ప్రత్తిపాటి ఇలా చేతులెత్తేశారేంటి?

గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు నుంచే ఏపీలో గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం రాష్ట్ర రాజ‌కీయాల్లోనే హైలెట్ అయ్యింది. ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌ల ముందు వ‌ర‌కు అప్పటి [more]

Update: 2021-03-18 08:00 GMT

గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు నుంచే ఏపీలో గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం రాష్ట్ర రాజ‌కీయాల్లోనే హైలెట్ అయ్యింది. ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌ల ముందు వ‌ర‌కు అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా టీడీపీలోనే ఉన్న విడదల ర‌జ‌నీ ఆ వెంట‌నే ప్రత్తిపాటి పుల్లారావు సీటుపైనే గురి పెట్టింది. టీడీపీలో సీటు రాద‌ని డిసైడ్ అయ్యి వెంట‌నే వైసీపీ కండువా క‌ప్పుకుని ఇన్‌చార్జ్ అయ్యారు. ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి అసెంంబ్లీలో అడుగు పెడ‌తాన‌ని స‌వాల్ విసిరిన ఆమె అన్నట్టుగానే అసెంబ్లీ ఎన్నికల్లో పుల్లారావుకు గ‌ట్టి పోటీ ఇచ్చి విజ‌యం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. నిజానికి ఇది పుల్లారావుకే ఊహించ‌ని ప‌రిణామం. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ర‌జ‌నీ నియోజ‌క‌వ‌ర్గంలో జోరు చూపిస్తూ ముందుకు వెళుతుంటే ప్రత్తిపాటి పుల్లారావు రాజ‌కీయ నిర్వేదంలో కూరుకుపోయారు. చాలా రోజుల పాటు ఆయ‌న నియోజ‌క‌వర్గానికి దూరంగా హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మై… వ్యాపారాలు చూసుకున్నారు.

ఆయన లేకపోయినా…?

గ‌తేడాదే ప్రారంభ‌మైన మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను కూడా ప్రత్తిపాటి పుల్లారావు ప‌ట్టించుకోలేదు. నియోజ‌క‌వ‌ర్గంలో మూడు మండ‌లాల్లో స్థానికంగా నేత‌లే టీడీపీ త‌ర‌పున అభ్యర్థుల‌ను నిల‌బెట్టి ర‌జ‌నీ అధికారాన్ని ఎదుర్కొని మ‌రీ గెలిచారు. ఏక‌గ్రీవాలు వ‌దిలేస్తే నియోజ‌క‌వర్గంలో వైసీపీతో స‌రిస‌మానంగా పంచాయ‌తీ స్థానాలు టీడీపీ గెలుచుకుంది. వాస్తవానికి ప్రత్తిపాటి పుల్లారావు పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పార్టీ సానుభూతిప‌రుల‌కు ఏ మాత్రం ఆర్థిక‌, స‌హాయ స‌హ‌కారాలు అందించ‌క‌పోయినా… ఆయ‌న కార్యక్షేత్రంలో లేక‌పోయినా ఎక్కువ పంచాయ‌తీలు గెలిచాయి. అదే ప్రత్తిపాటి పుల్లారావు ప‌ట్టించుకుని ఉంటే ఖ‌చ్చితంగా పేట‌లో టీడీపీ ఇంకా మంచి ఫ‌లితాలు సాధించి ఉండేద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేశాయి.

ఆర్థిక సాయం అందించ కుండా…?

ఇక ప్రత్తిపాటి పుల్లారావు క‌నీసం స్థానిక ఎన్నిక‌ల్లో అయినా స‌త్తా చాటి రజ‌నీపై రివేంజ్ తీర్చుకుంటార‌ని నియోజ‌క‌వ‌ర్గ పార్టీ నేత‌లు, టీడీపీ కార్యక‌ర్తలు ఆశించారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను ప‌ట్టించుకోని పుల్లారావు ఇప్పుడు మునిసిప‌ల్ ఎన్నిక‌ల విష‌యంలోనూ ర‌జ‌నీకి ధీటుగా ముందుకు వెళ్లలేని ప‌రిస్థితి అయితే లేదు. ప్రస్తుత మున్సిప‌ల్ ఎన్నిక‌ల వేళ పుల్లారావు పేట‌లో ప్రచారం చేస్తున్నా…. పార్టీ త‌ర‌పున పోటీ చేస్తోన్న అభ్యర్థుల‌కు ఏ మాత్రం ఆర్థిక స‌హాయ స‌హాకారాలు అందించ‌న‌ని ముందే చెప్పేసిన‌ట్టు తెలుస్తోంది. దండం పెట్టి ఓటు అడ‌గండి…. అంత‌కు మించి ఏం చేయ‌వ‌ద్దని అభ్యర్థుల‌కు చెప్పేస్తున్నార‌ట‌.

ఇప్పుడే అలా ఉంటే…?

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు ఇప్పుడు ర‌జ‌నీని ధీటుగా ఎదుర్కొని త‌న ప‌ట్టు చాటుకోవాల్సిన స‌మ‌యంలో ఇలా కాడి కింద ప‌డేయ‌డం పార్టీ శ్రేణుల్లో చాలా మందికి న‌చ్చడం లేదు. మ‌రోవైపు ఎమ్మెల్యే రజనీ ఆర్థిక‌, అంగ బ‌లాల‌తో పాటు అటు కార్యక‌ర్తల‌కు అండ‌గా ఉంటూ పార్టీని ప‌రుగులు పెట్టిస్తోంది. ఇప్పుడే ప్రత్తిపాటి పుల్లారావు బేజారుగా ఉంటే రేప‌టి రోజు పేట‌లో పార్టీ కార్యక‌ర్తలు ఎలా ముందుండి ఫైట్ చేస్తారో ? అసెంబ్లీ ఎన్నిక‌లు ఎలా ఎదుర్కొంటారో ? అని కేడ‌రే నిరుత్సాహంలో ఉంది.

Tags:    

Similar News