రాపాక రాజ‌కీయం భ‌లే భలే..!!

రాపాక వ‌ర‌ప్రసాద్‌. రాజ‌కీయాల్లో ఈయ‌న‌కు ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఆయ‌న చేస్తున్న డ‌బుల్ వ్యూహం ఆయన‌ను రాజ‌కీయాల్లో ప్రత్యేకంగా నిలిపింది. 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న జ‌న‌సేన త‌ర‌ఫున [more]

Update: 2020-05-03 02:00 GMT

రాపాక వ‌ర‌ప్రసాద్‌. రాజ‌కీయాల్లో ఈయ‌న‌కు ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఆయ‌న చేస్తున్న డ‌బుల్ వ్యూహం ఆయన‌ను రాజ‌కీయాల్లో ప్రత్యేకంగా నిలిపింది. 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ చేసి, తూర్పు గోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. అయితే, చిత్రమేంటంటే.. ఆ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నుంచి గెలిచింది.. ఈయ‌న ఒక్కడే! పార్టీ అధ్యక్షుడి హోదాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాను పోటీ చేసిన భీమ‌వ‌రం, గాజువాక‌లో ఓడిపోయారు.. అలాగే ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు న‌ర‌సాపురం ఎంపీగాను ఓడిపోయారు. అయితే రాపాక వరప్రసాద్ మాత్రం ఒకే ఒక్కడిగా గెలిచి జెయింట్ కిల్లర్ అయ్యారు. ఈ క్రమంలో ఆయ‌న‌పై ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, ఈయ‌న మాత్రం ఆదిలో అనూహ్యంగా తాను పార్టీ మారేది లేద‌ని, తాను ఒక‌వేళ వైసీపీలోకి(అధికార పార్టీ) జంప్ చేస్తే.. అక్కడ తాను 152వ ఎమ్మెల్యే అవుతాన‌ని చెప్పారు.

వైసీపీకి అనుకూలంగానే?

అదే తాను జ‌న‌సేన‌లో ఉంటే.. ఏకైక ఎమ్మెల్యేగా ఉంటాన‌ని నొక్కి వ‌క్కాణించి నీతులు చెప్పారు. అయితే త‌ర్వాత కాలంలో ఆయ‌న వ్యూహాత్మకంగా అడుగులు వేయ‌డం ప్రారంభించారు. పార్టీ మార‌క‌పోయినా.. పార్టీలోనే ఉన్నా.. వైసీపీకి అనుకూలంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. అది కూడా కీల‌క‌మైన విష‌యాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల‌ను పార్టీ త‌ర‌ఫున అధినేత ప‌వ‌న్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. రాపాక వరప్రసాద్ మా త్రం పూర్తిగా మ‌ద్దతిస్తున్నారు. పైకి మాత్రం ఆయ‌న సైలెంట్ గా ఉన్నప్పటికీ.. మ‌న‌సు మాత్రం వైసీపీ నేత‌ల‌తో చెట్టాప‌ట్టాలేసుకుని ముందుకు సాగుతోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అంతా వాళ్లు చెప్పినట్లే…

ఇక‌, నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాల్లోనూ వైసీపీ నేత‌ల‌తో క‌లిసే ఆయ‌న వ్యూహ ర‌చ‌న చేస్తున్నార‌ని అంటున్నారు. పోనీ.. వ్యక్తిగ‌తంగా రాపాక వరప్రసాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారా? అంటే.. అది క‌నిపించ‌డం లేద‌న్నది స్థానికుల అభిప్రాయం. ఆయ‌న వైసీపీ నేత‌ల‌తోనే చెట్టాప‌ట్టా లేసుకుని తిరుగుతుండ‌డంతో పాటు వాళ్లు చెప్పిన‌ట్టే న‌డుస్తున్నార‌న్న టాక్ రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా వ‌చ్చేసింది. ఎన్నిక‌ల‌కు ముందు ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన బొంతు రాజేశ్వర‌రావును వ్యతిరేకించిన కొంద‌రు రాజులు రాపాక‌కు స‌పోర్ట్ చేసి గెలిపించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో…..

ఎన్నిక‌ల్లో గెలిచాక ఇప్పుడు ఆ రాజులు అంద‌రూ వైసీపీలోకి జంప్ చేసేశారు. ఇక మొన్నటి స్థానిక ఎన్నిక‌ల్లో సైతం రాపాక వరప్రసాద్ తో పాటు నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న బొంతు అమ్మాజీ, అమ‌లాపురం ఎంపీ చింతా అనూరాధ క‌లిసి ఇక్కడ వైసీపీ బీఫామ్‌లు పంచుకున్నట్టు టాక్ కూడా ఉంది. ఇక రాపాక వరప్రసాద్ త‌న వ్య‌వ‌హార శైలీతో నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన కేడ‌ర్‌తో పాటు ప‌వ‌న్ అభిమానుల‌కు పూర్తిగా దూర‌మ‌య్యారు. మొత్తంగా చూస్తే.. రాపాక వరప్రసాద్ ను ఏ ఉద్దేశంతో అయితే, ప్రజ‌లు ఇక్కడ గెలిపించారో.. ఆ వుద్దేశం నెర‌వేర‌క‌పోగా.. రాపాక త‌న‌దైన శైలిలో ముందుకు సాగుతుండ‌డం, అధినేత ప‌వ‌న్ కంట్లో న‌లుసుగా మార‌డం వంటివి కూడా రాజ‌కీయంగా ఆయ‌న‌ను విమ‌ర్శల పాలు చేస్తున్నాయి. మ‌రి రాపాక వ్యూహం ఎలా మారుతుందో.. మున్ముందు ఎలాంటి రాజ‌కీయాలు చేస్తారో చూడాలి.

Tags:    

Similar News