సాహో మూవీ డీటైల్డ్ రివ్యూ: రేటింగ్- 2.5/5
బ్యానర్: యువి క్రియేషన్స్ నటీనటులు : ప్రభాస్, శ్రద్ధ కపూర్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్, అరుణ్ విజయ్, మందిరా [more]
బ్యానర్: యువి క్రియేషన్స్ నటీనటులు : ప్రభాస్, శ్రద్ధ కపూర్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్, అరుణ్ విజయ్, మందిరా [more]
బ్యానర్: యువి క్రియేషన్స్
నటీనటులు : ప్రభాస్, శ్రద్ధ కపూర్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్, అరుణ్ విజయ్, మందిరా బేడీ, జాక్వలిన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్.మది
సంగీతం: తనిష్క్ బగ్చీ, గురు రాంద్వా, బాద్‌షా
బ్యాగ్రౌండ్ మ్యూజిక్: జిబ్రాన్
ఎడిటింగ్: ఎ.శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు: యూవీ క్రియేషన్స్, టీ సిరీస్
కథ, దర్శకత్వం: సుజీత్
రెండేళ్ళనుండి ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. ‘బాహుబలి’తో రెండేళ్ల క్రిందట ఇండియా ప్రేక్షకులను ఉర్రుతలూగించిన ప్రభాస్ మళ్ళీ ఇప్పుడు ‘సాహో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. గతంలో ‘మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, మిర్చి’ సినిమాల్లో స్టైలిష్ నటనతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన ప్రభాస్… రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘బాహుబలి’ తో ఆరడుగుల ఆజానుబాహుడిగా, అసలు రాచరికపు రాజులంటే ప్రభాస్ లానే ఉంటారేమో అనిపించేంతటి అందంగా ప్రభాస్ ఉన్నాడు. ‘బాహుబలి’తో టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు తన సత్తా చూపిన ప్రభాస్ తన తర్వాతి సినిమాని కూడా ఇండియా వైడ్ గా చెయ్యాలని అనుకున్నదే తడువు రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్దకత్వంలో ‘సాహో’ లాంటి భారీ యాక్షన్ సినిమాని మొదలు పెట్టాడు. కళ్ళు చెదిరే కార్ ఛేజింగ్, బైక్ ఛేజింగ్, హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్సెస్, భారీ తారాగణం అంటే అంతా బాలీవుడ్ రేంజ్ నటులు, భారీ బడ్జెట్ ఇలా సినిమా అంత భారీ తనంతో కూడుకొవడంతో.. సినిమా మీద మొదటి నుండి అంచనాలు నెలకొన్నాయి. చిన్న దర్శకుడు ఈ సినిమాని ఇండియా వైడ్ గా తెరకెక్కించగలడా అనుకుంటే… టీజర్, ట్రైలర్ తో సుజిత్ అంటే ఏంటో చూపించాడు. ప్రతి ఫ్రేమ్ కూడా రిచెనెస్, భారీ తనం, యాక్షన్ అన్ని ఆకాశంలోనే కనిపించాయి. భారీగా తెరకెక్కిన ఈ సినిమా బిజినెస్ కూడా 335 కోట్ల మేర జరగడం, సినిమా విడుదలకు దగ్గరయ్యే కొలది.. సినిమా మీద బాలీవుడ్ ప్రేక్షకుల ఆసక్తి పెరగడం, ప్రమోషన్స్ తో సాహో టీం పిచ్చెక్కించడం అన్ని