మొత్తానికి పవన్ కు అండగానే నిలిచారుగా?

ఏపీలో కుల స‌మీక‌ర‌ణం ప‌తాక స్థాయికి చేరుకుందా ? ఇక ఏపీ రాజ‌కీయాలు కులాల వారీగానే జ‌ర‌గ‌నున్నాయా ? అంత‌కు మించి మార్పు ఇక్కడ ఆశించ‌లేమా ? [more]

Update: 2021-02-26 14:30 GMT

ఏపీలో కుల స‌మీక‌ర‌ణం ప‌తాక స్థాయికి చేరుకుందా ? ఇక ఏపీ రాజ‌కీయాలు కులాల వారీగానే జ‌ర‌గ‌నున్నాయా ? అంత‌కు మించి మార్పు ఇక్కడ ఆశించ‌లేమా ? అంటే అవున‌నే ఆన్సర్లు తాజా పంచాయ‌తీ ఎన్నిక‌ల ద్వారా వ‌స్తున్నాయి. ఓ సారి గ‌త చ‌రిత్ర చూస్తే క‌మ్మ, రెడ్డి సామాజిక వ‌ర్గాల రాజ‌కీయ ఆధిప‌త్యం గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ఏపీ ప్రాంతంలో ఉంటోంది. ముందుగా క‌మ్యూనిస్టు పార్టీల్లో క‌మ్మ నేత‌లే కీల‌కంగా ఉంటే… కాంగ్రెస్‌లో రెడ్డి సామాజిక వ‌ర్గ ఆధిప‌త్యం న‌డిచేది. తెలుగుదేశం ఆవిర్భావం త‌ర్వాత క‌మ్మలు కేడ‌ర్ ప‌రంగా… ఓటింగ్ ప‌రంగాను.. ఇటు లీడ‌ర్ల ప‌రంగాను మెజార్టీ ఆ పార్టీ వైపు ట‌ర్న్ అయ్యారు. ఇక 1983లో కొత్తగా పుట్టుకు వ‌చ్చిన మెజార్టీ క‌మ్మ నాయ‌కులు నాడు టీడీపీకి వెన్నుద‌న్నుగా ఉన్నారు. ఇక కాంగ్రెస్‌లో ఎప్పటిలాగానే రెడ్డి వ‌ర్గం ఆధిప‌త్యం కంటిన్యూ అవుతూ వ‌చ్చింది.

ఏనాడూ ప్రయత్నం చేయకపోగా….?

సంఖ్యా పరంగా ఈ రెండు సామాజిక వ‌ర్గాల క‌న్నా భారీగా ఉన్న కాపు సామాజిక వ‌ర్గం రాజ‌కీయంగా హైలెట్ అయ్యేందుకు ఏనాడు ప్రయ‌త్నం చేయ‌లేదు. వంగ‌వీటి రంగా హ‌యాంలో ఏకీకృతం అయినా వారంతా కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉండాల్సి వ‌చ్చింది. రెడ్ల రాజ‌కీయ ఆధిప‌త్యానికి వీరు తోడ్పాడు అందించార‌న్న టాక్ వ‌చ్చింది. అయితే 1998, 1999 ఎన్నిక‌ల్లో కాపుల‌కు అందివ‌చ్చిన అవ‌కాశం వాడుకుని ఉంటే ఈ రోజు కాపుల రేంజ్‌, అటు బీజేపీ హ‌వా ఓ రేంజ్‌లో ఉండేవి. ఆ ఎన్నిక‌ల్లో నాటి ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ సొంతంగా పోటీ చేసి కూడా 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీకి వ‌చ్చిన 18 శాతం ఓట్లలో మెజార్టీ ఓటింగ్ కాపు వ‌ర్గం నుంచే వ‌చ్చింది.

అప్పట్లో యూజ్ చేసుకోలేక….

అయితే దీనిని బీజేపీ, అటు కాపులు ఇద్దరూ యూజ్ చేసుకోలేక‌పోయారు. నాడే బీజేపీ కాపుల నేతృత్వంలోనే ముందుకు వెళ్లి ఉంటే కాపులు అప్పుడు రాజ్యాధికారం దిశ‌గా బ‌ల‌మైన అడుగులు వేసి ఉండేవారు. ఆ త‌ర్వాత చంద్రబాబు .. బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డంతో మ‌ళ్లీ ఈ బీజేపీలో క‌మ్మలు జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పే స్థాయిలో ఉండ‌డంతో వారు మ‌రుగున ప‌డిపోయారు. మళ్లీ వీరంతా ఓ సారి కాంగ్రెస్ వైపు.. మ‌రోసారి టీడీపీ వైపు చెల్లాచెదురు అవుతూ వ‌చ్చారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 శాతం ఓట్లు తెచ్చుకున్నా.. పార్టీపై ఒకే సామాజిక వ‌ర్గం ముద్రతో మిగిలిన వ‌ర్గాలు దూరం కాగా.. ఆ త‌ర్వాత ఆ పార్టీయే లేకుండా చేశారు.

