మాణిక్యాన్ని పట్టించుకోరా…?

తొక్కితే న‌క్కతోకే తొక్కాలిరా అన్న సామెత బిజెపికి చెందిన మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు ఖ‌చ్చితంగా వ‌ర్తిస్తుంది. ఓ కౌన్సెల‌ర్ రేంజ్ వ్యక్తిగా మాత్రమే ఉన్న మాణిక్యాలరావుకు [more]

Update: 2019-07-09 03:30 GMT

తొక్కితే న‌క్కతోకే తొక్కాలిరా అన్న సామెత బిజెపికి చెందిన మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు ఖ‌చ్చితంగా వ‌ర్తిస్తుంది. ఓ కౌన్సెల‌ర్ రేంజ్ వ్యక్తిగా మాత్రమే ఉన్న మాణిక్యాలరావుకు 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లో భాగంగా అనూహ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం అసెంబ్లీ సీటు దక్కింది. అప్పటివరకు నియోజకవర్గ ప్రజలకు ఆయన పెద్దగా పరిచయం లేని ఓ సామాన్య వ్యక్తి. ట్విస్ట్ ఏంటంటే ఆ ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో టీడీపీకి బలమైన అభ్యర్థి కూడా లేరు. పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఎలాగూ టిడిపి ఓడిపోయే సీటే కదా అని పొత్తులో భాగంగా బిజెపికి వదిలేశారు.

డబుల్ థమాకాతో……

అయితే జిల్లా మొత్తం టిడిపి క్లీన్‌స్వీప్ చేయడంతో ఆ ప్రభావంతో తాడేపల్లిగూడెంలో కూడా బిజెపి నుంచి పోటీ చేసిన మాణిక్యాలరావు ఘన విజయం సాధించారు. ఆయ‌న ఎమ్మెల్యే అవ్వడ‌మే పెద్ద ల‌క్ అనుకుంటే గెలిచాక డ‌బుల్ ల‌క్ ద‌క్కింది. ఈ క్రమంలోనే బిజెపి కోటా + కాపు కోటాలో ఆయనకు అనూహ్యంగా మరో లక్ తగిలింది… గెలిచిన‌ వెంటనే బాబు క్యాబినెట్ లో దేవాదాయశాఖ మంత్రిగా ప్రమోషన్ కూడా వచ్చేసింది. మూడు సంవ‌త్సరాల పాటు చంద్రబాబు క్యాబినెట్‌లో దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు చంద్రబాబుకు ఎప్పుడూ కంట్లో నలుసు మాదిరిగానే వ్యవహరించారు.

ముక్కుసూటితనంతో…..

ముక్కుసూటి త‌నానికి మారుపేరుగా ఉన్న ఆయన బిజెపి నుంచి బయటకు వచ్చాక తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్యేగా రెండేళ్ల కాలంలో నియోజకవర్గంలో టిడిపి నేతలతో నిత్యం యుద్ధం చేస్తూనే వచ్చారు. స్థానిక టీడీపీ నేత‌ల‌తో పాటు జ‌డ్పీచైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజుకు మాణిక్యాల‌రావుకు పెద్ద యుద్ధం న‌డిచింది. తాజా ఎన్నికల్లో మాణిక్యాలరావు ఎమ్మెల్యేగా కాకుండా నరసాపురం నుంచి బిజెపి తరపున ఎంపీగా రేసులో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి రఘురామ కృష్ణంరాజు – టీడీపీ నుంచి కలవపూడి శివ – జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు లాంటి మహామహుల‌తో పోటీపడి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ఏ పదవి దక్కదా….?

మంత్రిగా పనిచేసి ఎంపీగా పోటీ చేసిన మాణిక్యాలరావుకు కనీసం డిపాజిట్లు కాదు కదా… గౌరవప్రదంగా కూడా ఓట్లు రాలేదు. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన తాడేపల్లిగూడెంలోనూ బిజెపి డిపాజిట్లు కాదు కదా చెప్పుకోదగ్గ స్థాయిలో కూడా ఓట్లు దక్కించుకోలేకపోయింది. మాణిక్యాల‌రావు బీజేపీలో ఇంత క‌మిట్‌మెంట్‌గా ప‌నిచేసినా ఆయ‌న‌కు ఆ పార్టీలో ఏ ప‌ద‌వి ద‌క్కే సూచ‌న‌లు లేవు. ఇప్పుడు బీజేపీ ఇత‌ర పార్టీల‌కు చెందిన పెద్ద త‌ల‌కాయ‌ల‌తో నిండిపోతోంది. గోదావ‌రి జిల్లాల నుంచి కూడా చాలా మంది టీడీపీ, జ‌న‌సేన వాళ్లు ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారు. మాణిక్యాల‌రావు బీజేపీలో సీనియ‌ర్‌గా ఉన్నా ఆయ‌న్ను మించిన వాయిస్ ఉన్న నేత‌లు చేరిపోతుండ‌డంతో ఇప్పుడు ఆయ‌న బీజేపీలో ఎదురు చూపులు చూడ‌డం మిన‌హా చేసేదేం క‌న‌ప‌డ‌డం లేదు.

Tags:    

Similar News