సినిమాకి ప్లస్ పాయింట్స్ గా మారాయి. ప్రభాస్ చూపిన ఓ డైలాగ్ లో గల్లీలో ఎవరైనా సిక్స్ కొడతారు… కానీ స్టేడియం లో సిక్స్ కొట్టేవాడికే ఓ రేంజ్ ఉంటుందని చెప్పిన డైలాగ్ చూస్తే… టాలీవుడ్ లో హిట్ ఎవరైనా కొడతారు.. కానీ ఇండియా వైడ్ గా హిట్ కొట్టేవాడికే ఓ రేంజ్ ఉంటుందని చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఇక హీరో ప్రభాస్ కూడా ‘సాహో’ సినిమా ఖచ్చితంగా హిట్ అంటూ చెప్పడం కూడా సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగేలా చేసింది. మరి ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత ‘సాహో’ తో ఎలాంటి హిట్ కొట్టాడు? సుజిత్ ప్రేక్షకుల అంచనాలు అందుకున్నాడా? ‘సాహో’ ప్రేక్షకులను ఏ మేర మెప్పించింది? అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్స్ ఉండే వాజీ సిటీలో మన సాహో కథ మొదలవుతుంది. ముంబయిలో రెండు లక్షల కోట్లతో వస్తున్న ఓ షిప్ పేలిపోతుంది. అదే టైం లో మరోచోట ముంబయిలో రెండు వేల కోట్ల దొంగతనం జరుగుతుంది. ఆ రెండు వెల కోట్ల చోరీసంగతి తేల్చడానికి అండర్ కవర్ కాప్‌గా అశోక్ చక్రవర్తి (ప్రభాస్) రంగంలోకి దిగుతాడు. అయితే అశోక్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన అమృతా నాయర్ (శ్రద్ధ కపూర్)తో కలసి ఈ కేసును విచారిస్తుంటాడు.మరోపక్క పృథ్వీ రాజ్ (టిను ఆనంద్) తన అండర్ వరల్డ్ సామ్రాజ్యానికి తన కొడుకు దేవరాజ్ (చుంకీ పాండే)ను వారసుణ్ని చేయాలనుకుంటాడు. అయితే పృథ్వీరాజ్ చేరదీసిన రాయ్ (జాకీ ష్రాఫ్)… రాయ్ గ్రూప్ పేరుతో క్రైమ్ సిండికేట్‌ను నడిపిస్తుంటాడు. దీంతో రాయ్ మీద దేవరాజ్ పగ పెంచుకుంటాడు. ఓసారి రాయ్ సొంత ఊరైన ముంబయికి వచ్చి అనుమానాస్పదంగా రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఈ నేపథ్యంలో రాయ్ కొడుకు విశ్వక్ (అరుణ్ విజయ్) గ్యాంగ్‌స్టర్ సామ్రాజ్యంలోకి వారసుడిగా వస్తాడు. విశ్వక్ ముంబై షిప్ లో పోయిన ఆ రెండు లక్షల కోట్లను రెండు వారాల్లో తీసుకొస్తానని సవాలు చేస్తాడు. ఇక ఆ రెండు వెల కోట్ల చోరీ కేసు సాల్వ్ చేసే క్రమంలో అశోక్ – అమృతాలు ప్రేమలో పడతారు. తరువాత జరిగిన సంఘటనలతో ఊహించని మలుపులతో సినిమా ఒక బ్లాక్ బాక్స్ చుట్టూ తిరుగుతుంది. అసలు ఈ బ్లాక్ బాక్స్ ఏమిటి? అసలు రాయ్ రోడ్ ఆక్సిడెంట్ లోనే చనిపోయాడా? రాయ్ ని ఎవరు చంపారు? విశ్వక్ చెప్పిఅంట్లుగా రెండు వారాల్లో రెండు లక్షల కోట్లు సంపాదించాడా? అశోక్ చక్రవర్తి – అమృతా నాయర్ లు ఆ రెండు వెల కోట్ల కేసు సాల్వ్ చేసారా? అశోక్ – అమృతాల ప్రేమ ఏమైంది? అసలు ఇందులో సాహో ఎవరు? అనేదే మిగతా సినిమా కథ. మరి ఇన్ని అనుమానాలు తీరాలంటే థియేటర్ కి వెళ్లి సాహో చూడాల్సిందే.
