రాహుల్ పై నమ్మకం పూర్తిగా పోయినట్లేనా?

కాంగ్రెస్ పార్టీ ఇక కోలుకోలేదు. మోదీ పై దేశవ్యాప్తంగా అసంతృప్తి చెలరేగుతున్న సందర్భంలో బలపడాల్సిన కాంగ్రెస్ మరింత బలహీన మవుతుంది. నాయకత్వ లోపం, కీలక నేతలను అధినాయకత్వం [more]

Update: 2021-06-14 16:30 GMT

కాంగ్రెస్ పార్టీ ఇక కోలుకోలేదు. మోదీ పై దేశవ్యాప్తంగా అసంతృప్తి చెలరేగుతున్న సందర్భంలో బలపడాల్సిన కాంగ్రెస్ మరింత బలహీన మవుతుంది. నాయకత్వ లోపం, కీలక నేతలను అధినాయకత్వం పట్టించుకోక పోవడం వంటి కారణాలతో వారు పార్టీని వీడిపోతున్నారు. త్వరలో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు జితిన్ ప్రసాద కాంగ్రెస్ ను వీడ బీజేపీలో చేరడం చర్చనీయాంశమైంది.

పార్టీ పై పట్టు లేకపోవడంతో…?

రాహుల్ గాంధీకి పార్టీపై పట్టు లేదనడానికి జితిన్ ప్రసాద రాజీనామా ఒక ఉదాహరణగా చెప్పాలి. ఏదైనా నాయకుడిపై నమ్మకం ఉంటే నేతలు ఎంతకాలమైనా వెయిట్ చేస్తారు. కానీ రాహుల్ గాంధీ పోకడలు, వ్యవహారశైలిపై నేతలకు నమ్మకం లేనట్లుంది. అందుకే రాహుల్ గాంధీ కోటరీలో ముఖ్యమైన నేతలుగా చెప్పుకునే నేతలే ఆయనను విడిచి వెళుతున్నారు. గతంలో మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడి వెళ్లిపోయారు.

కోటరీలోని నేతలే?

మధ్యప్రదేశ్ లో సింధియాకు కమల్ నాధ్ తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోనే ఆయన బీజేపీలోకి జంప్ చేశారు. ఇప్పుడు జితిన్ ప్రసాద కూడా పార్టీని వీడటంతో రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ పై అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజస్థాన్ లో మళ్లీ సచిన్ పైలట్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. పైలట్ ను, ఆయన వర్గాన్ని అశోక్ గెహ్లాత్ పట్టించుకోవడం లేదు. రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దినా మళ్లీ వ్యవహారం మొదటికొచ్చింది.

యాక్టివ్ అయితేనే?

అసలే కాంగ్రెస్ అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు కేవలం మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, పంజాబ్ రాష్ట్రంలో మాత్రమే అధికారంలో ఉంది. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మరింత యాక్టివ్ అవ్వాల్సి ఉంది. మోదీపై పెల్లుబుకుతున్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకోవాల్సి ఉంది. అయితే బీజేపీ ట్రాప్ లో కాంగ్రెస్ నేతలు పడిపోతున్నారు. తమకు ఏకైక పోటీదారుగా ఉన్న రాహుల్ గాంధీని మానసికంగా దెబ్బతీసేందుకు ఆయన సన్నిహితులనే బీజేపీ చేరదీస్తుంది. ఇప్పటికైనా రాహుల్ గాంధీ పార్టీ నాయకత్వాన్ని స్వీకరించి దేశ వ్యాప్తంగా పర్యటనలు చేపడితే కాంగ్రెస్ కు మళ్లీ మంచిరోజులు వచ్చే అవకాశముంది. లేకుంటే మరోసారి ముచ్చటగా మూడోసారి మోదీ చేతిలో పరాభావం తప్పదు.

Tags:    

Similar News