జనసేనాని దీర్ఘకాలిక పోరాటానికి సిద్దమవుతున్నారా? 2019 ఎన్నికల్లో ఆయన పోషించదలచిన పాత్ర ఏమిటి? రాష్ట్ర రాజకీయాలపై జనసేన ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇవన్నీ ప్రశ్నలే. రాష్ట్రంలో వ్యక్తిగతంగా హార్డ్ కోర్ అభిమానులున్న నాయకుడు పవన్ కల్యాణ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన పవన్ ఫ్యాన్స్ సంఖ్య 26 నుంచి 27 లక్షల వరకూ ఉంటుందని అంచనా. 2009లో ప్రజారాజ్యంకి వచ్చిన ఓట్ల సంఖ్య 70 లక్షలు. అందులో మూడోవంతు వరకూ పవన్ కు ఇండివిడ్యువల్ ఫ్యాన్స్ ఉన్నారు. పార్టీగా ప్రజారాజ్యానికి రూపకల్పన చేసినప్పటికీ ఇంకా అభిమానసంఘం తరహాలోనే నడుస్తోంది. ఆయన కార్యక్రమాలకు తరలివస్తున్న ప్రజలు, స్పందిస్తున్న తీరు ఇంకా అసోసియేషన్ల తీరునే తలపిస్తోంది. సినీ పక్కీ డైలాగులనే వారు కోరుకుంటున్నారు. సామాజిక సందేశాలు, పర్యావరణం వంటి హితోక్తులు చెప్పినప్పుడు పట్టించుకోవడం లేదు. సినీమా స్టైల్ లో తల ఎగరేసి , ఒకట్రెండు పవర్ డైలాగులు పలికితే చప్పట్లు, ఈలలతో హోరెత్తుతోంది. పార్టీ అభిమానుల్లో ఇంకా రాజకీయ లక్షణాలు కనిపించడం లేదు.
ఆ రెండు జిల్లాలు...
తూర్పు,పశ్చిమగోదావరి జిల్లాలు జనసేనకు ప్రాణప్రదం. అప్పట్లో ప్రజారాజ్యానికి ఆయువు పట్టుగా నిలిచిన జిల్లాలు ఇవే. చిరంజీవికి, మెగా ఫ్యామిలీకి రాష్ట్రవ్యాప్తంగా అభిమాన శ్రేణులు ఉన్నాయి. అయినప్పటికీ కులపరమైన సమీకరణతో ఈ జిల్లాలే అండగా నిలిచాయి. లభించిన ఓట్లలో మూడోవంతు ఇక్కడి నుంచే వచ్చాయి. గెలిచిన స్థానాలూ ఎక్కువ అక్కడివే. ఇప్పుడు జనసేన విషయంలో ఆ ఈక్వేషన్ వర్కవుట్ అయితే మంచిదే. కానీ గ్యారంటీ కనిపించడం లేదు. టీడీపీ బాగా బలపడింది. వైసీపీ ముందుకొచ్చింది. జగన్ పాదయాత్ర ఈ జిల్లాల్లో పూర్తిగా సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో గతంలో ప్రజారాజ్యానికి ఉన్న పట్టు జనసేన ఈ జిల్లాల్లో సాధించగలగడము సాధ్యమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. పవన్ కు యువతలో క్రేజ్ ఉన్న మాట వాస్తవం. అయితే అదంతా పూర్తిగా ఓటుగా మారుతుందా? అంటే చెప్పలేకపోతున్నారు. ప్రజారాజ్యం కొంత నమ్మకాన్ని దెబ్బతీసింది. పవన్ రాజకీయ స్థిరత్వంపైనా ఇంకా విశ్వాసం ఏర్పడలేదు. అందువల్లనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈరెండు జిల్లాల్లో కచ్చితమైన ఆధిక్యత సాధించకపోతే పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది. అందువల్లనే పవన్ దాదాపు నెలరోజులుగా పశ్చిమగోదావరిపై దృష్టిపెట్టారు. సెప్టెంబరులో తూర్పుగోదావరి జనసేన ప్రచారానికి కేంద్రం కాబోతోంది.
కులాల కుమ్ములాట...