నటీనటుల నటన:
ప్రభాస్ డెడికేషన్ సినిమాకిప్రధాన ఆకర్షణ. అండర్ కవర్ కాప్‌గా ప్రభాస్ అదరగొట్టాడు. సెటిల్డ్‌గా కనిపిస్తూ…. యాక్షన్ సన్నివేశాల్లో తనదైన ఈజ్‌ను చూపించాడు. యాక్షన్ సన్నివేశాల్లో కొన్ని చోట్ల హాలీవుడ్ హీరోలను తలపించాడు. సినిమా సెకండ్ హాఫ్ లో రకరకాల షేడ్స్ మార్చడంలో ప్రభాస్ ఎంతో పరిణితిని చూపించాడు. రొమాంటిక్ సీన్స్ లోను ప్రభాస్ ఎంతో క్యూట్ గా అందంగా కనిపించాడు. స్టైలిష్ నటనతో ఆకట్టుకోవడమే కాదు… చాలా హీనంగా, స్టైలిష్ గా కనిపించాడు. ఇక హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ప్రభాస్ కు పోటీగా నటించి తన అద్భుత నటనతో ఆకట్టుకుంటుంది. పోలీసు ఆఫీసర్ గా శ్రద్ధ కపూర్ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. సగటు అమ్మాయిలా కనిపిస్తూ… అవసరమైనప్పుడు ఫైట్లు చేస్తూ పాత్రకు న్యాయం చేసింది. ప్రభాస్ – శ్రద్ద కపూర్ ల మధ్య లవ్ సీన్స్ కూడా బాగా పండాయి. ఇక విలన్ రోల్స్ కనిపించిన వారు ఆకట్టుకున్నారు. గ్యాంగ్‌స్టర్ నాయకుడిగా చుంకీ పాండే, డాన్ లుక్‌లో తన స్టైల్ మేనరిజమ్స్‌తో అదరగొట్టాడు. కల్కిగా మందిరా బేడీ బాగా చేసింది. జాకీ ష్రాఫ్, టిను ఆనంద్, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేశ్, మురళీ శర్మ తమ పాత్రల మేరకు నటించారు.
విశ్లేషణ:
ఓ చిన్న సినిమా రన్ రాజా రన్ ట్విస్ట్ లతో.. నడిపించి హిట్ కొట్టిన చిన్న దర్శకుడు సుజిత్ ఓ భారీ చిత్రాన్నిహ్యాండిల్ చేయగలడా? ఇది సాహో సినిమా మొదలైనప్పటి అందరి మదిలో మెదిలిన ప్రశ్న. కానీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తోనే సుజిత్ మీదున్న అనుమానాల్ని తొలిగిపోయాయి. సాహో సినిమా కోసం సుజీత్ పెట్టిన ఎఫర్ట్స్ ను మెచ్చుకొనే తీరాలి. ఇంత పెద్ద భారీ సినిమాను హ్యాండిల్ చెయ్యడం ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. ఇలాంటి హెవీ గ్యాంగ్ సినిమాలకు ప్రాణం యాక్షన్ సీన్లు, ట్విస్టులు. అయితే ఈ సినిమాలో అవి కావల్సినన్ని ఉన్నాయి. హాలీవుడ్ గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు సుజిత్ సినిమాను హ్యాండిల్ చేసాడు. అన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఒకదాన్ని మించి ఒకటి పతాక స్థాయిలో ఉంటాయి. వీటికి మాత్రం థియేటర్లో గూస్ బంప్స్ రావడం ఖాయం.ఈ మజాను థియేటర్లో చూస్తే తప్ప ఎంజాయ్ చేయలేము అనే రేంజ్ లో సినిమాని సుజీత్ తెరకెక్కించాడని చెప్పాలి. 2000 కోట్ల భారీ చోరీతో మొదలైన ఈ మూవీ.. ఫస్టాఫ్ మొదట నెమ్మదిగానే మొదలవుతున్నట్టు అనిపించినా.. అలా అలా ఇంటర్వెల్ కి ఆసక్తికరంగా మారుతుంది. వాజీలో డాన్ వారసుడిగా విశ్వక్ రావడం, మరోవైపు ముంబయిలో వరుస దొంగతనాల విచారణకు కాప్‌గా ప్రభాస్ రంగంలోకి దిగడంతో సినిమా వేగం పెరుగుతుంది. దొంగతనానికి అసలు కారకుడిని పట్టుకోవడానికి అశోక్ చక్రవర్తి వేసే ఎత్తుగడలు, దానికి ప్రత్యర్థి జై (నీల్ నితిన్ ముఖేశ్) ఇచ్చే కౌంటర్లతో సినిమా సాగుతుంది. సినిమా ఆఖరులో వచ్చే ప్రభాస్ పాత్రలో రెండో షేడ్ ఆసక్తికరంగా ఉంటుంది. చాలావరకు సినిమా ప్రభాస్ వన్‌మ్యాన్ షోగా నడుస్తుంది. విజువల్స్ కానీ యాక్షన్ సీక్వెన్సులు కానీ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి.