పరిటాల ఇలాకాలో పాగా వెనుక..!

అనంతపురం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన పరిటాల కుటుంబానికి ఈ ఎన్నికల్లో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. మంత్రులుగా పనిచేసిన పరిటాల రవీంద్ర, పరిటాల సునీత కుమారుడిగా రాజకీయ [more]

Update: 2019-05-26 11:00 GMT

అనంతపురం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన పరిటాల కుటుంబానికి ఈ ఎన్నికల్లో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. మంత్రులుగా పనిచేసిన పరిటాల రవీంద్ర, పరిటాల సునీత కుమారుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన పరిటాల శ్రీరామ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే ఓటమి పాలయ్యారు. తన తల్లి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న రాప్తాడు నుంచి ఆయన ఈసారి పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. హోరాహోరీగా జరుగుతుందనుకున్న ఇక్కడి ఎన్నిక ఏకపక్షమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవాలో తెలుగుదేశం పార్టీ కంచుకోట కూలిపోయింది. పరిటాల శ్రీరామ్ పై వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి 25,575 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. గత రెండు ఎన్నికల్లో పరిటాల సునీతపై స్వల్ప తేడాతో ఓడిన ప్రకాష్ రెడ్డి ఈసారి పరిటాల శ్రీరామ్ ను భారీ తేడాతో ఓడించి సత్తా చాటుకున్నారు.

ప్రజల్లో ఉన్న ప్రకాష్ రెడ్డి

రాప్తాడు నియోజకవర్గం పరిటాల కుటుంబానికి కంచుకోట. 2009లో పరిటాల సునీతపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ప్రకాష్ రెడ్డి 1700 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓడారు. గత ఎన్నికల్లో 7 వేల తేడాతో ఓడారు. రెండుసార్లు ఓడిపోయినా పదేళ్లుగా ప్రకాష్ రెడ్డి నియోజకవర్గంలో ప్రజల్లోనే ఉంటూ వచ్చారు. గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేశారు. బోర్డు వేయించారు. గొర్లు పంపిణీ చేశారు. దీంతో పాటు ఓడిపోయినా తమకు అందుబాటులో ఉంటున్నారనే సానుభూతి ఆయనకు బాగా కలిసి వచ్చింది. అన్నింటికీ మించి వైసీపీ వేవ్ బలంగా ఉండటంతో ఆ విజయం సులువైంది. తెలుగుదేశం పార్టీకి పట్టున్న మండలాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించింది. 22 రౌండ్లలో కేవలం రెండు రౌండ్లు మినహా అన్నింటా ప్రకాష్ రెడ్డి స్పష్టమైన ఆధిక్యత సాధించారు.

శ్రీరామ్ ఓటమికి అనేక కారణాలు

ఇక, పరిటాల శ్రీరామ్ ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం పరిటాల రవీంద్ర, సునీతకు ఓట్లేసిన ప్రజలు మళ్లీ వారి కుమారుడు శ్రీరామ్ కు ఓటేయడం కంటే ఓసారి ప్రకాష్ రెడ్డికి ఓటేద్దామనే భావన ప్రజల్లో బలంగా వచ్చింది. దీనికి తోడు ఎన్నికల ప్రచారంలో ప్రజలను బెదిరించేలా టీడీపీ నేతలు ఓట్లేయాలని హెచ్చరించడం కూడా ఆయనకు మైనస్ అయ్యింది. పరిటాల సునీత సోదరుల పెత్తనం నియోజవర్గంలో పెరగడం, పరిటాల కుటుంబానికి అండగా ఉండే కొందరు నేతలు పార్టీని వీడి వైసీపీలో చేరడం వంటి కారణాలు పరిటాల శ్రీరామ్ ఓటమికి ప్రధానంగా పనిచేశాయి. అయితే, పోటీ చేసిన మొదటి ఎన్నికలోనే పరిటాల శ్రీరామ్ దారుణంగా ఓడిపోవడం మాత్రం ఆయన రాజకీయ భవిష్యత్ కి ఇబ్బందిగా మారనుంది.

Tags:    

Similar News