టీడీపీ దూకుడు ముందు వైసీపీ చాల‌డం లేదా…?

రాష్ట్రంలో అధికార ప‌క్షం వైసీపీ దూకుడు క‌న్నా కూడా టీడీపీ దూకుడు ఎక్కువ‌గా ఉందా ? ప్రభుత్వం చేప‌డుతున్న ప్రతి కార్యక్రమాన్నీ.. విమ‌ర్శించ‌డంలో టీడీపీ మంచి మార్కులు [more]

Update: 2020-10-07 02:00 GMT

రాష్ట్రంలో అధికార ప‌క్షం వైసీపీ దూకుడు క‌న్నా కూడా టీడీపీ దూకుడు ఎక్కువ‌గా ఉందా ? ప్రభుత్వం చేప‌డుతున్న ప్రతి కార్యక్రమాన్నీ.. విమ‌ర్శించ‌డంలో టీడీపీ మంచి మార్కులు కొల్లగొడుతోందా ? అంటే.. ఔన‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. నిజానికి ప్రభుత్వంపై విమ‌ర్శలు చేసేందుకు, త‌ప్పుడు ప్రచారం చేసేందుకు ప్రతిప‌క్షాలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. కానీ, ఆయా విమ‌ర్శల‌ను ధీటుగా ఎదుర్కొంటూ.. ప్రతిప‌క్షాల‌ను క‌ట్టడి చేసే వ్యూహం అధికార ప‌క్షానికి ఖ‌చ్చితంగా ఉండాలి. కానీ, ఈ విష‌యంలో వైసీపీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలుకానీ.. ఈ త‌ర‌హా వ్యూహాల‌తో ముందుకు రావ‌డం లేదు.

క్యాలండర్ ప్రకారం పథకాలు….

ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్ర‌మాలు ప్రవేశ‌పెట్టింది. ఆర్థిక ఇబ్బందులు దాటుకుని మ‌రీ వాటిని స‌మ‌యానికి కేలండ‌ర్ వారీగా ప్రజ‌ల‌కు చేరువ చేస్తోంది. ఈ క్రమంలో అన్ని సామాజిక వ‌ర్గాలూ ల‌బ్ధి పొందుతున్నాయి. నిన్న మొన్నటి వ‌ర‌కు త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌న్న చేనేత వ‌ర్గాలు, ద‌ర్జీలు, ఆటో కార్మికులు కూడా జ‌గ‌న్ తీసుకున్న నిర్ణయాలు, తీసుకువ‌చ్చిన ప‌థ‌కాల‌తో ల‌బ్ధి పొందుతున్నారు. చ‌రిత్రలోనే లేని విధంగా ఏకంగా 56 బీసీ కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసి జిల్లాల వారీగా ప‌ద‌వులు ఇచ్చింది.

ఏదో ఒక వివాదాన్ని…..

దీంతో ఆయా వ‌ర్గాలు ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నాయి. కానీ, ఇదే స‌మ‌యంలో చంద్రబాబు ఆయ‌న పార్టీ అనుచ‌రులు సంక్షేమ ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్న స‌మ‌యంలోనే ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని తెర‌మీదికి తెచ్చి ర‌గ‌డ చేస్తున్నాయి. రైతు భ‌రోసా అమ‌లు చేస్తున్న స‌మ‌యంలో రాజ‌ధాని ర‌గ‌డ‌ను తెర‌మీదికి తెచ్చారు. తిరుమ‌ల ప‌ర్యట‌న‌కు వెళ్లిన స‌మ‌యంలో దేవాల‌యాల‌పై ర‌గ‌డ చేశారు. ఇక‌, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం రోజున మ‌రో వివాదాన్ని తెర‌మీదికి తెచ్చారు. ఇలా ప్రతి సంద‌ర్భంలోనూ ప్రజ‌ల దృష్టిని మ‌ళ్లించేందుకు ప్రతిప‌క్షాలు వ్యూహాత్మకంగా ప్రయ‌త్నిస్తున్నాయి.

మైనస్ లే ఎక్కువగా ఫోకస్…..

అయితే ఈ విష‌యంలో టీడీపీకి వైసీపీ నుంచి ధీటుగా కౌంట‌ర్లు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మాట్లాడితే.. ఒకేసారి నాయ‌కులు, మంత్రులు విరుచుకుప‌డుతున్నారు. లేదంటే ఏ ఒక్కరూ మాట్లాడ‌డం లేదు. పోనీ.. విష‌యంపై మాట్లాడినా.. అది మ‌రో వివాదానికి దారితీసేలా ఉంటోంది. దీంతో ప్రతిప‌క్షాల‌కు మ‌రిన్ని ఆయుధాలు ఇచ్చేస్తున్నారుగా అనే ఆవేద‌న వ్యక్తమ‌వుతోంది. ఇక కేబినెట్లో ఉన్న మంత్రుల్లో గ‌ట్టిగా ఐదారుగురు మిన‌హా మిగిలిన మంత్రులు నోరు మెద‌ప‌డం లేదు. పార్టీ అధికార ప్రతినిధులు పేరుకు 25 మంది వ‌ర‌కు ఉన్నా వారిలో ఒక‌రిద్దరు మాత్రమే యాక్టివ్‌గా ఉంటున్నారు. వైసీపీ ఈ విష‌యంలో ఉదాసీనంగా ఉంటే ప్రభుత్వ ప్లస్‌ల కంటే మైన‌స్‌లే జ‌నాల్లోకి వెళ్లే ఛాన్సులే ఎక్కువుగా క‌నిపిస్తున్నాయి.

Tags:    

Similar News