టీడీపీలోనే ఉంటే బాగుండేదా ? కండువా మారిస్తే పండగ రాదా?

పార్టీలు మార‌డం తేలిక‌.. ఈ కండువా తీసేసి .. కొత్త కండువా మార్చుకోవ‌డం చాలా సుల‌భం. కానీ, ఆ త‌ర్వాత ఎదుర‌య్యే ప‌రిణామాల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ‌డం, మారిన [more]

Update: 2021-02-07 03:30 GMT

పార్టీలు మార‌డం తేలిక‌.. ఈ కండువా తీసేసి .. కొత్త కండువా మార్చుకోవ‌డం చాలా సుల‌భం. కానీ, ఆ త‌ర్వాత ఎదుర‌య్యే ప‌రిణామాల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ‌డం, మారిన పార్టీలో గుర్తింపు సాధించ‌డం అంత తేలిక‌కాదు. బ‌హుశ ఈ విష‌యం పార్టీ మారిన త‌ర్వాత కానీ.. నాయ‌కులకు తెలియ‌డం లేదు. ఇప్పుడు ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి, ప్రకాశం జిల్లాకు చెందిన ద‌ర్శి మాజీ ఎమ్మెల్యే శిద్దా రాఘ‌వ‌రావు. వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన శిద్దా.. టీడీపీలో ఓ వెలుగు వెలిగారు. ఆయ‌న అల్లుడుకి కాంట్రాక్టులు కూడా ఇప్పించుకున్నారు. త‌న‌కు కూడా గ్రానైట్ గ‌నుల లైసెన్సులు తెచ్చుకుని.. జోరుగా వ్యాపారాలు చేశార‌న్న విమ‌ర్శలు అప్పట్లో ఆయ‌నపై వ‌చ్చినా ఓవ‌రాల్‌గా ఆయ‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. వివాద ర‌హిత రాజ‌కీయాలు చేస్తార‌న్న పేరే శిద్దా రాఘ‌వ‌రావుకు ఉంది.

వైసీపీ కండువా కప్పుకున్నా…..

అంతేకాదు.. అనేక మంది మంత్రుల‌కు మ‌ధ్యలోనే చంద్రబాబు ఉద్వాస‌న ప‌లికినా శిద్దా రాఘ‌వ‌రావుకు మాత్రం ఐదేళ్లు మంత్రి ప‌ద‌వి ల‌భించింది. శాఖ‌లు మార్చినా.. మంత్రిగా ఆయ‌న‌కు చంద్రబాబు చ‌క్కని అవ‌కాశం క‌ల్పించారు. గ‌త ఎన్నిక‌ల్లో తిరిగి ద‌ర్శి నుంచి పోటీ చేయాల‌ని అనుకున్నా.. అనూహ్య ప‌రిణామాల నేప‌థ్యంలో ఒంగోలు నుంచి ఎంపీగా బ‌రిలోకి దిగాల్సి వ‌చ్చింది. ఈ మార్పు శిద్దా రాఘ‌వ‌రావుకు ఇష్టంలేక‌పోయినా బాబు ఒత్తిళ్లతో త‌లొగ్గి ఎంపీగా బ‌రిలోకి దిగారు. అయితే.. వైసీపీ సునామీతో ఆయ‌న ఓడిపోయారు. ఇక‌, ఆ త‌ర్వాత వైసీపీ స‌ర్కారు రావ‌డం.. ఆయ‌న వ్యాపారాల‌పై అధికారులు దాడులు చేయ‌డంతో.. పార్టీ మారిపోయి.. వైసీపీ కండువా క‌ప్పేసుకున్నారు.

ఎక్కడ పోటీ చేయాలన్నా…?

పోనీ.. శిద్దా రాఘ‌వ‌రావు ఒక్కరే వెళ్లారా? అంటే .. కాదు.. త‌న కుమారుడు, త‌న త‌మ్ముళ్ల కుమారులను కూడా తీసుకుని ఫ్యాన్ కింద‌కు చేరిపోయారు. దాదాపు పార్టీ మారి ఆరు మాసాల‌పైనే అయింది. అయితే.. ఇటు త‌న నియోజ‌క‌వ‌ర్గంలోను, అటు జిల్లాలోనూ ఒక‌ప్పుడు శిద్దా రాఘ‌వ‌రావు పేరు బాగా వినిపించేది. ఆయ‌న రెండు ద‌శాబ్దాల రాజ‌కీయాల్లో గ‌త ఐదేళ్లు ఓ వెలుగు వెలిగారు. ఆయ‌న మంత్రిగా ఉన్నప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. అయితే.. ఇప్పుడు ఏకంగా నియోజ‌క‌వ‌ర్గం ఇదీ! అని చెప్పుకొనే ప‌రిస్థితి కూడా లేకుండా పోయింది. ఆయ‌న గ‌తంలో ప్రాతినిథ్యం వ‌హించిన ద‌ర్శిలో మ‌ద్దిశెట్టి వేణు ఉన్నారు. పోనీ.. ఈయ‌న‌ను త‌ప్పించినా.. శివ‌ప్రసాద్ పోటీకి రెడీగాఉన్నారు. పోనీ.. ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేద్దాం.. అక్క‌ ప‌ట్టు సాధిద్దాం.. అనుకున్నా.. అక్కడ కూడా వైసీపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బ‌లంగా ఉన్నారు.

చిన్న పని కూడా….?

ఇక జిల్లా కేంద్రంలో బాలినేనిని కాద‌ని చిన్న ప‌ని కూడా జ‌ర‌గ‌దు. దీంతో ఒక‌ప్పుడు జిల్లాలో కింగ్‌గా ఉన్న శిద్దా రాఘ‌వ‌రావు ఇప్పుడు ఓ గ్రామంలో కూడా మాట నెగ్గించుకునే ప‌రిస్థితి లేదు. మ‌రోవైపు ఏదైనా నామినేటెడ్ ప‌ద‌వైనా ఇస్తే ఒకింత గౌరవంగా కాలం గ‌డుపుదామంటే.. అది కూడా ద‌క్కడం లేదు. ఈ ప‌రిణామాల‌తో అల్లాడిపోతున్న శిద్దా రాఘ‌వ‌రావు కుటుంబం.. టీడీపీలోనే ఉండి ఉంటే.. పార్టీ త‌ర‌ఫున ఏదైనా ప‌ద‌వి ద‌క్కి ఉండేద‌ని అంటున్నారు. క‌నీసం వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి శిద్ధా వార‌సుడు సుధీర్‌కు అయినా ఓ గ్రౌండ్ ( నియోజ‌క‌వ‌ర్గం) దొరికే ప‌రిస్థితి లేదు. మొత్తానికి కండువా మార్చేయ‌గానే పండ‌గ కాద‌నే విష‌యం ఇప్పుడు అర్ధమ‌వుతోంద‌ని అంటున్నారు శిద్దా రాఘ‌వ‌రావు అనుచ‌రులు.

Tags:    

Similar News