అప్పన్న ఆలయం చుట్టూ రాజకీయం ?

ఉత్తరాంధ్రలో సుప్రసిధ్ధ ఆలయం శ్రీ సింహాద్రి అప్పన్న ఆలయం. ఈ ఆలయానికి వందల ఏళ్ళ చరిత్ర ఉంది. అదే విధంగా స్వామిని దర్శించుకునేందుకు ఇటు ఒడిషా నుంచి, [more]

Update: 2020-05-03 12:30 GMT

ఉత్తరాంధ్రలో సుప్రసిధ్ధ ఆలయం శ్రీ సింహాద్రి అప్పన్న ఆలయం. ఈ ఆలయానికి వందల ఏళ్ళ చరిత్ర ఉంది. అదే విధంగా స్వామిని దర్శించుకునేందుకు ఇటు ఒడిషా నుంచి, చత్తీస్ ఘడ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. పూసపాటి గజపతుల పర్యవేక్షణలో స్వామి వారి వేడుకలు, ఉత్సవాలు ఏటా జరుగుతూంటాయి. అటువంటి అప్పన్న ఆలయం కొన్ని నెలలుగా వివాదాల్లోకి వెళ్తోంది. ఆలయ ధర్మకర్తగా పూసపాటి వంశానికే చెందిన సంచయిత గజపతిరాజుని నియమించడంతోనే వివాదం రాజుకుంది. ఎందుకంటే ఆలయానికి తొలిసారిగా ఒక మహిళను నియమించడం. అదీ కూడా ఆదరాబాదరాగా నియామకం చేయడం, అప్పటివరకూ ఉన్న పెద్దాయన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు మాట కూడా చెప్పకుండా హఠాత్తుగా ఆయన్ని పదవి నుంచి దించేయడం ఇవన్నీ కూడా ఆస్తిక జనులకు ఆవేదనతో పాటు, ఆశ్చర్యం కలిగించాయి.

పొరపాట్లేనా…?

ఇక స్వామి వారి ఆలయంలో ప్రతిష్టాత్మకమైన చందనోత్సవం ఈ మధ్యన జరిగింది. ఓ వైపు కరోనా వైరస్ ఉండడంతో భక్తులే కాదు, వీఐపీలను కూడా అనుమతించకుండా క్లుప్తంగా ముగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అధికారులు అతి ఉత్సాహం చూపించి తమకు అనుకూలమైన వారిని, బయటవారిని కొందరిని ఆలయానికి తెచ్చారు. దీంతో అది పెద్ద వివాదం అయింది, చివరికి బాధ్యుడిగా ఆలయ ప్రధానాచార్యుడు గోపాలక్రిష్ణమాచార్యులును బలి చేస్తూ తాజాగా సస్పెండ్ చేశారు. దాంతో ఆయన తప్పు తనది కాదని అధికారులే అంతా చేశారని చెబుతున్నారు. ఇపుడు ఇదొక పెద్ద వివాదంగా మారింది.

ఆమెతో తొలి పూజ…..

ఇక కేవలం అధికారులతో మాత్రమే చందనొత్సవం జరిపించాలని, బోర్డు సభ్యులు ఎవరూ రావద్దు అని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు చేసినా కూడా చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు రావడం, ఆమె చేత తొలి పూజ చేయించడం వివాదంగా ఉంది. ఆమె సైతం ఆలయ నిబంధనలు పాటించలేదని, జుట్టుకు ముడి వేసుకోకుండా రావడం, మాస్క్ ధరించి ఆలయం లోపలికి వెళ్ళడం పైన కూడా ఆస్తిక జనులు తప్పుపడుతున్నారు. సంప్రదాయబధ్ధంగా అర్చకులతోనే పూజలు జరిపించాలని, స్వామికి పట్టువస్త్రాలు ఈవో మాత్రమే సమర్పించాలని చెప్పినా సంచయిత రాజకీయ పలులుబడితోనే ఇలా చేశారని అంటున్నారు.

అది కూడా వివాదమే….

ఇక బోర్డు సభ్యుల నియామకంలోనూ వివాదాలు ఉన్నాయి. ఎక్కడ నుంచో ఇతర జిల్లాలకు చెందిన వారిని బోర్డు సభ్యులుగా నియమించడమేంటని కూడా ప్రశ్నలూ కూడా ఉన్నాయి. సింహాచలం ఆలయ పరిధిలో ఉన్న వారిని, భక్తులను, ఆలయ సంప్రదాయాలను తెలిసిన వారిని నియమించాలని, అలా కాకుండా రాజకీయ పునరావాసం కింద, తమకు కావాల్సిన వారిని దేవాదాయ శాఖ మంత్రికి సన్నిహితంగా ఉన్న వారిని, ప్రాంతాలు, కులాలుగా విడదీసి మరీ నియమించుకోవడం కూడా ఇంకా ఇప్పటికీ పచ్చిగానే రచ్చగానే ఉంది. మొత్తానికి అప్పన్న స్వామి ఆలయంలో అపచారాలు జరుగుతున్నాయని ఆస్తిక జనుల ఆవేదన పెరిగి పెద్ద కాకముందే ప్రభుత్వ పెద్దలు జాగ్రత్త పడి ప్రక్షాళన చర్యలకు దిగితే మంచిదేమో.

Tags:    

Similar News