ఇప్పట్లో యాక్టివ్ కావడం కష్టమేనట

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావు పార్టీకి పూర్తిగా దూరమయినట్లే కన్పిస్తుంది. గత కొంత కాలంగా పార్టీకి, నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. అందుకే ఇటీవల [more]

Update: 2020-10-20 06:30 GMT

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావు పార్టీకి పూర్తిగా దూరమయినట్లే కన్పిస్తుంది. గత కొంత కాలంగా పార్టీకి, నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. అందుకే ఇటీవల జరిగిన పార్లమెంటు నియోజకవర్గ కమిటీల్లో పత్తిపాటి పుల్లారావుకు చంద్రబాబు చోటు కల్పించలేదని చెబుతారు. పత్తిపాటి పుల్లారావు ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి గాయబ్ అయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు గుంటూరు జిల్లాలో చక్రం తిప్పిన పత్తిపాటి పుల్లారావు అప్పుడప్పుడు కన్పించి పోవడం తప్ప పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు.

పూర్తిగా వ్యాపారాలపైనే…..

పూర్తిగా పత్తిపాటి పుల్లారావు తన వ్యాపారాలపైనే దృష్టి సారించారని చెబుతారు. నిజానికి రాజధాని అమరావతి భూములను రైతులు ఇవ్వడంలో పత్తిపాటి పుల్లారావు ప్రధాన పాత్ర పోషించారు. అందుకే ఆయన అప్పుడప్పుడూ అక్కడకు వచ్చి రైతులకు మాత్రం సంఘీభావం తెలుపుతున్నారు. కానీ తన నియోజకవర్గమైన చిలకలూరిపేటకు మాత్రం పూర్తిగా దూరంగా ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుండటంతో పత్తిపాటి పుల్లారావు కేసులకు భయపడి దూరంగా ఉంటున్నారని తెలిసింది.

కొన్ని కేసులు నమోదవ్వడంతో…..

ఇప్పటికే పత్తిపాటిపుల్లారావుపై రాజధాని భూముల విషయంలో కొన్ని కేసులు నమోదయ్యాయి. బలవంతంగా తమ భూములు లాక్కకున్నారని అందిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు రాజధాని భూములను బినామీ పేర్లతో పత్తిపాటి పుల్లారావు సొంతం చేసుకున్నారని ఏపీ మంత్రి వర్గ ఉపసంఘం నివేదిక కూడా బయటపెట్టింది. దీంతోనే పత్తిపాటి పుల్లారావు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో తన ప్రత్యర్థి అయిన ఎమ్మెల్యే విడదల రజనీపై కూడా ఆయన విమర్శలకు వెనకాడుతున్నారు.

చంద్రబాబుతో మనసు విప్పి….

హైదరాబాద్ తో చంద్రబాబును కలసి ఈ విషయాన్ని పత్తిపాటి పుల్లారావు స్వయంగా చెప్పినట్లు తెలిసింది. తనకున్న సమస్యలతో పాటు, నమోదయ్యే కేసుల అంశాన్ని కూడా చంద్రబాబు వద్ద పత్తిపాటి పుల్లారావు ప్రస్తావించినట్లు తెలిసింది. అనివార్యంగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని పత్తిపాటి పుల్లారావు చంద్రబాబుకు వివరణ ఇచ్చుకున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు మాత్రం సమస్యలు వస్తే పార్టీ అండగా ఉంటుందని, భయపడవద్దని భరోసా ఇచ్చినా పత్తిపాటి పుల్లారావు మాత్రం చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేనని చెప్పారని టాక్. మొత్తం మీద పత్తిపాటి పుల్లారావు ఇప్పట్లో యాక్టివ్ కారన్నది ఆయన సన్నిహితుల నుంచి విన్పిస్తున్న మాట.

Tags:    

Similar News