మళ్లీ ఆమే దిక్కయ్యారు.. హడావిడి చేసినోళ్లు…?

రాజ‌కీయాలు ఎప్పుడూ ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటాయ‌నే విష‌యాన్ని ఎవ‌రూ చెప్పలేరు. నాయకుల మ‌ధ్య స‌ఖ్యత లోపిస్తే.. ఎంత బ‌లంగా ఉన్నామ‌ని చెప్పుకొన్న పార్టీ అయినా డింకీలు కొట్టిన [more]

Update: 2020-05-01 00:30 GMT

రాజ‌కీయాలు ఎప్పుడూ ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటాయ‌నే విష‌యాన్ని ఎవ‌రూ చెప్పలేరు. నాయకుల మ‌ధ్య స‌ఖ్యత లోపిస్తే.. ఎంత బ‌లంగా ఉన్నామ‌ని చెప్పుకొన్న పార్టీ అయినా డింకీలు కొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక‌, కొన్ని చోట్ల నాయ‌కులు స్వయంకృతంగా చేసుకున్నవి కూడా ఉంటాయి. టీడీపీకి సంబంధించి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో మంచి బ‌లం ఉంది. అయితే, ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతం కార‌ణంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనాల్సిన అవ‌స‌రం ఏర్పడింది. బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఉన్నప్పటికీ.. అంత‌ర్గత‌, వ్యక్తిగ‌త‌విభేదాల కార‌ణంగా పార్టీని న‌ష్టప‌రిచిన సంఘ‌ట‌న చింత‌ల‌పూడిలో టీడీపీకి ఎదురైంది.

పట్టు ఉన్న నియోజకవర్గంలో…..

ఎస్సీ వ‌ర్గానికి రిజ‌ర్వ్ అయిన చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ అధినేత‌ చంద్రబాబు సామాజిక‌వర్గానికి చెందిన నాయ‌కులు జోక్యం చేసుకోవ‌డం, అంతా తామే అయి వ్యవ‌హ‌రించ‌డం పార్టీని తీవ్రంగా న‌ష్ట ‌ప‌రిచింది. విష‌యంలోకి వెళ్తే.. 2014 ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి పీత‌ల సుజాత ఎన్నిక‌య్యారు. ఆమెకు చంద్రబాబు.. వెంట‌నే మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించారు. అయితే, ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి వ‌చ్చే ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఈ నియోజ‌క‌వ‌ర్గంతో సంబంధం లేని దెందులూరు అప్పటి ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్రభాక‌ర్‌ త‌దిత‌రులు జోక్యం చేసుకుని అటు మంత్రిగా ఉన్న సుజాత‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో పాటు పార్టీని భ్రష్టు ప‌ట్టించ‌డంలో త‌మ వంతుగా చేయి వేశారు.

గత ఎన్నికల్లో…..

అయినా కూడా పీత‌ల సుజాత త‌న ప‌ద‌విని కోల్పోయినా.. నియోజ‌క‌వ‌ర్గంలో కార్యక్ర‌మాల‌కు నిర్విరామంగా కృషి చేశారు. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌లు వ‌చ్చేస‌రికి టీడీపీ త‌ర‌ఫున ఓ ఔట్ డేటెడ్ నాయ‌కుడుని ఇక్కడ నిల‌బె ట్టారు చంద్రబాబు. ఆయ‌నే క‌ర్రా రాజారావు. వ‌య‌సైపోయినా, తిర‌గ‌లేని ప‌రిస్థితిలో ఉన్నా.. ఆయ‌న‌కే టికెట్ ఇవ్వడం ఇక్కడ ఆస‌క్తిగా మారింది. 2009లో ఓడి ఆ త‌ర్వాత వైసీపీకి వెళ్లి తిరిగి పార్టీలోకి వ‌చ్చిన రాజారావు ప‌రిస్థితి లెగ‌లేని అత్త.. వంగ‌లేని కోడ‌లు చందంగా ఉంది. దీనికి పైన చెప్పుకొన్న నాయ‌కులు సుజాత ప్రతిష్టను ఏదో విధంగా మ‌స‌క‌బారేలా చేయ‌డం అనే ఏకైక వ్యూహం త‌ప్ప మ‌రేమీ లేదు. ఇక‌, ఇక్కడ నుంచి పోటీ చేసిన‌రాజారావు.. 36 వేల ఓట్ల తేడాతో .. ఓడిపోయారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో…..

త‌ర్వాత కూడా ఆయ‌న ఎక్కడా నియోజ‌క‌వ‌ర్గంలో క‌నిపించ‌లేదు. ఇక‌, ఆయ‌న‌ను ప‌నిగ‌ట్టుకుని తీసుకు వ‌చ్చి.. టికెట్ ఇప్పించిన మాగంటి అనారోగ్యంతోను పార్టీని ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. ఇక మాగంటి రాజ‌కీయం ముగిసిన‌ట్టే. ఇక చింత‌మ‌నేని త‌న స‌మ‌స్యల‌తోనూ ప‌రిమిత‌మయ్యారు. అదే స‌మ‌యంలో బాబు సామాజిక‌వ‌ర్గానికి చెందిన వార‌మ‌ని చెప్పుకొన్న నాయ‌కులు కూడా క‌నీసం పార్టీ కోసం చేసిన కృషి ఏమీలేదు. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున అభ్యర్థుల‌ను నిల‌బెట్టలేని ప‌రిస్థితికి టీడీపీ దిగ‌జారింది. స్థానిక ఎన్నిక‌ల్లో జంగారెడ్డి గూడెం జ‌డ్పీటీసీ వైసీపీకి ఏక‌గ్రీవం అయ్యింది.

స్వతంత్ర అభ్యర్థికే మద్దతు…..

నియోజ‌క‌వ‌ర్గ కేంద్రమైన చింత‌ల‌పూడిలో జ‌డ్పీటీసీ కోసం చివ‌ర‌కు పార్టీ అభ్యర్థి పోటీలో లేక‌పోవ‌డంతో ఇండిపెండెంట్‌కు స‌పోర్ట్ చేస్తున్నారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ఇవ్వక‌పోయినా.. పీతల సుజాత మాత్రం నియోజ‌క‌వ‌ర్గం ప్రజ‌ల‌కు చేరువ‌గానే ఉంటున్నారు. క‌రోనా నేప‌థ్యంలో స్థానికంగా త‌న వంతుగా సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. గ‌తంలో పీత‌ల సుజాతను వ‌ద్దన్న వారు కూడా ఇప్పుడు ఆమెకు జైకొడుతున్నారు. ఆమె అనుచ‌రుల్లో కొంద‌రు పార్టీ మారినా ఇప్పుడు పీత‌ల సుజాత నాయ‌క‌త్వాన్నే కోరుకుంటున్నారు. మ‌రి చంద్రబాబు చింత‌ల‌పూడి టీడీపీ సంక్షోభాన్ని ఎలా ప‌రిష్కరిస్తారో ? చూడాలి.

Tags:    

Similar News