అలివి కాని చోట….రాహుల్ నిజం తెలుసుకున్నారా?

అలివికాని చోట అధికులమనరాదు ఈ సామెత కాంగ్రెస్ కు ఖచ్చితంగా అతికినట్లు సరిపోతుంది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అత్యాశ కారణంగానే అధికారానికి దూరమయిన సందర్భాలు కూడా లేకపోలేదు. [more]

Update: 2021-01-24 18:29 GMT

అలివికాని చోట అధికులమనరాదు ఈ సామెత కాంగ్రెస్ కు ఖచ్చితంగా అతికినట్లు సరిపోతుంది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అత్యాశ కారణంగానే అధికారానికి దూరమయిన సందర్భాలు కూడా లేకపోలేదు. అందుకే కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి ఈ విషయం తెలిసి వచ్చినట్లుంది. బీహార్ లో చేసిన తప్పును తమిళనాడులో చేయగూడదని నిర్ణయించుకున్నారు. తమిళనాడు కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ క్లాస్ పీకినట్లు సమాచారం.

స్థానాల కేటాయింపుపై…..

త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా కన్పిస్తున్న రాష్ట్రాలు తమిళనాడు, పుదుచ్చేరి. కేరళలో చివరి వరకూ ఫలితం గురించి చెప్పలేం. అయితే ఇప్పుడు తమిళనాడులో డీఎంకే కూటమిలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది. అయితే కొద్ది రోజులుగా అసెంబ్లీ స్థానాల కేటాయింపు పై తమిళనాడు కాంగ్రెస్ నేతలకు, డీఎంకే అధినాయకత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈసారి 60 స్థానాలను కాంగ్రెస్ కోరుకుంటుందని తెలుస్తోంది.

డీఎంకే మాత్రం…

కానీ ఎక్కువ స్థానాలను ఇచ్చేందుకు డీఎంకే సుముఖంగా లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే నలభైకి పైగా స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస పార్టీ కేవలం 8 స్థానాల్లోనే గెలిచింది. అందుకే అప్పట్లో డీఎంకే అధికారానికి దూరమయింది. తాజాగా బీహార్ ఎన్నికల్లోనూ ఆర్జేడీ అధికారంలోకి రాలేకపోవడానికి కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో పోటీ చేయడమే. దీనిపై స్టాలిన్ తీవ్రస్థాయలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు కాంగ్రెస్ నేతలు మాత్రం ఎక్కువ స్థానాల కోసం పట్టుబడుతున్నారు.

జల్లికట్టుకు వచ్చిన సందర్భంలో….

తాజాగా రాహుల్ గాంధీ మధురై వచ్చారు. తమిళనాడు సంప్రదాయంలో భాగంగా జల్లికట్టు ఆటను చూసేందుకు రాహుల్ గాంధీ వచ్చారు. ఈ సందర్భంగా తమిళనాడు కాంగ్రెస్ నేతలతో రాహుల్ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగానే స్థానాల సంఖ్యపై తమిళనాడు కాంగ్రెస్ నేతలు వివరించారు. అయితే ఎక్కువ స్థానాల కోసం పట్టుబట్టవద్దని, గెలిచేందుకు అవకాశం ఉన్న స్థానాలనే ఎంచుకోవాలని రాహుల్ గాంధీ వారికి సూచించినట్లు తెలిసింది. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే సీట్ల విషయంలో రాజీ పడాల్సి ఉంటుందని ఆయన చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద రాహుల్ గాంధీ బలం లేని చోట ఎక్కువ స్థానాల కోసం పట్టుబట్టడం వృధాయేనని, అది ప్రత్యర్థులకు లాభిస్తుందన్న నిర్ణయానికి వచ్చారన్న మాట.

Tags:    

Similar News