రాజ‌కీయాల‌కు ఇద్దరు టీడీపీ కీల‌క నేతలు గుడ్ బై…?

ప్రకాశం జిల్లా రాజ‌కీయాల్లో రెండున్నర ద‌శాబ్దాలుగా కీల‌క నేత‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేసిన‌ట్టు విశ్వస‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. [more]

Update: 2021-04-09 06:30 GMT

ప్రకాశం జిల్లా రాజ‌కీయాల్లో రెండున్నర ద‌శాబ్దాలుగా కీల‌క నేత‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేసిన‌ట్టు విశ్వస‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయ‌న ఇటీవ‌ల రాజ‌కీయంగా యాక్టివ్‌గా లేరు. ప్రస్తుతం ఆయ‌న కందుకూరు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నా ఆ ప‌ద‌విని కూడా వ‌దులుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాశం రాజ‌కీయాల్లో పోతుల రామారావు స్ట్రాట‌జీయే వేరు. 1999లో కొండ‌పి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన ఆయ‌న 2004లో అప్పుడు మంత్రిగా ఉన్న దామ‌చ‌ర్ల ఆంజ‌నేయుల‌పై విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత కొండ‌పి ఎస్సీ కావ‌డంతో ఆయ‌న కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు.

ఓటమి తర్వాత….

2014 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి కందుకూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి మ‌రో మాజీ మంత్రి దివి శివరాంను పోతుల రామారావు ఓడించారు. త‌ర్వాత ఆయ‌న టీడీపీలోకి జంప్ చేసి గ‌త ఎన్నిక‌ల్లో కందుకూరు నుంచే పోటీ చేసి మాజీ మంత్రి మ‌హీధ‌ర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయ‌న కందుకూరు నియోజ‌క‌వ‌ర్గానికే కాకుండా.. రాజ‌కీయాల‌కు దూరంగానే ఉంటున్నారు. విశ్వస‌నీయంగా తెలిసిన స‌మాచారం ప్రకారం రామారావు తీవ్ర అనారోగ్యంతో ఉన్నార‌ని.. ఆయ‌న‌కు రాజ‌కీయాలపై ఇక ఆస‌క్తి లేద‌ని… త్వర‌లో కందుకూరు ఇన్‌చార్జ్ ప‌గ్గాల నుంచి కూడా త‌ప్పుకోనున్నార‌ని తెలిసింది. ఆయ‌న సోద‌రులు కూడా అంత స‌మ‌ర్థులు కాక‌పోవ‌డంతో పోతుల ఫ్యామిలీ రాజ‌కీయం ముగిసిన‌ట్టే క‌నిపిస్తోంది.

అప్పుడే కొత్త నేత‌ల క‌న్ను ప‌డిందా ?

పోతుల రామారావు రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవ‌డంతో పాటు ఆయ‌న కందుకూరు నుంచి కూడా వైదొల‌గుతున్నార‌న్న లీకులు బ‌య‌ట‌కు రావ‌డంతో అప్పుడే అక్కడ ఇద్దరు టీడీపీ నేత‌లు క‌న్నేశారు. ఇక్కడ మాజీ మంత్రి దివి శివ‌రాం రాజ‌కీయ శ‌కం కూడా ముగియ‌డంతో కొత్త నేత‌ల‌కు ప‌గ్గాలు ఇవ్వక తప్పని ప‌రిస్థితి. జిల్లా తెలుగు యువ‌త అధ్యక్షుడు, దామ‌చ‌ర్ల కుటుంబానికి చెందిన దామ‌చ‌ర్ల స‌త్యతో పాటు కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలోని వ‌లివేటివారి పాలెం మండ‌లానికి చెందిన బిల్డర్ రాజేష్ కందుకూరు టీడీపీ ప‌గ్గాల కోసం పావులు క‌దుపుతున్నారు. వీరిలో స‌త్య కందుకూరు కోసం కాచుకుని ఉన్నా బ‌య‌ట ప‌డ‌డం లేదు. వాస్తవానికి శిద్ధా కుటుంబం పార్టీ మారిన‌ప్పుడు స‌త్యకు ద‌ర్శి సీటు ఆఫ‌ర్ వ‌చ్చినా..సామాజిక స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగా కందుకూరులో క‌మ్మ వ‌ర్గం ఎక్కువుగా ఉండ‌డంతో కొంద‌రు కందుకూరుకు స‌త్య పేరు సూచించారు.

నాన్ లోకల్ కావడంతో…..

ఆ త‌ర్వాత స‌త్య సైలెంట్ కావ‌డంతో ద‌ర్శి బాధ్యత‌లు ప‌మిడి ర‌మేష్‌కు అప్పగించారు. ఇక కందుకూరుకు పోతుల రామారావు, స‌త్య నాన్ లోక‌ల్ అవుతారు. ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బిల్డర్ రాజేష్ లోక‌ల్ కోటాలో దూసుకు వ‌స్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో సైతం నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసిన టీడీపీ సానుభూతిప‌రుల‌కు రాజేష్ భారీగానే ఆర్థిక‌సాయం చేసి స్థానికంగా కేడ‌ర్‌లో హైలెట్ అయ్యారు. పార్టీ క‌ష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసిన రాజేష్ వైపు కొంద‌రు మొగ్గు చూపుతున్నారు. ఏదేమైనా పోతుల రామారావు త‌ప్పుకుంటున్నార‌న్న వార్తల‌తో వీరిద్దరితో పాటు మ‌రో ఎన్నారైతో పాటు మరి కొంద‌రు నేత‌లు కూడా ఇక్కడ లైన్లోకి వ‌చ్చేయ‌నున్నారు.

Tags:    

Similar News