ప‌వ‌న్‌కు వారంతా దూర‌మేనా.. పొలిటిక‌ల్ చ‌ర్చ

జ‌నసేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఆయ‌న సొంత సామాజిక వ‌ర్గం కాపులు శాశ్వతంగా దూర‌మైన‌ట్టేనా ? ఈ వ‌ర్గం ప్రజ‌లు, ఓట‌ర్లలో మెజార్టీ వాళ్లు ఎప్పట‌కీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ [more]

Update: 2021-01-17 13:30 GMT

జ‌నసేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఆయ‌న సొంత సామాజిక వ‌ర్గం కాపులు శాశ్వతంగా దూర‌మైన‌ట్టేనా ? ఈ వ‌ర్గం ప్రజ‌లు, ఓట‌ర్లలో మెజార్టీ వాళ్లు ఎప్పట‌కీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కు చేరువ కాలేరా ? అనే సందేహాలు తెర‌మీదికి వ‌చ్చాయి. రాజ‌కీయాల‌ల్లో ఎంత ఆర్థికంగా బ‌లం ఉన్నా.. ప్రజ‌ల్లో ఫాలోయింగ్ ఉన్నా.. సొంత సామాజిక వ‌ర్గం అండ అత్యంత కీల‌కం. రాష్ట్రం లో ఏ నాయ‌కుడికైనా..పార్టీని న‌డిపిస్తున్న వారికైనా.. ఈ ఫార్ములానే వ‌ర్తిస్తోంది. 2014లో క‌మ్మ సామాజిక వ‌ర్గం అండ‌గా నిలిచి.. మిగిలిన వారిని కూడా త‌మవైపు తిప్పుకున్న కార‌ణంగానే చంద్రబాబు అధికారంలోకి వ‌చ్చారు.

ఈ తరహా వ్యూహం ఏదీ?

ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో రెడ్డి సామాజిక వ‌ర్గం ఏకం కావ‌డంతోనే జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చార‌నేది వాస్తవం. కేవ‌లం అటు క‌మ్మలు, ఇటు రెడ్లు మాత్రమే..ప‌నిచేయ‌లేదు. వీరు త‌మ‌కు అనుకూలంగా ఉన్న సామాజిక వ‌ర్గాల‌ను కూడా క‌లుపుకొని త‌మ త‌మ నేత‌ల‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చారు. అయితే.. అటు చంద్రబాబు కానీ, ఇటు జ‌గ‌న్ కానీ.. త‌మ త‌మ సామాజిక వ‌ర్గాల్లో రాత్రికి రాత్రిపుట్టుకొచ్చిన నాయ‌కులు కారు. చాలా న‌మ్మకం క‌లిగించారు. త‌మ‌ను తాము.. దిద్దుకున్నారు. ఈ త‌ర‌హా వ్యూహం ఉండ‌బ‌ట్టే.. ఇరువురు అధికారంలోకి రాగ‌లిగారు.

సొంత సామాజిక వర్గాన్ని…..

ఇక‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ విష‌యాన్ని తీసుకుంటే తన కాపు సామాజిక వ‌ర్గంలోనే ఆయ‌న న‌మ్మకం క‌లిగించ‌లేక పోయారు. కాపు రిజ‌ర్వేష‌న్ విష‌యాన్ని ఏనాడూ సీరియ‌స్‌గా తీసుకోలేదు. ముద్రగ‌డ ప‌ద్మనాభం కాపుల కోసం ఉద్యమించిన‌ప్పుడు.. సంఘీభావం కూడా తెల‌ప‌లేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ కాపుల్లో ఆయ‌న ధైర్యం క‌ల్పించ‌లేక పోయారు. దీంతో కాపులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను త‌మ నాయ‌కుడిగా చూడ‌డం లేద‌నేది వాస్తవం. ఇక, ఇటీవ‌ల వైసీపీ నాయ‌కులు, మంత్రులు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను తిట్టిపోసినా.. ఎవ‌రూ ముందుకు వ‌చ్చి ఖండించ‌లేదు.

వారంతా బీజేపీ వైపు…..

వాస్తవానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో కాపుల‌కు బ‌ల‌మైన నాయ‌కుడు ఉంటే.. వారంతా ఆ గూటికి వెళ్లిపోయేందుకు రెడీగా ఉన్నారు. త‌మ రిజ‌ర్వేష‌న్ విష‌యంలో అంద‌రూ మోసం చేశార‌నే బాధ‌లో ఉన్నారు. దీంతో ప్రత్యామ్నాయ నేత కోసం ఎదురు చూస్తున్నారు. కానీ, ఈ త‌ర‌హా అవ‌కాశాన్ని అందిపుచ్చుకోవ‌డంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదే స‌మ‌యంలో కాపుల ఆలోచ‌న‌ల‌ను, ఆశ‌ల‌ను అనుకూలంగా మ‌లుచుకునేందుకు ఏపీలో బీజేపీ పూర్తిగా వారినే ముందు పెట్టుకుని న‌డిపిస్తూ రాజ‌కీయం చేస్తోంది. ఈ క్రమంలోనే కాపుల్లో చాలా మంది భ‌విష్యత్తు కోసం బీజేపీ వైపు చూస్తోన్న ప‌రిస్థితి ఉంది.ఇక మిగిలిన కాపు నేత‌ల‌తో పాటు కాపు యువ‌త వైసీపీ, టీడీపీల్లోనూ బ‌లంగా ఉన్నారు. కాపు వ‌ర్గంలో క‌నీసం స‌గానికి పైగా ప్రజ‌ల మ‌న‌స్సుల‌ను ప‌వ‌న్ గెలుచుకున్నా రాజ‌కీయంగా స‌క్సెస్ కావ‌డానికి ఛాన్స్ ఉంది. ఆ విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ నూటికి నూరు శాతం ఫెయిల్ అవుతుండ‌డే ఆయ‌న రాజ‌కీయ వెన‌క‌బాటుకు ఉన్న ప్రధాన కార‌ణాల్లో ఒక‌టి.

Tags:    

Similar News