మెగా బ్రదర్స్ ఎందుకలా …?

ఎవరికి అర్ధం కానీ రాజకీయాలకు మెగాస్టార్ చిరంజీవి బ్రదర్స్ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. వీరిద్దరి భిన్నమైన రాజకీయాలు నేటివి కావు ప్రజారాజ్యం పార్టీ నుంచి సాగుతూ [more]

Update: 2019-12-21 14:30 GMT

ఎవరికి అర్ధం కానీ రాజకీయాలకు మెగాస్టార్ చిరంజీవి బ్రదర్స్ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. వీరిద్దరి భిన్నమైన రాజకీయాలు నేటివి కావు ప్రజారాజ్యం పార్టీ నుంచి సాగుతూ వచ్చినవే. ఆలోచన ధోరణిలో రక్తబంధానికి సంబంధం ఉన్నా తేడా ఉంటుందని మెగా బ్రదర్స్ రాజకీయాలు పరిశీలిస్తే అర్ధం అవుతాయి. చిరంజీవి సున్నితమైన తత్త్వం. అదే ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ వి దూకుడు స్వభావం. పైకి ప్రశాంతంగానే కనిపించే వీరిద్దరివి భిన్నమైన మార్గాలే. అన్నయ్య పేరుతో సినీ ఎంట్రీ ఇచ్చినా ఆ తరువాత తనకంటూ సొంత మార్గాన్ని కష్టపడి తెచ్చుకోగలిగారు పవన్. మెగా అభిమానులు మద్దతు పవన్ ఎదుగుదలకు ఎంతో దోహదం చేసింది. పవన్ సినిమాలు హిట్ అయినా ఫట్ అయినా మెగా అభిమానులే పవర్ స్టార్ ను భుజాన మోస్తూ వచ్చేవారు. చిరంజీవి సినిమాలు తగ్గించడం మొదలు పెట్టాక మెగా అభిమానులకు ఆశాకిరణంగా పవన్ నిలిచారు.

ప్రజారాజ్యం పెట్టాక …

పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణి తన ఆలోచనలకు భిన్నంగా ఉంటుందని గమనించే ప్రజారాజ్యం పార్టీ పెట్టాక యువరాజ్యం అధినేతగా తమ్ముడిని చేసినా చిరంజీవి ప్రధాన బాధ్యతలు అప్పగించలేదు. ఎక్కువ ప్రచారం కోసమే పవన్ ను వినియోగించారు చిరంజీవి. బావ అల్లు అరవింద్ కే ఎక్కువ బాధ్యతలను పంచారు. పార్టీలో ఎవరికి బాధ్యతలు అప్పగించాలి ? ఎవరికి టికెట్లు అనే అంశాల్లో అత్యధిక భాగం అల్లు అరవింద్ నే చూసుకున్నారు. ఇక్కడ పవన్ నాగబాబు లకు తక్కువ ప్రాధాన్యతే చిరంజీవి ఇచ్చారనే అంతా చెప్పుకునేది. కాంగ్రెస్ నేతలను పంచెలు వూడతీసి తరిమి కొడతాం అంటూ ప్రచారం లో సైతం పవన్ ఆవేశ పూరిత ప్రసంగాలు చెయ్యడం కూడా చిరంజీవికి నచ్చేది కాదంటారు. ఇలా పవన్ తన రూట్ లో తాను వెళ్లడమే కానీ అన్న ఆలోచనల ప్రకారం సాగలేదంటారు.

