జగన్ తోనే చిక్కులా?

తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థలో సమ్మె రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. గ్రామగ్రామానికి విస్తరించిన సంస్థ ఉద్యోగులు, సేవలు తొలిసారిగా పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. అన్నిటికంటే [more]

Update: 2019-10-07 15:30 GMT

తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థలో సమ్మె రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. గ్రామగ్రామానికి విస్తరించిన సంస్థ ఉద్యోగులు, సేవలు తొలిసారిగా పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయ సమరంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏనాడూ పైచేయి సాధించని విపక్షాలకు మొట్టమొదటిసారిగా పెద్ద ప్లాట్ పారమ్ దొరుకుతోంది. విభేదాలను విస్మరించి అంతా కలిసికట్టుగా నడిచేందుకు పొలిటికల్ టూల్ గా దీనిని వినియోగించుకోవాలని చూస్తున్నాయి విపక్షాలు. 50వేల కుటుంబాల ప్రత్యక్ష ఉపాధి, రోజువారీ కోటి మందిని గమ్యానికి చేర్చే ప్రజారవాణా, ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రతిపక్షాలు ఎందుకు వదులుకుంటాయి. అందుకే ఈ ఉద్యమం భవిష్యత్తులో మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తన దృఢ చిత్తాన్ని వెల్లడించిన రాష్ట్రప్రభుత్వం వెనకడుగు వేస్తే లోకువై పోతామేమోనన్న సంశయంలో ఉంది. ఏతావాతా మరింత కాలం సందిగ్ధత, ఉత్కంఠ, ఉద్విగ్నత, ఆందోళన కొనసాగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మారుతున్న రాజకీయ పరిస్థితులను గమనించి కూడా ముఖ్యమంత్రి ఎందుకింత సాహసం చేస్తున్నారన్నదే ప్రశ్నార్థకం.

నాటి రోజులు..

ఒకప్పుడు కార్మికుల కాలిలో ముల్లు దిగితే నోటితో తీస్తానన్నారు కేసీఆర్. ఇప్పుడు వారు ఆర్టీసీ గడప తొక్కడానికే అనర్హులంటున్నారు. సకల జనుల సమ్మెతో తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన కార్మికుల ఉద్యోగాలే ఉండవంటున్నారు. రాజకీయంగా కీలకమైన అంశాన్ని అజెండాగా ప్రతిపక్షాలకు అందిస్తున్నారు. పూర్వాపరాలు, పర్యవసానాల సంగతి పట్టించుకోవడం లేదని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో దాదాపు అన్ని కార్మిక సంఘాలు భాగస్వామ్యం వహించాయి. అయితే ప్రజారవాణాతో ముడిపడిన ఆర్టీసీ చివరిదశలో చేరింది. ఆ తర్వాతనే ప్రజాజీవితం స్తంభించింది. పల్లె, పట్టణం తేడా లేకుండా అంతా రాష్ట్ర విభజన ప్రాధాన్యంపై చర్చించే వాతావరణం ఏర్పడింది. అందుకే కేసీఆర్, టీఆర్ఎస్ సైతం ఉద్యమంలో ఆర్టీ సీ కార్మికుల పాత్రను పొగడ్తలతో ముంచెత్తారు. ఉద్యోగ సంఘాలు సైతం రాష్ట్ర సెంటిమెంటుతో టీఆర్ఎస్ కు మద్దతుగా ఉంటూనే వచ్చాయి. మిగిలిన యూనియన్లతో పోలిస్తే టీఆర్ఎస్ కు పెద్దగా బలం లేకపోయినా ఆర్టీసీ లో అత్యంత ప్రాధాన్యం వహించే స్థాయికి చేరుకుంది. ఇదంతా ఉద్యమం చలవే. సకల జనుల సమ్మెలో కదలిక తెచ్చిన సంస్థగా ఆర్టీసి నిలిచింది. దాని ప్రాముఖ్యం టీఆర్ఎస్ అధినాయకత్వానికి సైతం తెలుసు. అయినప్పటికీ ఇప్పుడు ఉద్యోగులపై ఎన్నడూ లేనంత తీవ్రతను ప్రదర్శించడంలో ఆంతర్యమేమిటన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. దీనివెనుక ప్రత్యేక వ్యూహాలు ఉన్నాయా? లేక పరిస్థితులు కలిసి రాకపోవడంతో తప్పని సరి పరిస్థితుల్లోనే కేసీఆర్ దృఢవైఖరిని తీసుకున్నారా? అన్నదే ఎవరూ తేల్చి చెప్పలేకపోతున్నారు.

