మంత్రి పదవి నుంచి తప్పించారు… ఏం సాధించారు?

పిల్లి సుభాష్ చంద్రబోస్. వైసీపీ రాజ్యసభ సభ్యుడు. గత కొంతకాలంగా ఆయన మౌనంగానే ఉంటున్నారు. శాసనమండలి రద్దు చేస్తామని చెప్పిన జగన్ పిల్లి సుభాష్ చంద్రబోస్ ను [more]

Update: 2021-03-17 13:30 GMT

పిల్లి సుభాష్ చంద్రబోస్. వైసీపీ రాజ్యసభ సభ్యుడు. గత కొంతకాలంగా ఆయన మౌనంగానే ఉంటున్నారు. శాసనమండలి రద్దు చేస్తామని చెప్పిన జగన్ పిల్లి సుభాష్ చంద్రబోస్ ను రాజ్యసభకు పంపారు. అయితే శాసనమండలి రద్దు కాలేదు. ఇప్పట్లో రద్దు అయ్యే అవకాశం లేదు. జగన్ వరసపెట్టి మండలి సభ్యులకు అవకాశం కల్పిస్తున్నారు. తన మంత్రి పదవి మండలి రద్దు కారణంగా ఊడిపోవడం, మండలి పై నేటికీ నిర్ణయం వెలువడకపోవడంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒకింత అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.

మంత్రివర్గంలో చేర్చుకుని….

పిల్లి సుభాష్ చంద్రబోస్ గత ఎన్నికల్లో ఓటమి పాలయినప్పటికీ జగన్ వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో చేర్చుకున్నారు. నీతిమంతమైన నేత కావడం, తననే నమ్ముకుని ఉండటంతో ప్రజా బలం లేకపోయినా జగన్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. అయితే మండలి రద్దు పేరుతో ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. మండలి రద్దు చేస్తున్నట్లు శాసనసభలో తీర్మానం చేసి ఏడాది కావస్తున్నా దానిపై ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. దీనిపై జగన్ తొందరపడ్డారేమోనన్న భావన పిల్లి సుభాష్ చంద్రబోస్ లో ఉంది.

మండలి రద్దు పేరుతో….?

తాను మంత్రి వర్గం నుంచి తప్పుకోవడంతో రామచంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వేణుగోపాల కృష్ణకు పదవి లభించింది. తొలిసారి ఎమ్మెల్యే అయినా ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ కు నచ్చ లేదు. దీంతో పాటు తోట త్రిమూర్తులను పార్టీలోకి చేర్చుకోవడాన్ని కూడా ఆయన ఇష్టపడలేదు. ఇలా ఆయన అన్ని రకాలుగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య కాకినాడ ఎమ్మెల్యే దారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో వాగ్వాదం కూడా ఈ అసహనానికి కారణమంటున్నారు.

అసహనంతో…..

అలాగే తోట త్రిమూర్తుల శిరోముండనం కేసులో కూడా హోంమంత్రి కి పిల్లి సుభాష్ చంద్రబోస్ లేఖ రాయడం కూడా పార్టీలో వివాదంగా మారింది. జగన్ తొందరపడి తనను మంత్రి వర్గం నుంచి తప్పించారన్న అసంతృప్తిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారని సమాచారం. అందుకే ఆయన స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా దూరంగా ఉంటున్నారు. రాజ్యసభ పదవితో ఆయన సంతృప్తి పడటం లేదని తెలుస్తోంది. మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పటికైనా యాక్టివ్ అవుతారా? లేదా? అన్నది చూడాలి.

Tags:    

Similar News