ప్రభాస్ మరియు శ్రద్ధాల మధ్య కెమిస్ట్రీ అలాగే ఇంటర్వెల్ బ్లాక్ ఎపిసోడ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. బ్లాక్ బాక్స్ చుట్టూ అల్లుకునే సస్పెన్స్ సినిమాలో ఏం జరుగుతుందా అని ప్రేక్షకుడిలో మరింత క్యూరియాసిటీ కలిగిస్తాయి. కాకపోతే హీరోయిన్ శ్రద్ద పాత్ర హీరోకు ఎదురు తిరగడం ఒక ట్విస్ట్. దీనిని ముందు గానే రివీల్ చేసేసారు. అందువల్ల థియేటర్లో ఈ సన్నివేశాలు అంత ఆసక్తికరంగా ఉండవు. ఇక సినిమా ఫిస్ట్ 30 మినిట్స్ కూడా సాగదీతగానే అనిపిస్తుంది. సుజిత్ రాసుకున్న కథను కొన్ని అనవసరమైన సీన్ల కోసం పాడు చేసుకున్నారనిపిస్తుంది. అలాగే ప్రభాస్ ట్రాక్ సహా స్క్రీన్ ప్లే కూడా చాలా గందరగోళంగా అనిపిస్తుంది. అంతే కాకుండా సినిమాలో విలన్ పాత్రలు కూడా బాగా ఎక్కువయ్యారనిపిస్తుంది. సుజీత్ యాక్షన్ సన్నివేశాల రూపకల్పన మీద పెట్టిన శ్రద్ధ కథనం మీద కూడా చూపించాల్సింది. డైలాగ్స్ కూడా అంతగా పేలలేదు. సినిమాలో ఎక్కువగా బాలీవుడ్ విలన్లుతో నిండిపోవడంతో అప్పుడప్పుడు ఇది డబ్బింగ్ సినిమానా అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ. హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు కెన్నీ బేట్స్, పెంగ్ జాంగ్, స్టీఫెన్ రిట్చెర్, బాబ్ బ్రౌన్‌తోపాటు దిలీప్ సుబ్బరాయన్, స్టంట్ శివ, రామ్ లక్ష్మణ్ అదుర్స్ అనిపించారు. ఎడారిలో భారీకాయులతో ప్రభాస్ చేసిన ఫైట్ సినిమా కు అదనపు ఆకర్షణ. కానీ గందరగోళ స్క్రీన్ ప్లే సినిమా ట్రాక్ తప్పేసింది. ఓ ఫ్లో మిస్ అయ్యిదనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. చాలా వరకు ఊహించగలిగే కథనం ట్విస్టుల్లో కూడా ఏమాత్రం విస్మయానికి గురి చేసే అంశాలు లేకపోవడం సినిమా ఫలితాన్ని బాగా దెబ్బ తీస్తుంది. అలాగే సాహో సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది అనేది కూడా కష్టమే.
సాంకేతిక నిపుణుల పనితనం:
సాహో సినిమాకి మెయిన్ హైలెట్ నేపధ్య సంగీతం. సంగీత దర్శకుడు జిబ్రాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయిలో ఎలివేట్ చేస్తుంది. ఇక బ్యాడ్ బాయ్ సాంగ్ మాత్రం యూత్ ని ఉర్రుతలూగిస్తుంది. మిగతా పాటలు విజువల్ గా బావున్నాయి. ఇక ఈ సినిమాకి మరో మెయిన్ హైలెట్ సినిమాటోగ్రఫీ. సినిమాటోగ్రఫీ అందించిన మాదీ కెమెరా పనితనం అద్భుతంగా ఉంటుంది. సినిమాని రిచ్ గా చూపించడంలో.. మాదీ సక్సెస్ అయ్యాడు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. ఇక ముఖ్యంగా ఈ సినిమాకి పని చేసిన స్టంట్ మాస్టర్ల గురించి చెప్పుకోవాలి. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ల భారీ యాక్షన్ సీన్లతో తెలుగు తెరను హాలీవుడ్ స్టైల్ ఫైట్లతో నింపేశారు. యువి వారి నిర్మాణ విలువలు తెర పై ప్రతి సీన్ లోని కనిపిస్తున్నాయి.
ప్లస్ పాయింట్స్: ప్రభాస్, ఇంటర్వెల్ ట్విస్ట్, ప్రీ-క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్, రెండు పాటలు, యాక్షన్ సీక్వెన్సెస్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ
నెగటివ్ పాయింట్స్ : కథ, కథనం, మ్యూజిక్ ఫ్లాట్ నరేషన్, స్క్రీన్ ప్లే, కామెడీ
రేటింగ్: 2.5/5