రాష్ట్రంలో కులాల కుమ్ములాట బాగా పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విశాలమైన ప్రాంతం కావడంతో సమీకరణలు భిన్నంగా ఉంటుండేవి. బీసీలు, అగ్రవర్ణాలు బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ గా ఉండేవి. తెలంగాణలో బీసీలు , గిరిజనులు, మైనారిటీలు ప్రభావిత సంఖ్యలో ఉండటం కలిసివచ్చేది. రాయలసీమ రెడ్ల ప్రాధాన్యంతో ఉండేది. తెలంగాణలో రెడ్లు రాజకీయంగా ప్రాధాన్యం వహిస్తూ వచ్చారు. రాయలసీమ, తెలంగాణల్లో ఈ సామాజికవర్గ బలం రాష్ట్రరాజకీయాలను శాసిస్తూ ఉండేది. రాష్ట్రవిభజన తర్వాత అంతటి సామాజిక ప్రాధాన్యం రెండు చోట్లా కోల్పోయారు. ప్రస్తుతం జనాభా రీత్యా ఒక సింగిల్ ఎంటిటీ గా చూస్తే కాపు,బలిజ,తెలగ,ఒంటరి కులాల సామాజిక జనాభా 17 శాతం వరకూ ఉంది. ఇందులో బీసీ ‘డీ’ లోకి వస్తున్న తూర్పు కాపు సామాజిక వర్గం సైతం కలుస్తోంది. సంఖ్యాపరమైన ఈ సమీకరణే ఇప్పుడు ప్రధానపార్టీలను భయపెడుతోంది. వీరంతా సంఘటితమైతే మరో ఒకటి రెండు చిన్న సామాజికవర్గాలు కలిసి వస్తే జనసేన బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇతరసామాజిక వర్గాలను ఆకట్టుకునే క్రమంలో తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు పవన్. ఉభయగోదావరి జిల్లాల్లో ఆర్థికంగా, అంగబలం రీత్యా మంచి మద్దతు ఇవ్వగల క్షత్రియ సామాజికవర్గాన్ని జనసేనకు చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దళిత వర్గాలనూ ఆకట్టుకునేందుకు ప్రకటనలు చేస్తున్నారు.
పవన్ పయనమెటు?...
త్రిశంకు సభ ఏర్పాటైతే పవన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు?. పార్టీ బలహీనంగా ఉన్న స్థానాల్లో ఏపార్టీకి సహకరిస్తారు?. తెలుగుదేశం, వైసీపీల్లో ఎవరివైపు సానుకూల ధృక్పథాన్ని కనబరుస్తున్నారనే అంశాలు చర్చనీయమవుతున్నాయి. గతంలో టీడీపీకి సహకరించడం వల్ల పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం సీట్లు ఆ పార్టీ గెలుచుకోగలిగింది. తూర్పుగోదావరి జిల్లాలో నాలిగింట మూడొంతుల సీట్లు వచ్చాయి. ఇప్పుడు జనసేన సొంతంగా పోటీ చేయగల స్థానాలు రాష్ట్రంలో నలభైవరకూ మాత్రమే ఉన్నట్లు అంచనా. మరో 70 సీట్లలో 3నుంచి 5వేల వరకూ ఓట్లు తెచ్చుకునే బలం ఉన్నట్లుగా రాజకీయపరిశీలకుల అంచనా. ఈ సీట్లలో ఓటు బదలాయింపు చేయగలిగితే టీడీపీ, వైసీపీల్లో ఏదో ఒక పార్టీ గెలుపును శాసిస్తుందంటున్నారు. ఏ పార్టీతోనూ నేరుగా పొత్తు పెట్టుకునే సాహసం చేయకపోవచ్చు. పరోక్షంగా సహకరించడం ద్వారా భవిష్యత్తులో సంకీర్ణానికి బాటలు వేసుకునే దిశలో పావులు కదపడం మంచిదని జనసేన శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. 2014లో ఎలాగూ తెలుగుదేశానికి సహకారం అందించింది. ఈసారి వైసీపీని పరీక్షించుకోవడం మేలనే సూచనలు వెలువడుతున్నాయి. జగన్ దుందుడుకు నిర్ణయాలు, ప్రకటనలు చేయకపోతే వైసీపీ వైపే జనసేనాని మొగ్గు చూపే పరిస్థితులు ఇప్పటికే నెలకొని ఉండేవంటున్నారు.
-ఎడిటోరియల్ డెస్క్