నాడు చంద్రబాబు మెచ్చిన అప్పలరాజు నేడు ?

శ్రీకాకుళం జిల్లాలో ఆయన ఒక డాక్టర్. అంతకు మించి ఆయన మెరిట్ స్టూడెంట్. ఇంకా చెప్పాలంటే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడో మూలన ఉన్న పలాసాలో అతి సామాన్య [more]

Update: 2020-07-22 13:30 GMT

శ్రీకాకుళం జిల్లాలో ఆయన ఒక డాక్టర్. అంతకు మించి ఆయన మెరిట్ స్టూడెంట్. ఇంకా చెప్పాలంటే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడో మూలన ఉన్న పలాసాలో అతి సామాన్య కుటుంబంలో పుట్టి ఇంత ఎత్తుకు ఎదిగిన వాడు. సీదరి అప్పలరాజుకు 2017 వరకూ వైసీపీతో అసలు సంబంధం లేదు. ఆయన డాక్టర్ గా ప్రజా సేవ చేస్తూ తరిస్తున్నారు. జనాలలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఆయనకు సామాజిక సేవ చేయాలన్న కోరిక ఉండడంతో జగన్ పాదయాత్ర వేళ ఆయన్ని కలుసుకున్నారు. తమ ఊరే వచ్చిన రాజన్న కొడుకుతో అడుగులు కలిపారు. ఆ అడుగులే మూడేళ్ళు తిరగకుండా అమాత్య కుర్చీ వైపుగా నడిపిస్తారని అప్పలరాజు కలలో కూడా ఊహించలేకపోయారు.

కోట బద్దలు….

పలాసలో గౌతు శ్యామ సుందర శివాజీకి గట్టి పట్టుంది. ఆయన సోంపేట నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు 2019 విభజన ద్వారా ఆయన పలాసాకు షిఫ్ట్ అయి అక్కడ తన సత్తా చాటుకున్నారు. ఆయన హయాంలో టీడీపీ బలపడింది. ఈ క్రమంలో వైసీపీ నుంచి ఎవరిని నాయకులను పెట్టినా కూడా వారు గౌతు కుటుంబానికి గట్టిగా పోటీ ఇవ్వని సీన్ ఉంది. అలా ఉన్న వేళ హ‌ఠాత్తుగా జగన్ డాక్టర్ అప్పలరాజుని మీరే ఈ రోజు నుంచి పలాస వైసీపీ ఇంచార్జి అని పదవి ఇచ్చేశారు. దాంతో అలిగిన పెద్ద నాయకులు, సీనియర్లు అంతా పార్టీని వీడారు. అప్పలరాజు ఏం గెలుస్తాడు అనుకున్నారు. వైసీపీని వీడిన వారంతా టీడీపీ పక్కన చేరి ఓడించాలని చూశారు. అయితే తాను నమ్ముకున్న జనంతో పాటు, జగన్ గాలిలో అప్పలరాజు 16 వేల ఓట్ల మెజారిటీతో గౌతు కుటుంబం రాజకీయ కోటను బద్దలు కొట్టేసారు.

నాడు అలా……

ఇక సీదరి అతి పేద మత్య్సకార కుటుంబంలో పుట్టి డాక్టర్ అయ్యారు. ఆయన పదవతరగతిలో ఉండగా స్టేట్ ఫస్ట్ వచ్చారు. నాడు ఉమ్మడి ఏపీ సీఎం గా ఉన్న చంద్రబాబు నుంచి మెరిట్ సర్టిఫికేట్ అందుకున్నారు. ఆనాడు అప్పలరాజు కలలో కూడా అనుకోని ఉండరు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న అసెంబ్లీకి తాను మంత్రిగా వస్తానని, కానీ విధి విచిత్రం. అది అద్భుతాలనే సృష్టిస్తుంది. ఎవరైతే ప్రతిభా పురస్కారం ఇచ్చి దీవించారో ఆ మాజీ ముఖ్యమంత్రి ఉన్న సభలోనే మంత్రిగా అప్పలరాజు కొలువుతీరాడు అంటే అది ఆయన గొప్పదనానికి కొలమానంగానే చూడాలేమో.

జగన్ మెచ్చాడు….

ఇక జగన్ విషయం తీసుకుంటే ఆయన అందరికీ పరీక్షిస్తారని చెబుతారు. తన కళ్ళ ముందు తిరుగుతూ భజన చేసేవారికి అసలు ఖాతరు చేయరు. అదే సమయంలో తాను అప్పగించిన బాధ్యతలను కచ్చితంగా అమలుచేస్తూ పార్టీకి ఉపయోగపడుతున్న వారిని, విధేయులను జగన్ ఎపుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. దానికి తార్కాణమే సీదరి అప్పలరాజుని పిలిచి మరీ మంత్రిని చేయడం. తాను మంత్రి అన్న మాటే షాక్ గా ఉంటుందని అప్పలరాజు అంటున్నారంటే జగన్ ఆయనకు అనూహ్యమైన వరాన్నే ఇచ్చాడనుకోవాలి. ఏది ఏమైనా అటు చంద్రబాబు, ఇటు జగన్ ఇద్దరూ దీవించిన అప్పలరాజు ఇపుడు మంత్రి అయ్యారు.

Tags:    

Similar News