పెద్దిరెడ్డికే ప్రాధాన్యం.. ఫ్యూచర్ లోనూ అంతేనట

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికే సీఎం జ‌గ‌న్ ప్రాధాన్యం ఇస్తున్నార‌నే విష‌యం.. చిత్తూరు జిల్లాలో పెద్ద టాక్‌గా మారింది. ఒక్క జిల్లాలోనే కాకుండా మంత్రి వ‌ర్గంలోనూ పెద్దిరెడ్డి విష‌యం [more]

Update: 2021-05-01 13:30 GMT

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికే సీఎం జ‌గ‌న్ ప్రాధాన్యం ఇస్తున్నార‌నే విష‌యం.. చిత్తూరు జిల్లాలో పెద్ద టాక్‌గా మారింది. ఒక్క జిల్లాలోనే కాకుండా మంత్రి వ‌ర్గంలోనూ పెద్దిరెడ్డి విష‌యం ఆసక్తిక‌ర చ‌ర్చకు దారితీస్తోంది. గ‌త నెల‌లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లోను, త‌ర్వాత జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ చిత్తూరు జిల్లా స‌హా సీమ‌లోని జిల్లాల్లోనూ పెద్దిరెడ్డి త‌న స‌త్తా చాటార‌నే విష‌యంలో సందేహం లేదు. దీంతో జ‌గ‌న్ ద‌గ్గర ఆయ‌న హ‌వా పెరిగింది. ప్రభుత్వం ఏర్పడిన‌ప్పటి నుంచే పెద్దిరెడ్డి సొంత జిల్లా చిత్తూరులోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో… అనేక విష‌యాల్లో వేలు పెట్టేస్తున్నార‌ని మంత్రులు, ఎమ్మెల్యేలు గ‌గ్గోలు పెడుతున్నారు. పెద్దిరెడ్డిపై జ‌గ‌న్‌కు ప‌లు మార్లు ఫిర్యాదులు వెళ్లినా ఆయ‌న మాత్రం వెన‌క్కు త‌గ్గడం లేదు. ఇక‌, ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు తిరుప‌తి పార్లమెంటు ఉప ఎన్నిక బాధ్యత కూడా అప్ప‌గించారు.

జగన్ అండ ఉండటంతో…?

ఇంత వ‌ర‌కు బాగానేఉన్నా.. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి దూకుడుతో చాలా మంది సీనియ‌ర్లు.. మీడియా ముందుకు రాలేక పోతున్నార‌నే వాద‌న ఉంది. నిజానికి పార్టీలో పెద్దిరెడ్డి క‌న్నా స‌బ్జెక్ట్ ఉన్న నేత‌లు, సీనియ‌ర్లు ఉన్నారు. ఎమ్మెల్యేలు, విప్‌లు కూడా తిరుప‌తి పార్లమెంటులో గెలుపు కోసం.. ప్రత్యక్షంగా ప‌రోక్షంగా ప‌నిచేస్తున్నారు. అయితే.. ఎవ‌రినీ కూడా మీడియా ముందుకు రాకుండా పెద్దిరెడ్డి క‌ట్టడి చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. దీనికి తోడు పెద్దిరెడ్డికే జ‌గ‌న్ కూడా ప్రాధాన్యం ఇస్తుండ‌డంతో.. ఇటు పెద్దిరెడ్డిని ఏమీ అన‌లేక‌.. అటు పార్టీలో ప‌నిచేయ‌కుండా కూడా ఉండ‌లేక‌.. సీనియ‌ర్లు అగ‌చాట్లు ప‌డుతున్నారు.

ఆయన ధాటికి తట్టుకోలేక…?

చిత్తూరు జిల్లాకే చెందిన మ‌రో మంత్రి నారాయ‌ణ స్వామి ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి వంటివారు సైతం పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కే ఇంత ప్రాధాన్యం ఇస్తే.. మా ప‌రిస్థితి ఏంటి ? అనే ఆవేద‌నలో ఉన్న మాట వాస్తవం. ఇక రోజా పెద్దిరెడ్డి విష‌యంలో ఎలా కారాలు మిరియాలు నూర‌తారో ప్రత్యేకంగా చెప్పక్క‌ర్లేదు. కొంద‌రు స‌ర్దు బాటు చేసుకుని ముందుకు వ‌స్తున్నారు. మ‌రికొంద‌రు ఇంటికే ప‌రిమిత‌మ‌వుతున్నారు. ఇంటికే ప‌రిమిత ‌మైన వారిలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, న‌ల్లప‌రెడ్డి ప్రస‌న్న కుమార్ రెడ్డి స‌హా మ‌రికొంద‌రు మౌనం పాటిస్తున్నా రు.

తిరుపతి ఫలితం తర్వాత..?

మ‌రికొన్ని రోజుల్లోనే మంత్రి వ‌ర్గ ప్రక్షాళ‌న ఉన్న నేప‌థ్యంలో ఆదిలో 90శాతం మందిని మారుస్తాన‌ని సీఎం జ‌గ‌న్ ప్రక‌ట‌న చేసినా.. మారిన ప‌రిస్థితులు, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మారే ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచు కుని.. కొద్దిమందిని అలానే ఉంచుతార‌ని అంటున్నారు. ఈ జాబితాలో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో ఆయ‌న‌పై గుస్సాగా ఉన్నవారు కూడా మౌనంగా ఉంటున్నారు. మొత్తానికి తిరుప‌తి ఫ‌లితం త‌ర్వాత‌.. వైసీపీలో పెద్దిరెడ్డి మరింత క్రియాశీల‌క పాత్ర పోషించ‌డం కంటిన్యూ అయితే.. పార్టీలో ఆయ‌న టార్గెట్‌గా అసంతృప్తి జ్వాల‌లు మ‌రింత‌గా పెరిగే ఛాన్స్ కూడా ఉంది.

Tags:    

Similar News