ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు…?

ఈ రైలు జీవితకాలం లేటు…రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం దాదాపు ఆగిపోయినట్లే. వయసు, అవకాశాలు, అవసరాలను ద్రుష్టిలో పెట్టుకుంటే ఫుల్ స్టాప్ పెట్టేసినట్లే. ఇకపై తలైవా రాజకీయం పేరిట [more]

Update: 2020-12-30 16:30 GMT

ఈ రైలు జీవితకాలం లేటు…రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం దాదాపు ఆగిపోయినట్లే. వయసు, అవకాశాలు, అవసరాలను ద్రుష్టిలో పెట్టుకుంటే ఫుల్ స్టాప్ పెట్టేసినట్లే. ఇకపై తలైవా రాజకీయం పేరిట వచ్చే వార్తలు సంచలనమూ కాదు. చర్చనీయమూ కాదు. ఎందుకంటే వాటికి కాలం చెల్లింది. ప్రజల కోసం తెగువ చూపలేని హీరోగా రజనీ కాంత్ కి ఇప్పటికే ముద్ర పడిపోయింది. అతను అన్నిటికీ తెగించే నాయకుడు కాదు, ఓన్టీ సినిమా హీరో అంతే. అందరిలాగే అనారోగ్యం సహా అన్ని లెక్కలు సరిచూసుకునే మామూలు మనిషి.

దాదాపు అటకెక్కినట్లే…..

దక్షిణాది సూపర్ స్టార్.. భారతదేశవ్యాప్తంగా కూడా క్రేజ్ ఉన్న నటుడు రజనీ కాంత్ రాజకీయ రంగ ప్రవేశం దాదాపు అటకెక్కేసినట్లే. పార్టీ ఊపిరి పోసుకోకముందే దానికి ఆయువు తీసేశారు. ఈనెలాఖరున పార్టీ ప్రకటన, విధివిధానాలు ఉండబోతున్నాయన్న సంచలనం చల్లారిపోయింది. అబ్బే ఇప్పుడు కాదంటూ స్వయంగా అగ్రనటుడే ప్రకటించేశారు. ఇక శషభిషలు లేవు. సందేహాలు లేవు. పార్టీ వాయిదాకు చూపిన తాజా సాకు అనారోగ్యం. కరోనా విజృంభణ. 1996 నుంచి తమిళరాజకీయాల్లోకి రజనీ కాంత్ వచ్చేస్తున్నట్లుగా పెద్ద ప్రచారమే సాగింది. రెండున్నర దశాబ్దాల తర్వాత కూడా నిర్ణయం తీసుకోలేకపోయారు ఈ సూపర్ స్టార్. ఒక తరం ముగిసిపోయింది. కొత్తవారి ప్రవేశానికి ప్రస్తుతమున్నంతటి సానుకూల పరిస్థితులు గతంలో ఎన్నడూ తమిళనాడు రాజకీయాల్లో లేవు. కరుణానిధి, జయలలితల మరణం తర్వాత మార్పు కోసం ఆ రాష్ట్రం ఎదురుచూస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆకర్షణ కలిగిన నాయకుడొస్తే బాగుండునని సామాన్యుడు సైతం కోరుకుంటున్నాడు. ఈసారి రజనీ కాంత్ తప్పించుకోలేడని అందరూ భావించారు. కానీ అనారోగ్యమనే దేవుడు ఈ పెను ఉపద్రవం నుంచి ఆయనను తప్పించేశాడు. అనిశ్చితంగా , భీరువుగా ఇప్పటికే అపప్రధ మూటగట్టుకున్న రజనీ కాంత్ తన ఆలోచనలను మూటగట్టేశారు.

సందిగ్ధత… సంశయం…

మొదట్నుంచీ రజనీకాంత్ కు రాజకీయాలపై స్పష్టత లేదు. ఏదో ఆవేశంలో ప్రకటనలు చేయడం, తన అభిమానుల్లో ఆశలు రేకెత్తించడం సాగిస్తూ వచ్చారు. అప్పుడప్పుడూ తానున్నానంటూ ఏదో ఒక పార్టీకి వ్యతిరేకంగానో, మద్దతుగానో పరోక్సంగా సంకేతాలు పంపుతూ వచ్చేవారు. కరుణానిధి, జయలలిత రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న దశలో తాను కూడా బరిలోకి దిగితే పరాభవం తప్పదేమోననే సందేహాలు రజనీకాంత్ ను వెన్నాడాయి. పాలిటిక్స్ అన్న తర్వాత విజయాలు, వైఫల్యాలను తట్టుకోగల సామర్థ్యం ఉండాలి. జయలలిత,కరుణానిధి, ఎన్టీయార్ వంటి నాయకులు రాజకీయాల్లో పరాజయాలను ఎదుర్కొన్నవారే. కానీ రజనీకాంత్ కు ఆ స్థాయి మానసిక స్థైర్యం లేదనేది తమిళనాట వినవస్తున్న వాదన. శివాజీ గణేశన్, విజయకాంత్ వంటి అగ్రనటులు సైతం తమిళ రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోయారు. తాజాగా కమలహాసన్ కూడా అదే బాటలో ఉన్నారు. మళ్లీ సినీ శకానికి రాజకీయ రంగంలో ప్రాముఖ్యం పెంచాలంటే రజనీ కాంత్ రావాలని కోరుకునే వారి సంఖ్య గడచిన మూడేళ్లుగా పెరుగుతూ వస్తోంది. ఏడాది కాలంగా ఈప్రచారం , డిమాండ్లు మరింత విస్త్రుతమయ్యాయి. సినిమాల్లో డైలాగులు చెప్పినంత సులభం కాదు, రాజకీయాలు. మానసిక ధృఢత్వమూ చాలా ముఖ్యం. ఆటుపోట్లను తట్టుకోగలగాలి. సున్నిత మనస్కుడిగా కనిపించే రజనీకాంత్ ఈరంగానికి సరిపోడనే భావన ఉంది. అయితే దానిని నేరుగా ఒప్పుకోవడానికి రజనీ కాంత్ కు , ఆయన అభిమానులకు మనస్సు ఒప్పదు. అందుకే రెండున్నర దశాబ్దాలుగా ఏదో రకంగా నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు.