పోటాపోటీ…

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాలు తమ పరిధిలోకి వచ్చే ఆర్టీసీ ఉద్యోగులకు గరిష్ట ప్రయోజనాలు కల్పించడంలో పోటీలు పడ్డాయి. ఒక ప్రభుత్వ నిర్ణయం కోసం మరో ప్రభుత్వం వేచి చూసి మరీ వేలం పాట తరహాలో 42 , 43 , 44 శాతం ఫిట్ మెంట్ అందించాయి. రాష్ట్ర విభజనలో ఉద్యోగులు పోషించిన పాత్రకు న్యాయం చేయాలనే సంకల్పంతోనే కేసీఆర్ ఆర్టీసీ చరిత్రలో లేనివిధంగా గరిష్ట లబ్ధి చేకూర్చారు. రాజకీయ తూకం రాళ్లతో నిత్యం మదింపు చేసుకునే చంద్రబాబు నాయుడు సైతం అదే పంథాను అనుసరించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి భారమైనప్పటికీ ప్రభుత్వ పెద్దలు ఉదారంగానే వ్యవహరించారు. దీనినెవరూ తప్పు పట్టలేరు. ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ఆర్టీసీ ఉద్యోగుల పనివేళలు కఠినంగా ఉంటాయి. సౌకర్యాలు అంతంతమాత్రమే. వారి జీవనప్రమాణాలు పెంచేందుకు మంచి జీతభత్యాలు ఇస్తే తప్పులేదు. కానీ సర్కారు నుంచి రావాల్సిన బకాయిల విషయంలో ప్రభుత్వాధినేతలు గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఆర్టీసి ఎప్పటికీ నష్టదాయకంగానే మిగిలిపోతోంది. గడచిన అయిదు సంవత్సరాలు గా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ప్రభుత్వాలు ఆర్టీసిని లాభాల బాట పట్టించేందుకు చేసిన ప్రయత్నాలేమీ పెద్దగా లేవు. పైపెచ్చు ఆర్టీసి నుంచి రోడ్డు టాక్స్, ఇంధనంపై వచ్చే అమ్మకం పన్ను వంటి వాటి ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయమే వచ్చి పడుతోంది.

నేటి కష్టాలు…

పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతోనే తెలంగాణలో సమస్య మొదలైందని చెప్పవచ్చు. దశాబ్దాలుగా దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న డిమాండ్ ను జగన్ ఒక్కసారిగా నెరవేర్చారు. పర్యవసానాలు, ప్రభుత్వంపై పడే భారం వంటివాటిపై పెద్దగా కసరత్తు లేకుండానే నిర్ణయం తీసుకున్నారనే వాదనలున్నాయి. తెలంగాణ అధిక ఆదాయం కలిగిన రాష్ట్రం కాబట్టి కచ్చితంగా సోదర సంస్థ ఉద్యోగుల తరహాలోనే తమనూ ప్రభుత్వంలో కలిపేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. అయితే ఇది నెరవేర్చడం సాధ్యం కాదని కేసీఆర్ బలంగా విశ్వసిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏమంత సజావుగా లేదు. తలకెత్తుకున్న ప్రాజెక్టుల భారం భవిష్యత్తులో తడిసిమోపెడు కాబోతోంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. బడ్జెట్ ను సైతం కుదించుకోవాల్సి వచ్చింది. రానున్న కాలంలో తెచ్చిన అప్పులకు వడ్డీలు, వాయిదాలు చెల్లించడానికి చాలా మొత్తం అవసరమవుతుంది. మరోవైపు ఆర్టీసీ ఏటా రూ.12వందల కోట్లు నష్టాలు తెచ్చుకుంటోంది. 5 వేల కోట్ల రూపాయల వరకూ అప్పు పేరుకుపోయింది. తీవ్రమైన సంస్కరణలు చేపడితే తప్ప ఆర్టీసిని గట్టెక్కించడం సాధ్యం కాదు. అందుకే కేసీఆర్ కొంత ఇబ్బందికరమైనప్పటికీ రాజకీయంగా తీవ్రమైన నిర్ణయమే తీసుకున్నారంటున్నారు అధికారులు. దసరా వేళలో ఉద్యోగులు చేస్తున్న ఒత్తిడి నైతికంగా సరైనది కాదనే ఉద్దేశంతోనే సీఎం సీరియస్ గా ఉన్నారనేది టీఆర్ఎస్ వర్గాల సమాచారం. ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన అనే సాకుతో విపక్షాలన్నీ ఐక్య పోరాట పంథా చేపడితే టీఆర్ఎస్ కు చిక్కులు తప్పకపోవచ్చు. రాజకీయంగా ఈ మధ్యకాలంలో క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ కొంత బలహీనపడింది. ప్రస్తుత వాతావరణం దీనికి మరింత అదనపు బలం చేకూరుస్తుంది. రానున్న కాలంలో ఆర్టీసి ఆందోళన రూపంలో ప్రతిపక్షాల బలనిరూపణ కు మరో రాజకీయ పోరాటం సాగుతుందనే చెప్పవచ్చు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News