లక్ష దాటితే గొప్పేనట.. అందుకే ఈ తిప్పలట

తిరుపతి ఉప ఎన్నికలను బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణలో మాదిరి ఇక్కడ కూడా ఉప ఎన్నికలో గెలిచి చూపించాలన్నది ఆయన ఆలోచన. లేకుంటే [more]

Update: 2021-01-21 05:00 GMT

తిరుపతి ఉప ఎన్నికలను బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణలో మాదిరి ఇక్కడ కూడా ఉప ఎన్నికలో గెలిచి చూపించాలన్నది ఆయన ఆలోచన. లేకుంటే తనపై వైరి వర్గం పార్టీలో పైచేయి సాధించే అవకాశం ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో తిరుపతిలో గెలవకపోయినా రెండో స్థానంలో ఉండేందుకు సోము వీర్రాజు ప్రయత్నాలు ప్రారంభించారంటున్నారు. తనకు నమ్మకైన నేతలను ఇప్పటికే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో దింపి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు.

సాధారణ ఎన్నికల్లో…..

నిజానికి బీజేపీ సాధారణ ఎన్నికల్లోనే ఒక్క స్థానంలోనూ గెలవలేదు. 175 నియోజకవర్గాల్లో ఎక్కడా రెండో స్థానాన్ని కూడా దక్కించుకోలేదు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో గెలుపును ఆశించడం అత్యాశే అవుతుంది. అయితే తెలంగాణలో బీజేపీ గెలవడంతో ఇక్కడి నేతలకు సమస్యగా మారింది. ప్రధానంగా సోము వీర్రాజుపై ఇప్పటికే వైరి వర్గం కత్తులు నూరుతుంది. తమను పట్టించుకోవడం లేదని, తాము పార్టీలోకి మారిన ప్రయోజనాలకు సోము వీర్రాజు అడ్డంగా ఉన్నారని భావిస్తున్నారు.

సోము వ్యతిరేకులంతా….

అందుకే సోము వీర్రాజును వ్యతిరేకిస్తున్న నేతలంతా పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. జీవీఎల్ నరసింహారావు, విష్ణు వర్థన్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి వంటి నేతలే ఆయనకు సహకరిస్తున్నారు. నిజం చెప్పాలంటే సోము వీర్రాజు కూడా వీరినే నమ్ముకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి, కంభంపాటి హరిబాబు, పురంద్రీశ్వరి వంటి వారు దూరంగా ఉంటున్నారు. వీరందరికీ సరైన సమాధానం చెప్పాలంటే తిరుపతి ఉప ఎన్నికలో మంచి పెరఫార్మెన్స్ ను చూపడమే సోము వీర్రాజు ముందున్న లక్ష్యం.

అందుకే ఈ పాట్లు…..

తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తున్నాయి. అభ్యర్థి ఎవరన్నది ఇంకా నిర్ణయం కాకపోయినా కలసి పోటీ చేస్తాయి. గత ఎన్నికల్లో బీజేపీీకి ఇక్కడ 16 వేల ఓట్లు వచ్చాయి. జనసేన మద్దతు ఇచ్చిన బీఎస్పీ అభ్యర్థికి 20 వేల ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి రెండు కలసినా లక్ష ఓట్లు వస్తే గొప్ప అని విశ్లేషకులు సయితం చెబుతున్నారు. సెకండ్ ప్లేస్ లో టీడీపీకే ఎక్కువ అవకాశాలున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోము వీర్రాజు రామతీర్థం టు కపిలతీర్థం రధయాత్ర చేపట్టారంటున్నారు. ఎన్ని ఫీట్లు చేసినా బీజేపీకి ఓట్లు రావడం అనుమానమే.

Tags:    

Similar News