పల్లా లీడ్ చేయలేకపోతున్నారా… ?

విశాఖ మెగా సిటీకి ప్రెసిడెంట్ గా మాజీ ఎమ్మెల్యే, బీసీ నేత అయిన పల్లా శ్రీనివాసరావుని చంద్రబాబు ఏరి కోరి నియమించారు. ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే [more]

Update: 2021-06-14 14:30 GMT

విశాఖ మెగా సిటీకి ప్రెసిడెంట్ గా మాజీ ఎమ్మెల్యే, బీసీ నేత అయిన పల్లా శ్రీనివాసరావుని చంద్రబాబు ఏరి కోరి నియమించారు. ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కాలం నుంచి టీడీపీని నమ్ముకుని ఉన్న ఫ్యామిలీ అది . ఇక బలమైన బీసీ యాదవ సామాజికవరం కావడంతో చంద్రబాబు ఆశలన్నీ పల్లా శ్రీనివాసరావు మీదనే ఉన్నాయి. అయితే పల్లా మాత్రం ఒంటెద్దు పోకడలు పోతున్నారని, పార్టీని సరిగ్గా లీడ్ చేయడంలేదని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు లేని అధికారాలను ఆయన చలాయిస్తూ అర్హులైన క్యాడర్ కి అన్యాయం చేస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు.

గాజువాక కోటలో….

గాజువాక ఎమ్మెల్యే సీటు మీద మీద చాలా మంది టీడీపీ నేతల కన్ను ఉంది. మధ్యలో ఒకసారి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళి వచ్చినా కూడా పల్లా శ్రీనివాసరావుని చంద్రబాబు సమాదరించి 2014, 2019 ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు. అయితే ఆయన ఒకమారు గెలిచారు. మరోసారి ఓడారు. ఇపుడు ఆయన్ని విశాఖ నుంచి ఎంపీగా బరిలోకి దించాలని బాబు ప్లాన్ వేస్తున్నారు. పల్లా శ్రీనివాసరావుకు కూడా ఆ విషయం తెలుసు. అందుకే ఆయన తాను కాకపోతే తన ఫ్యామిలీయే గాజువాకలో పెత్తనం చేయాలన్న ముందస్తు ఆలోచనతో తన మేనల్లుడికి గాజువాక టీడీపీ ఇంచార్జి పదవిని కట్టబెట్టారు. దీంతో అక్కడ పెద్ద దుమారమే చెలరేగుతోంది.

బాబు చెప్పాల్సిందే….?

గాజువాక సహా ఏ అసెంబ్లీ నియోజకవర్గమైనా కూడా ఇంచార్జిని నియమించే అధికారం చంద్రబాబుకే ఉంటుందని తమ్ముళ్ళు వాదిస్తున్నారు. కేవలం విశాఖ సిటీ ప్రెసిడెంట్ గా ఉన్న పల్లా శ్రీనివాసరావు తన మేనల్లుడికి ఎలా ఇంచార్జి పదవి ఇస్తారు అంటూ గట్టిగా నిలదీస్తున్నారు. ఈ విషయాన్ని తాము చంద్రబాబు వద్దనే తేల్చుకుంటామని అంటున్నారు. అదే విధంగా పల్లా శ్రీనివాసరావు పార్టీని ముందుకు నడిపించకుండా తన వర్గం, తమ వారు అంటూ ఒంటెద్దు పోకడలు పోతున్నారని కూడా సిటీ టీడీపీ గుర్రుమంటోంది. దీంతో అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి ఈ గొడవలతో మరింత ముదురుతున్నాయి.

దిశానిర్దేశమేదీ …?

విశాఖ కార్పోరేషన్ లో ముప్పై మంది దాకా కార్పోరేటర్లు టీడీపీ నుంచి గెలిచారు. వారంతా తలోదారిలో ఉన్నారు. కొందరు సైలెంట్ గా ఉండే మరి కొందరు వైసీపీని సమర్ధిస్తున్నారు. ఇంకొందరు హై కమాండ్ ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోవడంలేదు. ఈ మధ్యన పల్లా శ్రీనివాసరావు కార్పోరేటర్లతో మీటింగ్ పెడితే చాలా మంది డుమ్మా కొట్టారు. దీంతో పార్టీ మొత్తాన్ని ఏకత్రాటిపైకి తెచ్చి అధికార పార్టీ మీద పోరాడేలా పల్లా శ్రీనివాసరావు లీడ్ చేయలేకపోతున్నారు అంటున్నారు. ఈ పరిణామాలను అధినాయకత్వం దృష్టికి కూడా కొందరు నేతలు తీసుకువస్తున్నారు. టీడీపీలో ప్రస్తుత పరిస్థితుల‌ను చక్కదిద్దకపోతే రానున్న రోజుల్లో భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని తమ్ముళ్ళు అంటున్నారు.

Tags:    

Similar News