మళ్లీ ఆదుకుంటుందా? అమ్మ మాదిరే అంటున్న రాహుల్

రాహుల్ గాంధీకి కేరళ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. సంప్రదాయం ప్రకారమయితే ఈసారి యూడీఎఫ్ కే విజయావకాశాలు ఉండాలి. కేరళ ప్రజలు మార్చి మార్చి అధికారాన్ని కట్టబెడుతుంటారు. అయితే ఈసారి [more]

Update: 2021-03-19 18:29 GMT

రాహుల్ గాంధీకి కేరళ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. సంప్రదాయం ప్రకారమయితే ఈసారి యూడీఎఫ్ కే విజయావకాశాలు ఉండాలి. కేరళ ప్రజలు మార్చి మార్చి అధికారాన్ని కట్టబెడుతుంటారు. అయితే ఈసారి తిరిగి ఎల్డీఎఫ్ దే విజయం అని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కేరళ పై ప్రత్యేక దృష్టిపెట్టారు. కొద్ది రోజుల నుంచి కేరళలోనే రాహుల్ గాంధీ మకాం వేశారు. కొద్దిగా కష్టపడితే విజయం సాధించవచ్చన్న నమ్మకంతో కేరళపైనే రాహుల్ గాంధీ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనపడుతుంది.

అక్కడి నుంచే ప్రాతినిధ్యం…..

కేరళ లోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమేధీ ప్రజలు తనను తిరస్కరించినా వయనాడ్ తనను అక్కన చేర్చుకుని పరువు కాపాడింది. అందుకే రాహుల్ గాంధీ యూడీఎఫ్ విజయం కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. మరోసారి యూడీఎఫ్ ను ప్రజలు అమ్మలా ఆదరిస్తారని ఆయన భావిస్తున్నారు. ప్రధానంగా కేరళలోని క్రైస్తవ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు రాహుల్ గాంధీ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి రాహుల్ గాంధీ కీలక బాధ్యతలను అప్పగించారు.

సామాజికవర్గాలే కీలకం…

కేరళలో అత్యధికులు విద్యావంతులే కావడంతో దేశంలో జరుగుతున్న పరిస్థితులు, పెరుగుతున్న ధరలు వంటివి తమకు ఉపకరిస్తాయని రాహుల్ గాంధీ బలంగా విశ్వసిస్తున్నారు. ఇక్కడ కమ్యునిస్టులకు గ్రిప్ ఎక్కువగా ఉన్నా ఈసారి సామాజిక సమీకరణాలు పనిచేస్తాయని భావిస్తున్నారు. కేరళలో 27 శాతం మంది ముస్లింలు, 18 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. ఈ రెండు వర్గాలను తమ వైపునకు తిప్పుకుంటే విజయం ఖాయమని భావిస్తున్నారు.

ఎలాగైనా గెలిచి…..

శబరిమల వివాదంతో బీజేపీ 55 శాతం ఉన్న హిందూ ఓటు బ్యాంకును చీల్చుకోనుంది. ఇది అధికార ఎల్డీఎఫ్ కు ఇబ్బందిగా మారుతుందని రాహుల్ గాంధీ అంచనా వేస్తున్నారు. ఈసారి ఎలాగైనా కేరళలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని రాహుల్ గాంధీ అక్కడే తిష్టవేశారు. మొత్తం మీద కేరళ తన సొంత ప్రాంతంగా రాహుల్ గాంధీ భావిస్తున్నారు. అక్కడ ప్రజలతో మమేకం అవుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News