టీడీపీలో పై నుంచి కింది వరకూ అవే తప్పులా?

ఎక్కడైనా నాయకుడు ఉంటేనే పార్టీ నడుస్తుంది. నాయకత్వం లేకపోయినా, ఆ నాయకుడు పార్టీ ని విడిచి వెళ్లిపోయినా కొత్త నాయకత్వం వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు [more]

Update: 2021-05-15 08:00 GMT

ఎక్కడైనా నాయకుడు ఉంటేనే పార్టీ నడుస్తుంది. నాయకత్వం లేకపోయినా, ఆ నాయకుడు పార్టీ ని విడిచి వెళ్లిపోయినా కొత్త నాయకత్వం వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అదే జరుగుతుంది. అనేక నియోజకవర్గాల్లో పార్టీకి నాయకత్వ సమస్య తలెత్తింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన పనినే నేతలు కూడా అనుసరించడం ఇప్పుడు పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది.

కొత్త నాయకత్వానికి….

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు హయాం నుంచే కొత్త నాయకత్వానికి పెద్దగా అవకాశాలు లేవు. ఇప్పటికీ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు వచ్చిన నేతలు పార్టీని నడిపిస్తున్నారు. సీనియర్ నేతలు ఎక్కువ మంది ఉండటంతో కొత్త నేతలకు అవకాశం లేకుండా పోయింది. తమ నియోజకవర్గాల్లో ద్వితీయ నాయకత్వాన్ని వారు ఎదగనివ్వకపోవడమూ ఇందుకు కారణం. తమ బంధు వర్గాన్ని, కొడుకు, కుమార్తెలను వారసులుగా దింపుతుండటంతో ఆయా నియోజకవర్గల్లో కొత్త నాయకత్వం మూడు దశాబ్దాలుగా ఎదగ లేకపోయింది.

సీనియర్ నేతలతో…..

ఒక తుని నియోజకవర్గం తీసుకుంటే అక్కడ యనమల ఉన్నారు. నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు, పత్తికొండలో కేఈ కృష్ణమూర్తి, రాప్తాడులో పరిటాల కుటుంబం వంటివి ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. ఇక వారు తప్ప తమకు అవకాశం లేదని కొద్దోగొప్పో ఆర్థిక బలం, సామాజికవర్గం అండగా ఉన్న నేతలు బయటకు వెళ్లిపోతున్నారు. అయితే సీనియర్ నేతలు వెళ్లిపోతే మాత్రం అక్కడ నేతలను వెతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది.

ప్రత్యామ్నాయం లేకపోవడంతో…..

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ సీనియర్ నేతగా ఉన్న తోట త్రిమూర్తులు టీడీపీని వీడి ఏడాదిన్నర కావస్తుంది. అయినా ఇంతవరకూ సరైన నాయకత్వం అక్కడ దొరకలేదు. ఇలాంటి నియోజకవర్గాలు ముప్ఫయి నుంచి నలభై వరకూ ఉన్నట్లు గుర్తించారు. కానీ అక్కడ ద్వితీయ నాయకత్వం లేదు. పక్క జిల్లాలు, నియోజకవర్గాల నుంచి నేతలను షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద చంద్రబాబు ఒక నేత వెళ్లి పోతే వందల సంఖ్యలో నాయకులను తయారు చేస్తానని చెప్పే మాట అంతవరకే పరిమితం. కార్యరూపంలో మాత్రం విఫలమనే చెప్పాలి.

Tags:    

Similar News