కలిస్తే చేటు వారికేనటగా

ఏపీలో అనూహ్య రాజకీయం కాదు కానీ ఒక కొత్త సమీకరణ మాత్రం చోటుచేసుకుంది. నిజానికి ఇది ఒకింత పాతదే అని కూడా చెప్పాలి. పవన్ కళ్యాణ్ జనసేన, [more]

Update: 2020-01-16 00:30 GMT

ఏపీలో అనూహ్య రాజకీయం కాదు కానీ ఒక కొత్త సమీకరణ మాత్రం చోటుచేసుకుంది. నిజానికి ఇది ఒకింత పాతదే అని కూడా చెప్పాలి. పవన్ కళ్యాణ్ జనసేన, మోడీ నాయకత్వంలోని బీజేపీ చెట్టాపట్టాలు వేసుకుని ముందుకు సాగడం అన్నది ఇపుడు చర్చగా ఉంది. ఈ కలయిక వల్ల ఇద్దరిలో ఎవరికి మేలు అన్నది ఒక చర్చ అయితే ఈ సమీకరణ వల్ల ఏపీలో బలమైన రెండు ప్రాంతీయ పార్టీలలో దేనికి చేటు అన్నది కూడా ఇంకో చర్చగా ముందుకువస్తోంది. దీని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రియాక్షన్ చూస్తే తన పార్టీని కాపాడుకోవడానికి, లోకల్ బాడీ ఎన్నికల్లో సీట్లు నెగ్గడానికి జనసేనానికి బీజేపీకి వద్దకు చంద్రబాబే పంపిచారని అంటున్నారు. మరో వైపు ఈ పరిణామాల పట్ల టీడీపీ కూడా ఏమంత సంతోషంగా లేదని కూడా వినిపిస్తోంది.

బలం ఎంత…?

ఏపీలో క్యాడర్ లేని పార్టీకి లీడర్ గా పవన్ కల్యాణ్ ఉన్నారు. లీడర్ లేని అతి స్వల్ప క్యాడర్ కలిగిన పార్టీగా బీజేపీ ఉంది. బీజేపీ భావజాలానికి రాయలసీమ దొరకదు, ఉత్తరాంధ్రాలో ఒక్క విశాఖ సిటీ తప్ప మిగిలిన చోట్ల కుదరదు, గోదావరి జిల్లాల్లో మాత్రం రెండు పార్టీలకూ కొంత ఊపు రావచ్చు, ఇక కోస్తాలో కూడా కొంత కదలిక ఉండొచ్చు. మొత్తం మీద చూసుకుంటే ఈ కలయిక వల్ల వైసీపీకి పెద్దగా దెబ్బ పడే సూచనలు మాత్రం లేవని అంటున్నారు. వైసీపీకి సీమలోనే అసలైన బలం, ఇపుడు ఉత్తరాంధ్ర కూడా బాగానే రాణిస్తోంది. గోదావరి, కోస్తా జిల్లాల్లో మూడవ కూటమి జట్టు కడితే నష్టపోయేది కచ్చితంగా టీడీపీయేనని అంటున్నారు.

అదే భయమా…?

ఇక టీడీపీలో కూడా ఇదే రకమైన విశ్లేషణలు వస్తున్నాయి. అటూ ఇటూ తిరిగి తమ పుట్టె ముంచడానికేనా ఈ కొత్త పొత్తు ఎత్తులని పసుపు తమ్ముళ్ళు కలవరపడుతున్నారుట. గోదావరి జిల్లాల్లో ఈ పొత్తు ప్రభావం చూపిస్తే టీడీపీ జారిపోతుంది. ఈ మూడు ముక్కలాటలో సాలిడ్ ఓట్లు ఉన్న వైసీపీ మీదకు వచ్చేసినా ఆశ్చర్యం లేదు. అదే పరిస్థితి కోస్తాలోనూ జరగవచ్చు. అంటే నిన్నటి వరకూ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న జనసేన, బీజేపీ రెండవ స్థానానికి ఎగబాకేందుకు ఈ పొత్తు ఉపయోగపడుతుందని అంటున్నారు.

మంచిదేగా….?

పవన్ కళ్యాణ్ విషయంలో ఇన్నాళ్ళూ ఒకరకమైన అభిప్రాయం మేధావులు, విద్యావంతుల్లో ఉండేది, తమది కొత్త రాజకీయమని ఆయన కూడా చెప్పుకునేవారు. ఇపుడు ఆయన బీజేపీతో కలవడం వల్ల ఆ వర్గాల మద్దతు పోతుంది. పైగా వామపక్షాల మాటల దాడులకు పవన్ కల్యాణ్ బలి కావాల్సిఉంటుంది. టీడీపీ నుండి కూడా మునుపు ఉన్నంత సానుకూలత రాదు, అనుకూల మీడియా కూడా మరీ హైప్ క్రియేట్ చేయదు, మొత్తానికి పవన్ కల్యాణ్ బీజేపీ, టీడీపీల మధ్య గట్టిగానే మూడు ముక్కలాట జరుగుతుంది. ఈ రాజకీయ రచ్చలో తాము అనుకున్నట్లుగా ముందుకు పోవడానికి వైసీపీకి అవకాశాలు మెండుగా ఉంటాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

Tags:    

Similar News