కబ్జాలకు కులం రంగు… ?

తప్పు ఎవరు చేసినా తప్పే. నేరం ఎవరు చేసినా నేరస్థుడే అవుతాడు. కానీ మధ్యలో కుల సంఘాల పెద్దలు వచ్చి తీర్పులు ఇవ్వడం, తమ వాడు కాబట్టే [more]

Update: 2021-06-19 09:30 GMT

తప్పు ఎవరు చేసినా తప్పే. నేరం ఎవరు చేసినా నేరస్థుడే అవుతాడు. కానీ మధ్యలో కుల సంఘాల పెద్దలు వచ్చి తీర్పులు ఇవ్వడం, తమ వాడు కాబట్టే మంచి వాడే అని సర్టిఫికేట్లు ఇవ్వడమేంటన్నదే విశాఖలో ఇపుడు వాడి వేడి చర్చ. విశాఖ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ భూములు ఆక్రమించుకున్నాడని రెవిన్యూ అధికారులు రంగ ప్రవేశం చేసి వాటిని కూల్చేశారు. దీని మీద వైసీపీ, టీడీపీ నేతల మధ్య రాజకీయల మంటలు పెద్ద ఎత్తున రాజుకున్నాయి. అటు వైసీపీ, ఇటు టీడీపీ నాయకుల మధ్యన మాటల తూటాలూ పేలాయి. అంత వరకూ సరేననుకున్న మధ్యలో కుల సంఘాలు రంగప్రవేశం చేసి పల్లా ఊసెత్తితే ఇంతే సంగతులు అంటూ హెచ్చరించడమే విడ్డూరంగా ఉందని అంటున్నారు.

యాదవుల జోలికొస్తే…?

విశాఖలో యాదవులు ప్రశాంతంగా బతుకుతున్నారు. అటువంటి వారి జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని ఉత్తరాంధ్రా యాదవుల సంఘం నాయకులు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వైసీపీ సర్కార్ పెద్దలను హెచ్చరిస్తున్నారు. పల్లా శ్రీనివాస్ మంచి వ్యక్తి అని, కబ్జాలకు పాల్పడలేదని, అటువంటి ఆయనను ఆక్రమణల పేరిట వేధిస్తే చూస్తూ ఊరుకునేది లేదని కూడా యాదవ సంఘం నాయకులు అంటున్నారు. వైసీపీ యాదవులను టార్గెట్ చేస్తోందని కూడా వారు చెబుతూండడం విశేషం.

తొలి మహిళ ఎవరు…?

సరే కులం ప్రసక్తి వచ్చింది కాబట్టి ఒక్క మాట ఇక్కడ చెప్పుకోవాలి. విశాఖ నగర పాలక సంస్థ మేయర్ ఎవరు, యాదవ మహిళకే కదా వైసీపీ ఈ ఉన్నతమైన స్థానం ఇచ్చింది అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అదే విధంగా విశాఖలో శ్రీక్రిష్ణుడి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించడానికి, పర్యాటక క్షేత్రంగా మార్చడానికి వైసీపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. అలాగే వారికి ఎక్కువగా రాజకీయ ప్రాధ్యాన్యతను ఇవ్వడానికీ చూస్తోంది. అన్నీ అనుకూలిస్తే ఆ సామాజికవర్గం నుంచి భవిష్యత్తులో ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా అయ్యే అవకాశం ఉంది అని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాము ఎక్కడా యాదవులను తక్కువ చేసి చూడడంలేదని, అయినా కబ్జా వ్యవహారాన్ని తీసుకువచ్చి కులం రంగు పూయడమేంటని కూదా వారు ప్రశ్నిస్తున్నారు.

న్యాయం జరుగుతుంది….

ప్రభుత్వ భూములు తీసుకుంటే ఎవరినైనా ఉపేక్షించమని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టంగా చెబుతున్నారు. తమకు కులం, మతం, సొంత పార్టీ అన్నవి లేవని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. పల్లా శ్రీనివాస్ భూములను కబ్జా చేయకపోతే కోర్టులు ఉన్నాయి. అక్కడ ఆయనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది కదా అని కూడా అంటున్నారు. కానీ కుల సంఘాలను మధ్యలో తీసుకురావడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కులాలను మతాలను చూడకూడదని తప్పు జరిగిందా లేదా అన్నదే చూడాలని అంటున్నారు. ఇదిలా ఉంటే గత రెండేళ్లలో వైసీపీ విశాఖలో అనేక మంది నాయకుల భూముల మీద దాడులు చేసింది. మరి వారంతా తన కుల సంఘాల మద్దతుని తీసుకోలేదని కూడా గుర్తు చేస్తున్నారు. వైసీపీకి అన్ని కులాలు సమానమేనని, తమ నుంచి ఒక సామజిక వర్గాన్ని దూరం చేయడానికి టీడీపీ ఆడుతున్న రాజకీయం ఇదని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి పల్లాను అంటే ఒక కులం వారు గుస్సా అవుతున్నారా, లేక టీడీపీలో ఉన్న పల్లా సామాజిక వర్గ టీడీపీ నేతలు ఆగ్రహిస్తున్నారా అన్నదే వైసీపీ ప్రశ్నట.

Tags:    

Similar News