పిఠాపురం ఎవ‌రికి అవుతుందో వ‌రం..?

తూర్పుగోదావ‌రి జిల్లాలో పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర చూస్తే పార్టీలు ఏవైనా ఇది కాపుల‌కు కంచుకోట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తిగా కాపు సామాజకవ‌ర్గం వారిదే ఆధిప‌త్యం. దాదాపు ఆరు [more]

Update: 2019-02-08 08:00 GMT

తూర్పుగోదావ‌రి జిల్లాలో పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర చూస్తే పార్టీలు ఏవైనా ఇది కాపుల‌కు కంచుకోట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తిగా కాపు సామాజకవ‌ర్గం వారిదే ఆధిప‌త్యం. దాదాపు ఆరు ద‌శాబ్దాలుగా ఇదే ప‌రిస్థితి. ఇక్క‌డ ఏ పార్టీ అభ్య‌ర్థిని నిల‌బెట్టిన అంద‌రూ కాపు సామాజకవ‌ర్గ నేత‌లై ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇక్క‌డ గెలిచిన‌వారు.. ఓడిన‌వారూ కాపులే. అట్లాంటి చోట.. స్వంతంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి… ఎవ‌రూ ఊహించ‌ని విధంగా క్ష‌త్రియ సామాజక‌వ‌ర్గానికి చెందిన ఎన్.వి.ఎస్‌.ఎన్‌.వ‌ర్మ 2014 ఎన్నిక‌ల్లో అఖండ మెజార్టీతో విజ‌యం సాధించారు. కాపు కాకుండా ఇతర సామాజకవ‌ర్గానికి చెందిన తొలి ఎమ్మెల్యేగా గుర్తింపు సాధించుకున్నారు. క్ష‌త్రియ సామాజకవ‌ర్గానికి చెందిన వ‌ర్మ 2009లో టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచి ప్ర‌జారాజ్యం అభ్య‌ర్థిగా పోటీ చేసిన వంగ గీత‌పై 500 స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓట‌మి పాల‌య్యారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడినా ఐదేళ్ల పాటు టీడీపీనే అంటిపెట్టుకుని ఎన్నో కార్య‌క్ర‌మాలు చేయ‌డంతో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ప‌టిష్టం చేశారు.

బలమైన నేతగా వర్మ…

ఇక 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో చివ‌రి నిముషంలో వ‌ర్మ‌కు టికెట్ ఇచ్చేందుకు టీడీపీ నిరాక‌రించ‌డంతో ఆయ‌న రెబ‌ల్‌గా బ‌రిలోకి దిగారు. ఆ ఎన్నిక‌ల్లో అప్ప‌టి వ‌ర‌కు కాకినాడ ఎంపీ సీటు రేసులో ఉన్న పోతుల విశ్వంను పిఠాపురానికి పంపారు. తోట న‌ర‌సింహం టీడీపీలోకి వ‌చ్చి కాకినాడ ఎంపీగా పోటీ చేయ‌డంతో ఆయ‌న కోసం విశ్వంను పిఠాపురం పంపి వ‌ర్మ‌ను బ‌లి చేశారు. చివ‌ర‌కు వ‌ర్మ ఇండిపెండెంట్‌గా బ‌రిలో నిలిచారు. అంత‌కు ముందు ఓడిపోయి ఉండ‌టం… టీడీపీ టికెట్ నిరాక‌రించ‌డం వంటి అంశాలు జ‌నాల్లో ఆయ‌న‌పై విప‌రీత‌మైన సానుభూతిని పెంపొందేలా చేశాయి. దీంతో ఆయ‌న 47 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొంద‌డం విశేషం. గెలిచిన మ‌రుస‌టి రోజే టీడీపీ అధినేత చంద్ర‌బాబును క‌ల‌సి అంతా స‌ర్దుబాటు చేసుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోనూ మంచి అభివృద్ధే జ‌రిగింద‌న్న‌ది టీడీపీ వ‌ర్గాల వాద‌న‌. అభివృద్ధి మాట అటుంచితే ఈసారి ఆ నినాదం ఎన్నిక‌ల్లో ప‌నికొస్తుందంటే ఆలోచించాల్సిన విష‌యం.

త్రిముఖ పోరు ఖాయం…

ఇక ప్ర‌స్తుత ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే ఈసారి ఇక్క‌డ జ‌న‌సేన ఎక్కువ ప్ర‌భావితం చూపేలా క‌న‌బ‌డుతోంది. కాపు సామ‌జకవ‌ర్గం ఓట్లు అత్య‌ధికంగా ఉండ‌టం ఆ పార్టీకి క‌ల‌సి వ‌చ్చే అవ‌కాశం ఉంది. అందుకే ఆ పార్టీ టికెట్ ద‌క్కించుకునేందుకు చాలామంది పోటీ ప‌డుతున్నారు. గెలిచే స‌త్తా ఉన్న సీటుపై అంద‌రూ క‌న్నేశారంటూ జ‌న‌సేన పార్టీ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్న‌మాట‌. గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తాన‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఇక వైసీపీ నుంచి కొంత‌మంది పేర్లు వినబ‌డుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కైతే స్ప‌ష్ట‌త లేదు. అయితే అటు టీడీపీ నుంచి వ‌ర్మ రూపంలో, ఇటు జ‌న‌సేన‌కు కాపులు అండ‌గా ఉంటార‌ని స్ప‌ష్ట‌మ‌వుతున్న నేప‌థ్యంలో వైసీపీ నుంచి కూడా బ‌ల‌మైన అభ్య‌ర్థిని బ‌రిలో నిల‌ప‌కుంటే ఇబ్బంది త‌ప్ప‌ద‌ని ఆ పార్టీ ఆలోచ‌న‌లో ప‌డినట్లు స‌మాచారం. ప్ర‌స్తుతానికి పెండెం దొర‌బాబు ఉన్నా ఆయ‌న‌కు బీఫామ్ చేతికి వ‌చ్చేవ‌ర‌కు సీటు వ‌స్తుంద‌న్న గ్యారెంటీ లేదంటున్నారు. ఇక వైసీపీ కాపు సామాజకవ‌ర్గం నుంచి ఆర్థికంగా బ‌లంగా ఉన్న మ‌రో అభ్య‌ర్థిని రంగంలోకి దింపాల‌ని చూస్తోందంట‌. చూడాలి ఏం జ‌రుగుతుందో..!

Tags:    

Similar News