కమిట్ మెంట్ కలసి రావడం లేదా?

మాజీ మంత్రి, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన పీత‌ల సుజాత‌ను టీడీపీలో ప‌క్కన పెట్టారా ? ఆమెను ప‌ట్టించుకోలేదా ? పార్టీ కోసం ఆమె క‌మిట్‌మెంట్‌తోనే ఉన్నప్పటికీ.. [more]

Update: 2020-10-28 00:30 GMT

మాజీ మంత్రి, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన పీత‌ల సుజాత‌ను టీడీపీలో ప‌క్కన పెట్టారా ? ఆమెను ప‌ట్టించుకోలేదా ? పార్టీ కోసం ఆమె క‌మిట్‌మెంట్‌తోనే ఉన్నప్పటికీ.. ప‌ట్టించుకోవ‌డం లేదా ? ఇప్పుడు ఈ ప్రశ్నలే టీడీపీ శ్రేణుల్లో ముఖ్యంగా రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌గా ఉండే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నాయ‌కుల్లో వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణం .. తాజాగా టీడీపీ వివిధ క‌మిటీలను ప్రక‌టించారు. అదేవిధంగా పొలిట్‌బ్యూరోను కూడా ప్రక‌టించారు. దీనిలో చాలా మందికి అవ‌కాశం క‌ల్పించారు. అయితే, గ‌త కొన్నాళ్లుగా పార్టీలో ప్రాధాన్యం కోసం ఎదురు చూస్తున్న పీత‌ల సుజాత‌కు మాత్రం ఎలాంటి ప‌ద‌వీ ద‌క్కలేదు.

పార్టీకి నమ్మకంగా ఉన్నా…..

పైగా పార్టీ అధినేత చంద్రబాబు పీత‌ల సుజాత‌ను అస‌లు ప‌ట్టించుకున్నట్టే క‌నిపించ‌డం లేదు. దీంతో ఆమె సానుభూతిప‌రులు.. చింత‌ల ‌పూడి నియోజ‌క‌వ‌ర్గం ప్రజ‌లు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. పార్టీ కోసం పీత‌ల సుజాత‌ ఎంతో శ్రమించార‌ని, పైగా పొరుగు పార్టీల వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేద‌ని.. పార్టీలో ఎన్ని అవ‌మానాలు ఎదురైనా.. ఆమె ఎదుర్కొని నిలిచార‌ని అంటున్నారు. నిజానికి పీత‌ల సుజాతకు ఆశించిన విధంగా పార్టీలో గ్రాఫ్ పెర‌గ‌డం లేదు. 2004లో పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన పీత‌ల సుజాత‌ గెలుపు గుర్రం ఎక్కారు. అంటే తొలిసారి పోటీ చేసిన స‌మయంలోనే సుజాత విజ‌యాన్ని అందుకున్నారు.

కష్టపడి పనిచేసినా…..

అయితే, త‌ర్వాత 2009 ఎన్నిక‌ల్లో మాత్రం పీత‌ల సుజాత‌కు టికెట్ ద‌క్కలేదు. పైగా పార్టీ ప్రతిప‌క్షంలో ఉంది. అయినా కూడా పీత‌ల సుజాత‌ పార్టీకోసం త‌న క‌మిట్‌మెంట్‌ను ప్రద‌ర్శించారు. బాబు పాద‌యాత్రలో పాల్గొన‌డంతో పాటు పార్టీ కార్యక్రమాల కోసం ఎంతో క‌ష్టప‌డ్డారు. ఈ క్రమంలో 2014లో చింత‌లపూడి నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆ వెంట‌నే మంత్రిప‌ద‌విని ఇచ్చారు చంద్రబాబు. కీల‌క‌మైన గ‌నుల శాఖ మంత్రిగా పీత‌ల సుజాత‌ వ్యవ‌హ‌రించారు. అయితే, అనూహ్యంగా వైసీపీ నుంచి ఇత‌ర నేత‌ల‌ను తీసుకున్న చంద్రబాబు 2017లో కొన్ని ఒత్తిళ్ల నేప‌థ్యంలో ( బాబు సామాజిక వ‌ర్గ నేత‌ల రాజ‌కీయం) ఆమెను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. అయినా.. పీత‌ల సుజాత‌ ఎక్కడా ఆత్మ‌స్థ‌యిర్యం కోల్పోకుండా ముందుకు సాగారు.

మొన్నటి ఎన్నికల్లోనూ…..

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో మ‌రోసారి పీత‌ల సుజాత‌కు పార్టీ అధినేత నుంచి ప‌రాభ‌వం ఎదురైంది. టికెట్ వ‌స్తుంద‌ని ఆశించినా.. చివ‌రి నిముషం వ‌ర‌కు ఊరించి టికెట్ ఇవ్వకుండా చేశారు. నిజానికి ఇంకెవ‌రైనా అయి ఉంటే.. వెంట‌నే పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డ‌మో.. అధినేత‌పై దూష‌ణ‌ల ప‌ర్వానికి దిగ‌డ‌మో చేసేవారు. కానీ, పీత‌ల సుజాత‌ మ‌రింత క‌మిట్‌మెంట్‌తో ప‌నిచేశారు. పార్టీ తిరిగి అధికారంలోకి రావాల‌ని భావించారు. ఇక‌, ఇప్పుడు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి మ‌ళ్లీ వ‌చ్చిన వారికి, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారికి… “బాబూ ఇక మా వ‌య‌సైపోయింది.. ప‌నిచేయ‌లేం..“ అంటూ ఉన్న ప‌ద‌వికే రాజీనామా చేసిన (గ‌ల్లా అరుణ‌) వారికి చంద్రబాబు పొలిట్ బ్యూరో స‌హా.. మ‌రికొన్ని క‌మిటీల్లో చోటు క‌ల్పించారు.

వత్తిళ్లు పెరుగుతుండటంతో…..

అదే స‌మ‌యంలో పార్టీలో ఇప్పటికే కీల‌క ప‌ద‌వుల్లో ఉన్నవారికి రెండేసి ప‌ద‌వులు ఇచ్చారు త‌ప్పితే.. పీత‌ల సుజాత‌ వంటి క‌మిట్‌మెంట్‌తో ప‌నిచేస్తున్న మ‌హిళ‌కు మాత్రం మొండి చేయి చూపించార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మ‌రి దీనిని బాబు కానీ, ఆయ‌న అనుచ‌రులు, స‌న్నిహితులు ఎలా స‌మ‌ర్ధించుకుంటారో చూడాలి. అదే స‌మ‌యంలో మాల సామాజిక వ‌ర్గంలో పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావాలంటూ పీత‌ల సుజాత‌పై తీవ్రమైన ఒత్తిళ్లు వ‌స్తున్నాయి. ఇప్పటికే మాల జేఏసీ నేత‌ల‌తో పాటు పలు మాల సంఘాలు సుజాత‌కు బాస‌ట‌గా ఉంటున్నాయి. ఆమె సైతం ఎప్పుడయినా ఎలాంటి నిర్ణయం అయినా తీసుకునే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News