బీజేపీ వెనకాలేనా? ఫాలో అవ్వక తప్పదా?

ఏపీలో రాజకీయం చూస్తూంటే ప్రతిపక్షం ఎవరో తెలియడంలేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టీడీపీ ఉంది. దానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ మోస్ట్ నేత చంద్రబాబు [more]

Update: 2020-06-02 13:30 GMT

ఏపీలో రాజకీయం చూస్తూంటే ప్రతిపక్షం ఎవరో తెలియడంలేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టీడీపీ ఉంది. దానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ మోస్ట్ నేత చంద్రబాబు నాయకుడిగా ఉన్నారు. అయినా సరే ఏడాదిగా చూస్తూంటే ప్రజా సమస్యల ప్రస్తావన కానీ, పోరాటం కానీ తీసుకుంటే టీడీపీ బాగా వెనకబడి ఉందని విశ్లేషణలు ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందో తెలియదు కానీ బీజేపీ దూకుడుగా వెళ్తోంది. బీజేపీలో కసి కనిపిస్తూంటే టీడీపీలో నైరాశ్యం నిండా ఉంది. దీంతో పోరాటాలకు తమ్ముళ్ళు ముందుకురావడంలేదు. పైగా సోషల్ మీడియా పోరాటంతో సరిపెడుతున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో బీజేపీ హైలెట్ అవుతోందా అన్న డౌట్లు వస్తున్నాయి.

మొదటి నుంచి….

ఇక వైసీపీ సర్కార్ ఇలా అధికారంలోకి వచ్చింది అనుకోగానే పోరాటాలకు బీజేపీ సిధ్ధపడిపోయింది. ఇసుక మీద మొదట గళమెత్తింది కాషాయం పార్టీనే. ఆ తరువాత చంద్రబాబు దాన్ని అందుకున్నారు. ఇక ఇంగ్లీష్ మీడియం మీద కూడ బీజేపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు, ఇక అమరావతి రాజధాని విషయంలో కూడా టీడీపీ ఆలోచించేలోగానే బీజేపీ దూకుడు పెంచింది. ఇక అన్నింటికీ మించి కరోనా టైంలో టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ చేసిన కామెంట్స్ వైసీపీ సర్కార్ ని బాగా ఇరుకున పెట్టాయి. ఇపుడు చూస్తే విద్యుత్ చార్జీల పెంపు మీద మొదట జనలోకి వచ్చింది బీజేపీ అయితే ఆ తరువాత తాపీగా పసుపు పార్టీ సత్యాగ్రహం అంటోంది.

ఎందుకలా…?

నిజానికి ఏపీలో బలం టీడీపీకే ఉంది. నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ కూడా అదే. ఇక ప్రభుత్వం చేసే తప్పులు అన్నీ కూడా అందరి కంటే కూడా వారికే బాగా తెలుస్తాయి. కానీ బీజేపీ మాత్రం ఆ చాన్స్ దొరకబుచ్చుకుంటోంది. దీనికి కారణం ఏపీలో ఎదగాలి, వైసీపీకి ఎదురు నిలవాలి. టీడీపీని పక్కన పెట్టి తామే అధికారం అందుకోవాలన్న పట్టుదల. జనంలో కూడా ఆ భావన కలిగించాలన్నది కూడా కాషాయ దండు ఎత్తుగడ. అందుకే ఎమ్మెల్యేలు లేకపోయినా కూడా జనంలోకి ఆ పార్టీ నేతలు వస్తున్నారు. ఏపీలో రాజకీయ శూన్యత ఉందని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. టీడీపీ ఊపూలూ, మెరుపులూ రోజురోజుకూ తగ్గిపోతాయని కూడా గట్టిగా నమ్ముతున్న బీజేపీ జగన్ పార్టీకి తామే అసలైన ఆల్టర్నేషన్ అని చాటాలనుకుంటోంది.

అదే టార్గెట్….?

దీని మీద ఒక కచ్చితమైన ఆలోచనతో బీజేపీ ఉందని అంటున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ వంటి వారి మాటలను బట్టి చూస్తూంటే తెలంగాణాలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీలను వెనక్కు నెట్టి ముందుకు సాగడమే బీజేపె అజెండాగా తెలుస్తోంది. బీజేపీకి జాతీయ స్థాయిలో బలం ఉంది. వ్యూహకర్తలు ఉన్నారు, కేంద్రంలో అధికారం ఉంది. నాయకులు లేరన్న భయం లేదు. పార్టీ ఉంటుందో పోతుందో అన్న చింత లేదు. అదే టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలకు వారసులు లేకపోతే ఇక బలహీనం అయినట్లే. తమిళనాడులో అన్నా డీఎంకే కధ ఇపుడు అలాగే ఉంది. దాంతో ఏపీలో వైసీపీ బలమైన ప్రాంతీయ పార్టీగా ఉంది. ఇప్పట్లో ఆ పార్టీకి నాయకత్వ సమస్య లేదు. టీడీపీలోనే అలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి. దాంతో బలహీనమైన టీడీపీని వెనక్కి నెట్టి తాము రేసులో ముందుండాలని బీజేపీ చూస్తోంది. అందుకే ఏపీలో పోరాటాలకు బీజేపీ అజెండా సెట్ చేస్తోంది. టీడీపీ ఫాలో అవుతోంది.

Tags:    

Similar News