీ ఇలా చాలా మంది టీడీపీలో క‌లిసి క‌ట్టుగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత క‌ర‌ణంతో పాటు వీళ్లంతా ( యెడం బాలాజీ మిన‌హా ) పార్టీ మారిపోయారు. ఇలా పార్టీ మార‌డం వెనుక ఎంతైనా త‌న‌కు కూడా గుర్తింపు ఉంటుంద‌ని భావించారు. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేకుండా పోయింది. దీంతో పాలేటి రామారావు తీవ్ర మ‌నస్థాపానికి గుర‌వుతున్నారు. ముఖ్యంగా త‌న‌కు విలువ లేకుండా పోవ‌డం.. త‌న అనుచ‌రుల‌కు కూడా ఆయ‌న ఏమీ చేయ‌లేక‌పోతుండ‌డం వంటి ప‌రిణామాలు ఎదుర‌వుతున్నాయి.

వైసీపీలో ఉన్నా….?

దీంతో పాలేటి రామారావు వైసీపీలో ఉండి ప్రయోజ‌నం లేద‌ని గుర్తించారు. రెండుసార్లు చీరాల ఎమ్మెల్యేగా ఎన్నికైన పాలేటి రామారావు మధ్యలో త‌ర్వాత ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ వైసీపీ గూటికి చేరారు. అయితే.. అక్కడ కూడా ఆశించిన విధంగా గుర్తింపు ల‌భించ‌క పోవ‌డంతో ఆయ‌న మ‌ళ్లీ టీడీపీలోకి చేరుకున్నారు. మ‌ళ్లీ గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. క‌ర‌ణంతో క‌లిసి.. వైసీపీ పంచ‌న చేరారు. అయితే.. ఇప్పుడు చీరాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఆయ‌న‌కు ఎదుర‌వుతున్న ప‌రాభ‌వాలు కార‌ణంగా.. తిరిగి పాలేటి రామారావు టీడీపీ వైపు చూస్తున్నార‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. క‌ర‌ణం దెబ్బకు ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీతే క‌క్కలేక మింగ‌లేక అసంతృప్తితో ర‌గులుతున్నారు. ఇక ఏ ప‌ద‌వి లేని పాలేటిని మాత్రం అక్కడ ఎవ్వరు ప‌ట్టించుకునే వాళ్లుంటారు.

టీడీపీలో చేరితేనే?

ఈ నేప‌థ్యంలోనే తాను వైసీపీలో కొనసాగినా ప్రయోజనం లేదని పాలేటి రామారావు నిర్ణయించుకున్నారు. మ‌రోవైపు.. ప్రస్తుతం చీరాలలో టీడీపీ నాయకత్వ కొరత ఎదుర్కొంటోంది. యెడం బాలాజీ ఇన్‌చార్జ్‌గా ఉన్నా ఆయ‌న సామ‌ర్థ్యంపై న‌మ్మకం లేదు.. అలాగ‌నీ అక్కడ గ‌త్యంత‌రం లేకే ఆయ‌న్ను కంటిన్యూ చేస్తోన్న ప‌రిస్థితి. ఈ క్రమంలో ఇప్పుడు క‌నుక టీడీపీలోకి వ‌స్తే.. తిరిగి తాను ప‌ట్టు సాధించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని పాలేటి రామారావు భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తను ప్రత్యామ్నాయంగా మారేందుకు సైతం అవ‌కాశం ఉంటుందని అంచ‌నా వేసుకుంటున్నారు. మ‌రి పాలేటి రామారావు కొత్త రాజ‌కీయం ఎలా మారుతుందో ? చూడాలి.

Tags:    

Similar News