జ‌న‌సేన‌లో రాపాక‌దే గెలుపు

ఎస్‌! రాజ‌కీయాల్లో ఎలాంటి ప‌రిస్థితులు ఎప్పుడు క‌లిసి వ‌స్తాయో చెప్పడం క‌ష్టం. ఇప్పుడు రాజోలు నుంచి జ‌న‌సేన టికెట్‌పై విజ‌యం సాధించిన రాపాక వ‌ర‌ప్రసాద్‌కు ఆడింది ఆట‌గా [more]

Update: 2019-12-16 06:30 GMT

ఎస్‌! రాజ‌కీయాల్లో ఎలాంటి ప‌రిస్థితులు ఎప్పుడు క‌లిసి వ‌స్తాయో చెప్పడం క‌ష్టం. ఇప్పుడు రాజోలు నుంచి జ‌న‌సేన టికెట్‌పై విజ‌యం సాధించిన రాపాక వ‌ర‌ప్రసాద్‌కు ఆడింది ఆట‌గా పాడింది పాట‌గా ఉంది. ఆయన ఏం చేసినా అడిగేవారు లేరు. ఆయ‌న ఏం మాట్లాడినా.. చ‌ర్యలు తీసుకోమ‌ని ఫిర్యాదు చేసేవారు, తీసుకునే వారు కూడా లేరు. ఇలా నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాపాక వరప్రసాద్ గురించిన చ‌ర్చ జోరుగా సాగుతోంది. పార్టీ నాయ‌కులు ఎవ‌రైనా పార్టీ లైన్‌ను భిన్నంగా మాట్లాడినా.. వ్యవ‌హ‌రించినా.. ఏం జ రుగుతుంది ? ఏమాత్రం ప్రాతినిధ్యం లేని క‌మ్యూనిస్టుల్లోనే క్రమ‌శిక్షణ చ‌ర్యలు తీసుకుంటున్న ప‌రిస్థితిని మ‌నం చూస్తున్నాం.

కట్టుబాటు ఏమయింది?

ఉదాహ‌ర‌ణ‌కు , సీపీఐ సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు నారాయ‌ణ.. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో జ‌రిగిన దిశ ఘట‌న అనంత‌రం జ‌రిగిన ఎన్ కౌంట‌ర్‌ను స‌మ‌ర్ధించారు. అయితే, ఇది క‌మ్యూనిస్టు సిద్ధాంతానికి వ్యతిరేకం. దీంతో ఆయ‌న‌పై గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో అధిష్టానం చ‌ర్యల‌కు ఉప‌క్రమించేందుకు రెడీ అయింది. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే ఆయ‌న బ‌హిరంగంగా క్షమాప‌ణ చెప్పారు. మ‌రి క‌మ్యూనిస్టులకే ఇలా క‌ట్టుబాటు ఉంటే.. ఆయా పార్టీలు ఆశ్రయించి, అంతో ఇంతో బ‌లోపేతం అవ్వాల‌ని భావించిన జ‌న‌సేన‌లో ఈ క‌ట్టుబాటు ఏమైంది? పార్టీ అధినేత జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. జ‌గ‌న్‌ను ఆయ‌న ప్రభుత్వాన్ని, మంత్రుల‌ను విధానాల‌ను దుమ్మెత్తి పోస్తున్నారు.

చర్యలు తీసుకోలేరా?

మ‌రి ఆయ‌న అడుగు జాడ‌ల్లో న‌డ‌వాల్సిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం త‌న‌కు న‌చ్చిన‌ట్టు, అధికార పార్టీ మెచ్చిన‌ట్టు వ్యవ‌హ‌రిస్తున్నారు. జ‌గ‌న్‌కు పాలాభిషేకాలు చేస్తున్నారు. తెలుగు మాధ్యమం వేస్ట్ అని స‌భ సాక్షిగా కుండ‌బ‌ద్దలు కొట్టారు. త‌న‌పై రెండు చోట్ల ఓడిపోయిన వాళ్లకు చ‌ర్యలు తీసుకునే ద‌మ్ముందా ? అని ప్రశ్నిస్తున్నారు. మ‌రి ఇలాంటి రాపాక‌ వరప్రసాద్ పై జ‌న‌సేనాని ఎలాంటి చ‌ర్యలు తీసుకుంటారు? అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూశారు. కానీ, ఆయ‌న మౌనం పాటిస్తున్నారు.

తన భవిష్యత్తే ముఖ్యమంటూ…..

జనసేనతో పాటు తన భవిష్యత్తు కూడా ముఖ్యమని రాపాక వరప్రసాద్ బహిరంగంగానే చెబుతున్నారు. తన భవిష్యత్ కోసం నిర్ణయం తీసుకుంటానంటున్నారు. గత ఎన్నికల్లో తనకు సీఎం అవ్వాలని లేదని పవన్ కల్యాణ్ అన్నారని, ఇప్పుడైనా సీఎం అవ్వాలని పవన్ కోరుకోవాలని తాను భావిస్తున్నానన్నారు. జనసేన క్షేత్రస్థాయిలో ఏమాత్రం బాగా లేదన్నారు. ఇలా కొనసాగితే పార్టీకి భవిష్యత్తు లేదని రాపాక వరప్రసాద్ కుండ బద్దలు కొట్టారు. దీనికి స్పందించి ఏమాత్రం పిలిచి సంజాయిషీ అడిగినా.. కార‌ణం చెప్పమంటూ.. షోకాజ్ విసిరినా.. ప‌వ‌న్‌కే ఇప్పుడు త‌ల‌పోటు త‌ప్పేలా లేదు. ప‌వ‌న్ ఏదైనా అంటాడేమో ? అని ఉన్న ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నార‌ని పెద్ద ఎత్తున పుకార్లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అటు క‌క్కలేక‌, ఇటు మింగ‌లేక‌.. రాపాక వరప్రసాద్ వ్యవ‌హార శైలిని జీర్ణించుకోలేక జ‌న‌సేనాని ఉక్కిరి బిక్కిరి అవుతున్నార‌ని అంటున్నారు. మ‌రి ఇది ఎన్నాళ్లు కొన‌సాగుతుందో చూడాలి.

Tags:    

Similar News