టీఎస్సార్ దాచుకోంది అందుకేనా?

విశాఖలో అసలైన రాజధానిని నాలుగు దశాబ్దాల క్రితమే టీ సుబ్బరామిరెడ్డి చూశారు. ఆయన ఉమ్మడి ఏపీలో కూడా విశాఖనే ఎంచుకుని అనేక కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. చాలా [more]

Update: 2019-12-29 06:30 GMT

విశాఖలో అసలైన రాజధానిని నాలుగు దశాబ్దాల క్రితమే టీ సుబ్బరామిరెడ్డి చూశారు. ఆయన ఉమ్మడి ఏపీలో కూడా విశాఖనే ఎంచుకుని అనేక కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. చాలా మంది రాజకీయ నాయకులకు భిన్నంగా విశాఖలో ఇల్లు కట్టుకుని సిసలైన దత్తపుత్రుడిని అనిపించుకున్నారు. విశాఖను ఎంతో మందిని తీసుకువ‌చ్చి ఈ నగరం అందాన్ని, ఆనందాన్ని రుచి చూపించిన ఘనత అచ్చంగా టీఎస్సార్ కే దక్కుతుంది. అటువంటి టీఎస్సార్ కి విశాఖ రాజధాని అయితే అంతకంటే వేరే సంబరం ఉంటుందా? అందుకే తన మనసులో ఏ మాత్రం దాచుకోకుండా విశాఖకు జై అనేశారు.

జగన్ తో కలసి…..

విశాఖ ఉత్సవ్ వేదిక మీద సైతం జగన్ తో కలసి టీఎస్సార్ కనిపించడమే కాదు, ఆయనను సన్మానించి గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. నిజానికి వైఎస్సార్ తో టీఎస్సార్ కి మంచి అనుబంధం ఉంది. ఆ ఇద్దరూ దోస్తులుగా ఉండేవారు. జగన్ రాజకీయాల్లోకి వచ్చాక టీఎస్సార్ ఇంత బాహాటంగా ఆయన్ని కలిసింది లేదు. ఇక టీఎస్సార్ కాంగ్రెస్ రాజకీయాల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. విశాఖ నుంచి రెండు సార్లు లోక్ సభకు నెగ్గిన రెడ్డి గారు ముచ్చటగా మూడవసారి రాజ్యసభ సభ్యునిగా వ్యవహరిస్తున్నారు.

రెడేమేడ్ రాజధాని …..

విశాఖను ఏపీకి రాజధానిగా చేసుకోవడం సముచితమైన నిర్ణయం అని టీఎస్సార్ అంటున్నారు. అన్ని వనరులు పుష్కలంగా ఉన్న విశాఖను రాజధానిగా చేసుకుంటే హైదరాబాద్ తరహాలో అద్భుతమైన సిటీగా తయారవుతుందని ఆయన అంటున్నారు. విశాఖ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే నంబర్ వన్ సిటీగా అయ్యే అవకాశాలు కూడా ఇంకా రెట్టింపు అవుతాయని జగన్ నిర్ణయానికి జై కొట్టేశారు. విశాఖ విషయంలో మూలన రాజధాని అంటున్న వారు ఢిల్లీ ఎక్కడ ఉందో, హైదరాబాద్ ఏ మూలన ఉందో చూడమంటున్నారు. ఇంతలా జగన్ కి మద్దతు ఇచ్చిన టీఎస్సార్ రాజకీయాల్లో కలకలం రేపారు.

వైసీపీ వైపేనా…?

మూడుసార్లు రాజ్యసభ సాధించుకున్న టీఎస్సార్ పదవీ కాలం తొందరలో ముగుస్తోంది. ఆయనకు ఢిల్లీ రాజకీయాలే ఇష్టం. ఏపీలో కాంగ్రెస్ లేదు, పైగా కాంగ్రెస్ లో ఎవరికో తప్ప మూడు సార్లు మించి రాజ్యసభకు నామినేట్ చేయరు. ఆ కోటా కూడా రెడ్డిగారు పూర్తి చేసుకున్నారు. దాంతో ఆయన పార్లమెంట్ గడప తొక్కాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి. విశాఖలో కూడా టీఎస్సార్ కు మంచి పేరు ఉంది. సామాన్య జనంలో ఆయన మాటకు విలువ ఎక్కువ. మరి ఆయన్ని వైసీపీలో చేర్చుకుని రాజ్యసభకు పంపుతారా అన్న ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి జగన్ టీఎస్సార్ జోడీ ఫోటోనే పెద్ద రాజకీయ దుమారంగా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News