అప్పుడు పవన్ పార్టీ పెట్టినా….?

2014లో అదే కాపు వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీ పెట్టినా బీజేపీ, టీడీపీకి స‌పోర్ట్ చేశారు. 2014లో ప‌వ‌న్‌ను న‌మ్మిన మెజార్టీ కాపులు 2019లో ఆయ‌న్ను న‌మ్మలేదు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ కాపు వ‌ర్గంలో ఓ ఆలోచ‌న అయితే మొద‌లైన‌ట్టే క‌నిపిస్తోంది. త‌మ వ‌ర్గానికి చెందిన నేత‌లు పార్టీ పెట్టినా నిలుపుకోలేక‌పోవ‌డం… ఎప్పుడూ అటు టీడీపీయో.. ఇటు వైసీపీకో ( గ‌తంలో కాంగ్రెస్‌) ఊడిగం చేసుకుంటూ రావడం… చివ‌ర‌కు వారి డామినేష‌న్‌తో విసిగిపోయి ఉండ‌డంతో ఇప్పుడు వీరంతా తాడేపేడో త‌మ‌వాడితోనే ఉండాలా ? అన్న నిర్ణయానికి వ‌చ్చారా ? అంటే అవున‌నే అనిపిస్తోంది.

పవన్ కు సపోర్టర్లుగా….

జ‌న‌సేన + బీజేపీ క‌ల‌వ‌డంతో పాటు బీజేపీ జాతీయ స్థాయిలో ప‌టిష్టంగా… ఎదురు లేకుండా ఉండ‌డంతో పాటు త‌మ వాడు అయిన ప‌వ‌న్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రక‌టించ‌క‌పోతుందా ? అన‌్న స‌రికొత్త ఆశ కాపుల్లో చిగురించింది. తాజా స్థానిక ఎన్నిక‌ల్లో మెజార్టీ కాపులు పై నుంచి ఎలాంటి స‌హాయం లేక‌పోయినా కూడా స్థానిక ఎన్నిక‌ల్లో సొంతంగా పోటీ చేసి స‌త్తా చాటారు. విచిత్రం ఏంటంటే జ‌న‌సేన గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఒంట‌రిగా పోటీ చేసి ఊహించిన దానిక‌న్నా ఎక్కువుగా స‌ర్పంచ్‌, వార్డు మెంబ‌ర్ల‌ను గెలుచుకుంది.

ఈ కూటమి వైపు మొగ్గు చూపారా?

ప‌ల్లెల్లో కాపుల్లో ముఖ్యంగా యువ‌త‌లో ఎప్పుడూ ఆ రెండు కులాలేనా మ‌న‌కంటూ మ‌నమే పోరాటం చేసి రాజ్యాధికారం దిశ‌గా ముందుకు వెళ‌దాం ? అని చ‌ర్చించుకోవడం ప్రధానంగా క‌నిపించింది. కాపులు ఎక్కువుగా ఉన్న చోట జ‌న‌సేన గెల‌వ‌డం లేదా భారీగా ఓట్లు చీల్చడం జ‌రిగింది. ఓవ‌రాల్‌గా చూస్తే టీడీపీకి క‌మ్మల్లో 90 శాతం ఎలా స‌పోర్ట్ చేస్తున్నారో.. ఇక రెడ్లలో 80 శాతం వైసీపీకి స‌పోర్ట్‌గా ఉంటే… ఇప్పుడు కాపుల్లోనూ 50 నుంచి 60 శాతం జ‌న‌సేన + బీజేపీ వైపు మొగ్గు చూపుతోంది. ఇదే కంటిన్యూ అయితే వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఏపీలో ప్రధాన కులాలు.. ప్రధాన పార్టీల వారీగా మ‌రింత‌గా విడిపోయే ఛాన్సులే ఎక్కువుగా ఉన్నాయి.

Tags:    

Similar News