జగన్ తీరు మార్చుకోవాలి .. అందరితో చర్చించాలి

సంక్షోభ సమయంలో రాజకీయాలు పూర్తిగా పక్కన పెట్టాలి. భేషజాలు లేకుండా విపక్షాలతో అన్ని అంశాలను చర్చించాలి. ప్రధాని నరేంద్ర మోడీ ని దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు [more]

Update: 2020-04-16 06:30 GMT

సంక్షోభ సమయంలో రాజకీయాలు పూర్తిగా పక్కన పెట్టాలి. భేషజాలు లేకుండా విపక్షాలతో అన్ని అంశాలను చర్చించాలి. ప్రధాని నరేంద్ర మోడీ ని దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు ఆదర్శంగా తీసుకోవాలి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సూచన పాటించి చంద్రబాబు తో చర్చించాలి. అందువల్ల ఆయన గౌరవం మరింత ఇనుమడిస్తుంది. అధికార యంత్రాంగం అద్భుతంగా తమ విధులను నిర్వర్తిస్తూ సమాజాన్ని కాపాడుకోవడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తుంది. వారికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. వైద్యులు, పోలీసులు, పారిశుధ్య పని వారు ప్రాణాలను పణంగా పెట్టి కరోనాపై యుద్ధం చేస్తున్నారు. వీరికి మనం ఇంటినుంచి బయటకు రాకుండా ఉంటే కృతజ్ఞతలు చెప్పిన వారమవుతామని అన్నారు బిజెపి జాతీయ నాయకులు, ఎమ్యెల్సీ సోము వీర్రాజు. తెలుగు పోస్ట్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన పలు అంశాలను చర్చించారు.

అనేక పాఠాలు నేర్పింది….

కరోనా కట్టడిలో ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలిచింది. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ అంకితభావం ప్రజల సహకారమే అని చెప్పారు సోము వీర్రాజు. కరోనా తో ప్రస్తుతం అమెరికా అల్లాడుతోంది. ఆ దేశానికి భారత్ మందులు పంపించే స్థాయికి ఎదిగింది. ఈ మహమ్మారికి కారణమైన చైనా ను ప్రపంచం నమ్మే పరిస్థితి లేదు. భారత్ ఈ గండం నుంచి ఐక్యంగా పోరాడి గట్టెక్కితే ప్రపంచంలో బలీయమైన శక్తిగా అవతరిస్తుంది. కరోనా అనేక పాఠాలు నేర్పుతుంది. గ్రామీణ భారతం అభివృద్ధికి ఇకపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. అభివృద్ధిని మహానగరాలకు పరిమితం చేస్తే చాలా ప్రమాదం అని ఈ మహమ్మారి చెప్పకనే చెప్పింది. అన్ని ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా విద్యా, వైద్యం, ఉపాధి మౌళిక సౌకర్యాలు గ్రామాలకు చేరితే పట్టణాలు, నగరాలకు గ్రామీణులు వలస వెళ్ళే పరిస్థితే ఉండదు. ఆ దిశగా భవిష్యత్తు లో నిర్ణయాలు వుండే అవకాశాలు ఉన్నాయి అన్నారు వీర్రాజు.

