రోజాకు ఏమయింది…?

పంచ్ లు లేవు… దూకుడు లేదు… ఇంతకు ముందున్న ఫైర్ లేదు. తన పని ఏదో తాను చేసుకుపోతున్నారు. పార్టీలో తాను ఉన్నానని మాత్రం అప్పుడప్పడు కన్పించి…వినిపిస్తున్నారు [more]

Update: 2019-11-27 13:30 GMT

పంచ్ లు లేవు… దూకుడు లేదు… ఇంతకు ముందున్న ఫైర్ లేదు. తన పని ఏదో తాను చేసుకుపోతున్నారు. పార్టీలో తాను ఉన్నానని మాత్రం అప్పుడప్పడు కన్పించి…వినిపిస్తున్నారు తప్ప మనస్ఫూర్తిగా ఆమె పార్టీ కోసం పనిచేయడం లేదన్నది మాత్రం యదార్థం. ఆమే నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. రోజా మాట వినపడి చాలా రోజులయింది. రోజా ఇంకా అసంతృప్తిలోనే ఉందా? లేకుంటే వర్క్ బిజీలో మునిగిపోయారా? అన్నది వైసీపీలోనే చర్చగా మారింది.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు…..

ఆర్కే రోజా రాజకీయాల్లోకి రావడమే తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ తెలుగుదేశం మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత పరిణామాలతో ఆర్కే రోజా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ లో చేరిన నాటి నుంచి రోజాకు రాజీకీయంగా మంచి రోజులనే చెప్పాలి. ఎందుకంటే 2014 లోనే రోజా నగరి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే అప్పుడు వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆమె ప్రతిపక్ష పాత్రకే పరిమితమయ్యారు. అయితే రోజా ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీని ముప్పు తిప్పలు పెట్టారు.

మంత్రి పదవి వస్తుందని….

2019 ఎన్నికల్లో తిరిగి నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి రోజా విజయం సాధించారు. ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే రోజా ఆశించినట్లు తొలి విడతలో రోజాకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. అసంతృప్తితో మంత్రి వర్గ ప్రమాణస్వీకారానికి కూడా హాజరుకాలేదు. రెడ్డి సామాజికవర్గం కావడంతోనే జగన్ రోజాకు తొలి విడతలో మంత్రిపదవి ఇవ్వలేకపోయారు. అయితే రోజాలో అసంతృప్తిని గమనించిన జగన్ వెంటనే ఆమెకు నామినేటెడ్ పోస్టు ఇచ్చారు. ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిని కట్టెట్టారు. అప్పటి నుంచి రోజా కొంత హ్యాపీగానే ఉన్నప్పటికీ ఇంతకుముందులా దూకూడుగా లేరన్నది యదార్థం.

ప్రాధాన్యత లేదనేనా?

అయితే ఆర్కే రోజా ఎక్కువగా నియోజకవర్గంలోనే గడుపుతున్నారు. జిల్లాలోనూ తమకు పెద్దగా ప్రాధాన్యత లేదని రోజా భావిస్తున్నారు. జిల్లా పెత్తనమంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకోవడంతో రోజా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారట. ఇటీవల టీడీపీ విడుదల చేసిన ఇసుక దందా జాబితాలో రోజా పేరున్నప్పటికీ ఆమె దీనిపై స్పందించలేదు. గతంలో ఉన్న రోజా అయితే టీడీపీ నేతలను మాటలతో చీల్చి చెండాడి ఉండేవారు. కానీ రోజా మౌనంగా ఉండటమే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. రోజాలో ఉన్న అసంతృప్తి ఇంకా తొలగలేదా? మరి రోజా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు. వర్క్ మోడ్ లోకి వెళ్లిపోయారా? అన్నది పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News