పార్టీ విలీనం ఇష్టం లేని పవన్…

ప్రజారాజ్యం నిర్వహణ కష్టసాధ్యం అని భావించి చిరంజీవి కాంగ్రెస్ పార్టీ ఆఫర్ కు తలొగ్గి పార్టీని విలీనం చేయాలని నిర్ణయించారు. అది పవన్ కి అస్సలు ఇష్టం లేదని నాటి నేటి నుంచి మెగా కుటుంబీకులకు సన్నిహితుల నుంచి వినవచ్చింది. అందుకే 2014 లో జనసేన పార్టీని పెట్టి ప్రజారాజ్యం పార్టీని నమ్ముకుని దెబ్బ అయిపోయిన వారిని ఆదుకోవాలని వారి రాజకీయ భవిష్యత్తు తో పాటు పొలిటికల్ పునాదిని నిర్మించుకోవాలని పవన్ ఆశించారని విశ్లేషకుల అంచనా. అయితే ఆయన పార్టీ స్థాపించినా పోటీ చేయకుండా బిజెపి, టిడిపి లకు మద్దతు పలికి సరికొత్త రాజకీయానికి ఎపి లో తెరతీశారు.

ఆదిలోనే జనసేనను …

పవన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆదిలోనే ఆ పార్టీకి తీరని నష్టం తెచ్చిపెట్టిందన్నది తరువాత రోజుల్లో స్పష్టం అయ్యింది. రెండు ప్రధాన పార్టీలకు మద్దతు ప్రకటించి తరువాత ఐదేళ్ళు పార్టీ నిర్మాణం చేస్తారన్న జనసైనికుల నమ్మకాన్ని ఆయన వమ్ము చేశారు. చక్కగా సినిమాలు చేసుకుంటూ అప్పుడప్పుడు మాత్రం రాజకీయాల్లో కనిపిస్తూ ఎన్నికల దగ్గరలో కమ్యూనిస్ట్ లు, బీఎస్పీ వంటి పార్టీలతో కలిసి పోటీ చేసి ఘోర ఓటమి చవి చూశారు. జనసేన రాజకీయ అడుగులను గమనించిన ఎపి ప్రజలు పవన్ పార్టీని చిన్నచూపు చూశారు. వైసిపి కి పడే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కు పవన్ గండి కొట్టాలనే రాజకీయాలు చేస్తున్నారు తప్ప తన పార్టీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం ఏ మాత్రం లేదని జనసేన వైపు చూడలేదు ప్రజలు.

ఇప్పుడు మూడు రాజధానులపై …

తెలుగుదేశం ఏమి చెబుతుందో జనసేన అదే చేస్తుందని గత ఎన్నికల ముందు నుంచి వైసిపి ప్రచారం గట్టిగా చేస్తుంది. అదే నిజమనే రీతిలోనే పవన్ సైతం తన చర్యలద్వారా నిరూపిస్తూ ఉండటంతో ప్రజల్లో మరింత విశ్వసనీయతను కోల్పోతుంది జనసేన. రాజధాని అమరావతి లోనే ఉంచాలని కోరుతూ టిడిపి రైతుల ద్వారా గట్టి పోరాటమే సాగిస్తుంది. దీనికి జనసేన జై కొట్టింది. గతంలో ఒకే చోట అభివృద్ధి చేయడం ఒక సామాజిక వర్గానికే లబ్ది అంటూ పవన్ అనంతపురం లో వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అప్పుడు ఒకే చోట అభివృద్ధి పై వైసిపి తీసుకున్న నిర్ణయం పై జనసేన అధినేత యు టర్న్ కొట్టారు. అదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

తమ్ముడి యాక్షన్ పై అన్నయ్య రియాక్షన్ …

తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ అమరావతిలో రాజధాని కోసం గట్టి ఉద్యమానికి సిద్ధమైన తరుణంలో మెగా స్టార్ చిరంజీవి వ్యాఖ్యలు వైసిపి నెత్తిన పాలు పోశాయి. అలాగే జనసేన వేడి వేడి ఉద్యమం పై నీళ్ళు చల్లేసింది. అభివృద్ధి వికేంద్రికరణ ద్వారానే ఎపి ముందుకు వెళుతుందని మూడు రాజధానులు సరైన నిర్ణయం అంటూ వైసిపి సర్కార్ కి మెగాస్టార్ అనుకూలం గా చెప్పడం ఇప్పుడు అటు జనసేన లోను ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.

Tags:    

Similar News