స్వయం సమృద్ధి సాధించాలి …

రాష్ట్రాలు కేంద్రం పై ఎందుకు ఆధారపడాలి. రాష్ట్రాల ఆర్ధికపరిస్థితి నే కేంద్రం ఎదుర్కొంటుంది. పూర్తిగా లాక్ డౌన్ పాటించడంతో మొత్తం ఆర్ధికవ్యవస్థే దిగజారింది. కానీ ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కొనేందుకు కేంద్రం రాష్ట్రాలకు చేయాలిసిన సాయం ఇప్పటికే వేలకోట్ల రూపాయలు అందించింది. కేంద్రం ఐదు వందల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లలో జమ చేయడమే కాదు. రాష్ట్రాలు సాయం చేసేందుకు అవసరమైన విపత్తు నివారణ నిధులుగా అందించిన సొమ్మే. స్వయం సమృద్ధి సాధించే అపార సహజవనరులు, ఖనిజ నిక్షేపాలు రాష్ట్రానికి ఉన్నాయి వాటిని తమ తాబేదారులకు ఇచ్చేలా కాకుండా ఆర్ధిక వనరులుగా మార్చుకోగలిగితే ఆదాయానికి కొదవ ఉండదు. ఆ దిశగా ఎపి నే కాదు అన్ని రాష్ట్రాలు ఈవిధమైన స్వయం సమృద్ధి వైపే ఆలోచించాలి. దేశం ఈ సంక్షోభాన్ని సులభంగా అధిగమిస్తుంది. అందులో సందేహం లేదు. మనకు ఉన్న పొదుపు అలవాటే మనదేశాన్ని శతాబ్దాలుగా రక్షిస్తుంది. కోట్లమంది నిస్సహాయులు గా మారిన ఈ తరుణంలో మన దేశంలో దాతలు చేస్తున్న కార్యక్రమాలు చూస్తే సమాజం పట్ల వారి బాధ్యత అభినందనీయం. ప్రపంచం అంతా ఆర్ధిక మాంద్యం లోకి జారినా అనేక సందర్భాల్లోభారత్ నిలబడింది. దీనికి మనదేశంలో సంప్రదాయంగా వస్తున్న పొదుపు అలవాటే అని పేర్కొన్నారు సోము వీర్రాజు.

బయోవార్ లు భారత్ ను ఏమి చేయలేవు …

ఇప్పటి వరకు భారత్ ఏ దేశం మీదా దండయాత్రలు చేయలేదు. శాంతికాముక దేశం మనది. మన వేదాలు, ఉపనిషత్తులు ఇప్పుడు ప్రపంచానికే ఆదర్శం. మనమే ప్రపంచానికి గైడ్ అండ్ ఫిలాసఫర్ గా భారత్ ఉంది. మన సంస్కృతి, సంప్రదాయం ఆచరించే వారికి దుర్మార్గపు పనులు చేసేవారి ని సత్ప్రవర్తన తెచ్చేవిధంగా మారుస్తాయి. బయోవార్ లే ఇంకా వస్తే దాన్ని తిప్పికొట్టే శక్తి యుక్తి దేశానికి ఉంది. అందుకే మోడీ ట్రంప్ ని తీసుకువచ్చినా చైనా అధ్యక్షుడిని తీసుకువచ్చినా మన దేశ గొప్పతనం చాటిచెప్పడం ద్వారా మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని.

చైనా పై ఇకపై ఆధారపడకుండా …

ఆయుధాల నుంచి అన్ని రంగాల్లో ఇప్పటికే మనం స్వయం సమృద్ధి దిశగా సాగుతున్నాం. దీనికి మోడీ మేక్ ఇన్ ఇండియా ద్వారా అంకురార్పణ చేశారు. ఇప్పటికే ఈ అంశంలో అబ్దుల్ కలాం గారి శిష్యుడు సతీష్ రెడ్డి అండ్ టీం ప్రధానికి సలహాలు అందజేస్తుంది. రాబోయే రోజుల్లో అన్ని వస్తువులను మనం తయారు చేయడం జరుగుతుంది. దిగుమతులు కాదు ఎగుమతులు బాగా మొదలు అవుతున్నాయి. తేనే, నుంచి అన్ని రకాల వస్తువులు మన నుంచే ఎగుమతి అవుతున్నాయి. రైల్వే కోచ్ లు ఆస్ట్రేలియా కు పంపుతున్నాము. వచ్చే రోజుల్లో సమతుల అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. ఇదేదో మోడీ బలోపేతం కోసం కాదు దేశం బలోపేతమే భారతీయ జనతాపార్టీ లక్ష్యం అని చెప్పారు సోము వీర్రాజు.

Tags:    

Similar News