అమితాబ్, చిరంజీవుల బాటలో…

సినిమా రంగం నుంచి రాజకీయాల్లో ప్రవేశించి తమ వల్ల కాదంటూ చేతులెత్తేసిన నాయకులున్నారు. ఉత్తరాదిని ఊపేస్తున్న సమయంలో రాజీవ్ గాంధీ చొరవతో అమితాబ్ రాజకీయాల్లో వచ్చారు. అయిదేళ్లలోనే చాపచుట్టేసి మళ్లీ సినిమాలు చేసుకోవడం మొదలుపెట్టారు. తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యానికి శ్రీకారం చుట్టి రెండేళ్లలోనే బోర్డు తిప్పేశారు. రాజకీయమంటే తెర మీద నటన కాదు. పోరాటం. ప్రత్యర్థులతో ఒకవైపు , ప్రజాసమస్యలపై మరోవైపు సమరం సాగించగల ఓపిక, సంయమనం, నైపుణ్యం ఉండాలి. అది కొరవడటంతోనే ఈ పెద్ద నాయకులు రాజకీయ తెర వెనుకకు వెళ్లిపోయారు. తెలుగులో మరికొందరు నాయకులు, నాయికలు కూడా రాజకీయాల్లో ప్రయత్నం చేశారు. కృష్ణ, కృష్ణం రాజు, జమున, జయసుధ, జయప్రద వంటివారు ఈకోవలో ఉన్నారు. పాలిటిక్స్ ను మలుపు తిప్పేంతటి విజయాలేవీ వీరి ఖాతాల్లో నమోదు కాలేదు. తాజాగా రోజా సీరియస్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కానీ వీరెవరూ చిరంజీవి, రజనీకాంత్ , అమితాబ్ స్థాయుల్లో ప్రభావితం చేయగల నేతలు కారు. మొత్తం పరిస్థితిని మదింపు చేసుకున్న తర్వాతనే రజనీ కాంత్ తనకెందుకు వచ్చిన రాజకీయాలనుకుంటూ సన్యాసం తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.

చాన్సులు మూతపడినట్లే..

వచ్చే ఏడాది తమిళనాడులో శాసనసభ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే రజనీకాంత్ డెబ్భై ఏళ్ల వయసుకు చేరువలో ఉన్నారు. సినిమా రంగంలో సైతం ప్రస్తుతం ఆయన నంబర్ వన్ కాదు. కొత్త రక్తం వచ్చేసింది. క్రమేపీ తెరమరుగయ్యే దశకు చేరుకున్నారు. తనను ఇంతగా ఆదరించిన ప్రజల రుణం తీర్చుకోవాలంటే స్వచ్ఛమైన రాజకీయాలను రుచి చూపించాలంటే రజనీ కాంత్ కి ఇదే చివరి చాన్సు. మార్పు తెస్తాం. మార్పు వస్తోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? అంటూ కొంతకాలంగా తమిళనాట సూపర్ స్టార్ అభిమానులు హడావిడి చేస్తున్నారు. రజనీకాంత్ ప్రకటనతో వారి నోళ్లు మూతపడిపోయాయి. ఇప్పటి ఎన్నికలు మిస్ అయితే ఇక శాశ్వతంగా రజనీకాంత్ కు తలుపులు మూసుకుపోయినట్లే. రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న తరుణంలో ఈ సూపర్ స్టార్ తప్పించుకుంటున్నాడు. పార్టీ ప్రకటన చేయండి. మేము చూసుకుంటామంటూ అభిమానులు చేసిన సూచనలను సైతం తిరస్కరిస్తున్నారు. ప్రచారం చేయడానికి తనకు కుదరదు కాబట్టి పార్టీ పెట్టడం లేదంటూ డొంక తిరుగుడు సమాధానంతో అనారోగ్యం ముసుగులో దాక్కుంటున్నారని కొందరు విమర్శిస్తున్నారు. బీజేపీ తమిళనాడును పరోక్షంగా శాసిస్తోంది. డీఎంకే, ఏఐడీఎంకె ల్లో అవినీతి తారస్థాయికి చేరింది. ప్రజలకు ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. దక్షిణాదిలో తమిళనాడు పెద్ద రాష్ట్రం. ఉత్తరాది ప్రాధాన్యం ఉన్న జాతీయ పార్టీల మెడలు వంచే నాయకత్వం ప్రస్తుతం దక్షిణభారతంలో ఎక్కడా కనిపించడం లేదు. రజనీ కాంత్ వంటి ప్రజాదరణ కలిగిన నాయకుడు రాజకీయాల్లో ఉంటే జాతీయ నాయకత్వం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకోసమైనా రజనీ కాంత్ రాజకీయాల్లోకి రావాలని చాలా మంది కోరుకున్నారు. ఆశలు అడియాసలయ్యాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ తలైవా ఫ్యాన్స్ లేవనెత్తిన నినాదం ఒక ప్రశ్నగా వారివైపు ఉరుమురిమి చూస్తోంది.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News