రాపాకను రఫ్పాడిస్తున్నారుగా

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై వత్తిడి పెరుగుతోంది. అయితే పీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని [more]

Update: 2020-01-30 05:00 GMT

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై వత్తిడి పెరుగుతోంది. అయితే పీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి పవన్ కల్యాణ్ జనసేన క్యాడర్ కు హామీ ఇచ్చినప్పటికీ ఆయనపై చర్యలకు దిగే అవకాశాలు లేనట్లే కన్పిస్తుంది. రాపాక వరప్రసాద్ గత ఎన్నికలలో జనసేన పార్టీ తరుపున గెలిచన ఏకైక ఎమ్మెల్యేగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. పవన్ కల్యాణ్ తర్వాత పార్టీలో జనసైనికులు రాపాక వరప్రసాద్ కే జై కొడతారు. ఎక్కడకు వెళ్లినా తమ నేత అంటూ జనసైనికులు రాపాక వరప్రసాద్ కు నీరాజనాలు పడతారు.

లాంగ్ మార్చ్ తర్వాత….

అయితే విశాఖలో జరిగిన లాంగ్ మార్చి తర్వాత రాపాక వరప్రసాద్ జనసేనకు దాదాపుగా దూరమయినట్లే కన్పిస్తుంది. పార్టీ కార్యక్రమాల్లో ఆయన ఎక్కడా పాల్గొనడం లేదు. పవన్ కల్యాణ్ పాల్గొన్న కార్యక్రమాలకు కూడా ఆయన డుమ్మా కొడుతున్నారు. మరోవైపు పార్టీ లైన్ ను పదే పదే ధిక్కరిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంను పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తే రాపాక వరప్రసాద్ ప్రశంసించారు. మూడు రాజధానులను జనసేన తప్పుపడితే రాపాక వరప్రసాద్ జగన్ నిర్ణయాన్ని పొగిడారు.

పీఏసీలో చర్చించిన తర్వాత…..

శాసనసభలో మండలి రద్దుకు అనుకూలంగా రాపాక వరప్రసాద్ ఓటు వేయడంతో జనసేన క్యాడర్ నుంచి ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ద్వారంపూడి చంద్రశేఖర్ పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించినా రాపాక వరప్రసాద్ సైలెంట్ గానే ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ రాపాక వరప్రసాద్ పై ఎలాంటి విమర్శలు చేయవద్దని పవన్ కల్యాణ్ క్యాడర్ ను ఆదేశించారు. తాజాగా పవన్ పీఏసీలో చర్చించి రాపాకపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో జనసేన క్యాడర్ సోషల్ మీడియాలో రాపాక వరప్రసాద్ ను ఒక ఆట ఆడుకుంటోంది.

దూరంపెట్టిన జనసైనికులు….

2009 ఎన్నికల్లో గెలిచిన రాపాక వరప్రసాద్ 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు రాపాక వరప్రసాద్ కు వచ్చిన ఓట్లు 318 ఓట్లు మాత్రమే. దీన్ని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. జనసేన అండ లేకుంటే రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ గెలిచే వాడు కాదని పోస్టింగ్ లు ఇబ్బడి ముబ్బడిగా పెడుతున్నారు. రాపాక వరప్రసాద్ అసలు బలం ఇదీ అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు రాజోలులో జనసేన కార్యకర్తలు పూర్తిగా రాపాక వరప్రసాద్ ను బహిష్కరించారు. జనసేనతో రాపాకకు సంబంధం లేదంటూ పవన్ నిర్ణయానికి ముందే జనసేన క్యాడర్ రాజోలులో డిసైడ్ చేసేసింది. మొత్తం మీద జనసేన కార్యకర్తలు రాపాక వరప్రసాద్ తీరుపై మండిపడుతున్నారు. పవన్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు.

Tags:    

Similar News