రాహుల్ టీం రెడీ అయిపోయినట్లేనా?

రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టబోతున్నారు. త్వరలోనే ఆయన ఎన్నికను అధికారికంగా పార్టీ ప్రకటించబోతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన టీంపై ఫోకస్ పెట్టినట్లు [more]

Update: 2020-12-27 17:30 GMT

రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టబోతున్నారు. త్వరలోనే ఆయన ఎన్నికను అధికారికంగా పార్టీ ప్రకటించబోతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన టీంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సీనియర్లను ఇబ్బంది పెట్టకుండానే ప్రధానమైన పదవులన్నీ యువనేతలకు అప్పగించాలని రాహుల్ గాంధీ నిర్ణయించినట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నేతృత్వంలో యువనేతలతోనే పదవులను భర్తీ చేస్తారని చెబుతున్నారు.

సీనియర్ల కోసం…..

సీనియర్లు కాంగ్రెస్ లో లెక్కకు మించి ఉన్నారు. ఏ రాష్ట్రం చూసుకున్నా పది మందికి తక్కువ కాకుండా సీనియర్ నేతలు ఉన్నారు. వీరిలో రాష్ట్రానికి ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులు, కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు. వీరిందరి కోసం కోర్ కమిటీ వంటి దానిని ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు తెలిసింది. సలహాలు, సూచనలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ ఎప్పటికప్పుడు సూచనలు అందచేయనుంది.

వారు నొచ్చుకోకుండా…..

ఇక సీనియర్లు నొచ్చుకోకుండా వారికి వివిధ బాధ్యతలను అప్పగించాలని చూస్తున్నారు. పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి పదవిని యువతకే అప్పగించి, సీనియర్ నేతలకు మాత్రం పర్యవేక్షణ బాధ్యతలను ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులను కూడా నియమించనున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షులను యువకులనే నియమించనున్నారు.

బలమైన నేతలకు పగ్గాలు…..

ఇక త్వరలో జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి, కేరళ వంటి రాష్ట్రాలకు కూడా బలమైన నేతలను నియమించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఇప్పటికే అసోం, కేరళ రాష్ట్రాలకు తారిక్ అన్వర్, జితేంద్ర సింగ్ లకు సహయాంగా ముగ్గురు కార్యదర్శులను నియమించారు. మధ్యప్రదేశ్ లో కమల్ నాధ్ ను, గుజారాత్ లో అశోక్ చవ్ దా, మహారాష్ట్రలో బాలా సాహెబ్ థొరాట్ స్థానంలో కొత్త వారిని నియమించనున్నారు. కొత్త వారితో తన టీంను రాహుల్ గాంధీ ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి కొత్త టీంతో రాహుల్ గాంధీ రానున్న రోజుల్లో ఏ మేరకు సక్సెస్ సాధిస్తారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News