పవన్ ఫోకస్ ఆయనపైనే?

జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బంది పడుతోంది. అధికారంలోకి రాలేకోపోయినా కనీసం పవన్ కల్యాణ్ తన సత్తా చాటుతారని జనసేన నేతలు భావించారు. అందుకే సార్వత్రిక ఎన్నికలకు [more]

Update: 2019-10-15 15:30 GMT

జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బంది పడుతోంది. అధికారంలోకి రాలేకోపోయినా కనీసం పవన్ కల్యాణ్ తన సత్తా చాటుతారని జనసేన నేతలు భావించారు. అందుకే సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేనలో చేరికలు బాగానే జరిగాయి. తొలినాళ్లో పవన్ కల్యాణ్ యువరక్తానికే తన పార్టీలో చోటు అని ప్రకటించారు. తర్వాత ఏమైందో తెలియదు కాని, కొత్తవారికి ఎవ్వరికీ పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. మళ్లీ పాత నాయకులకే టిక్కెట్లు ఇచ్చారు పవన్ కల్యాణ్. ఇక తాజాగా పరిస్థితి ని చూస్తే జనసేనలో ఇద్దరే మిగిలేటట్లు కన్పిస్తుంది. ఒకరు పవన్ కల్యాణ్, మరొకరు నాదెండ్ల మనోహర్.

నాదెండ్ల మనోహర్ చేరికతో….

జనసేన పార్టీ పెట్టి చాలా రోజులయినా 2019 ఎన్నికలకు ముందే పవన్ కల్యాణ్ ఆ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ముందుకు వచ్చారు. పవన్ కల్యాణ్ పార్టీలోకి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చేరారు. నిజానికి నాదెండ్ల మనోహర్ వైసీపీ లో చేరాల్సి ఉంది. ఆయనకు వైసీపీ అధినేత జగన్ కూడా ఆఫర్ ఇచ్చారు. తెనాలి నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తామని కూడా జగన్ చెప్పినా లింగమనేని రమేష్ చొరవతో నాదెండ్ల మనోహర్ పవన్ కల్యాణ్ పార్టీ వైపునకు వెళ్లారు. జనసేనలో పవన్ కల్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహర్ కీలక నేతగా ఎదిగారు.

ఒక వర్గం నేతలకు…..

అభ్యర్థుల ఎంపికలోనూ నాదెండ్ల మనోహర్ కీలక పాత్ర పోషించారంటారు. పవన్ కల్యాణ్ తర్వాత స్థానం నాదెండ్ల మనోహర్ ఆక్రమించడంతోజనసేనలోని ఒక వర్గం నేతలకు మింగుడు పడలేదు. ఇది ఎన్నికలకు ముందే కొంత స్పష్టమయింది. ఎన్నికలకు ముందే విజయ్ బాబు, అద్దేపల్లి శ్రీధర్ లాంటి వాళ్లు పార్టీని వీడారు. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జనసేన బలమేంటో పూర్తిగా తెలిసిపోయింది. పవన్ కల్యాణ్ సాక్షాత్తూ రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలు కావడం కూడా పార్టీకి మైనస్ గా మారింది. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడైన మారంశెట్టి రాఘవయ్య రాజీనామా చేయడం కూడా చర్చనీయాంశమైంది.

వరస రాజీనామాలకు కారణం…..

ఇక వరసగా జనసేన నుంచి రాజీనామాలు ప్రారంభమయ్యాయి. రావెల కిషోర్ బాబుతో రాజీనామాలు పర్వం మొదలయింది. కృష్ణా జిల్లా జనసేన పార్టీ కన్వీనర్ డేవిడ్ రాజు, అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చింతల పార్థసారధితో పాటు కావలి, పెదకూరపాడు, తణుకు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి పాలయిన పసుపులేటి సుధాకర్, దండమూడి సామ్రాజ్యం, పసుపులేటి వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, చింతలపూడి వెంకట్రామయ్యలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇలా వరసగా నేతలు రాజీనామాలు చేస్తుండటంతో పవన్ రాజీనామాలకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీసినట్లు తెలిసింది. ప్రధాన కారణం నాదెండ్ల మనోహర్ వైఖరేనని కొందరు పవన్ కల్యాణ్ కు చెప్పినట్లు సమాచారం. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ తీరును వీరు తప్పుపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఇప్పుడు పవన్ కల్యాణ్ ఫోకస్ నాదెండ్ల మనోహర్ మీదకు మారినట్లు తెలుస్తోంది. మరి నాదెండ్ల మనోహర్ ను పార్టీ కీలక బాధ్యతల నుంచిపవన్ కల్యాణ్ తప్పిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News