అక్కడ కుప్ప కూలుతున్న కాంగ్రెస్

ఒక పక్క కారెక్కేస్తున్నారు. మరో పక్క కమలం వెంట పరుగులు పెడుతున్నారు. పసుపు పారాణి ఆరకముందే తెలంగాణాలో హస్తం గుర్తుపై గెలిచిన వారంతా అధికార పార్టీలవైపు లుక్కేశారు. [more]

Update: 2019-06-16 18:29 GMT

ఒక పక్క కారెక్కేస్తున్నారు. మరో పక్క కమలం వెంట పరుగులు పెడుతున్నారు. పసుపు పారాణి ఆరకముందే తెలంగాణాలో హస్తం గుర్తుపై గెలిచిన వారంతా అధికార పార్టీలవైపు లుక్కేశారు. దాంతో ఇప్పుడు అధికారంలోకి వస్తామన్న గంపెడాశతో పోరాడిన టి కాంగ్రెస్ దిక్కుమాలిన పరిస్థితికి దిగజారింది. ఒక పక్క టి సీఎల్పీ గులాబీ పార్టీలో విలీనం మరోపక్క కమలం ఆకర్ష్ మంత్రాలతో కాంగ్రెస్ లో ఉండేవారు ఎందరు అన్న ప్రశ్న అందరిని తొలిచేస్తోంది.

కోమటిరెడ్డి క్లియర్ చేసేసారు ….

టి పిసిసి అధ్యక్షుడి కోసం వి హనుమంత్ రావు, పొన్నాల లక్ష్మయ్య వంటి ఓల్డ్ టర్కీ లన్ని క్యూ కట్టాయి. మరో పక్క అంతా కారెక్కేస్తున్నారు. బలమైన కెసిఆర్ కు ధీటైన ప్రత్యామ్నాయ నాయకుడే టి కాంగ్రెస్ లో లేకుండా పోయారు. పక్క రాష్ట్రంలో జగన్ తన పోరాట పటిమతో అధికారంలోకి వస్తే పార్టీ కార్యాలయంలో కూర్చుని మా అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్లతో కాలక్షేపం చేస్తుంటే కాంగ్రెస్ కి మనుగడ ఎక్కడ ఉందని ప్రశ్నించారు ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కుంతియా వంటి పస లేని వారి నేతృత్వంలో కాంగ్రెస్ కి భవిష్యత్తు కూడా లేదంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అంతేకాదు మోడీ తాను చేసిన పనులతో రెండోసారి కూడా అధికారం చేపట్టారని ఆయన నేతృత్వం దేశానికి అవసరమంటూ చెప్పేశారు. కోమటిరెడ్డి ఎన్నికల ముందు ఇంచార్జ్ కుంతియా తో కూడా ఇలాగే యుద్ధానికి దిగారు. తాజాగా మరోసారి అందరిపైనా తనదైన శైలిలో విరుచుకుపడి దుమ్మెత్తిపోశారు.

తప్పులపై తప్పులు చేస్తున్న కాంగ్రెస్ ….

టి కాంగ్రెస్ కి ఇప్పుడు భరోసా వున్న నేత లేకుండా పోయాడు. ఎవరికి వారే మొన్నటి ఎన్నికల్లో ముఖ్యమంత్రులు అయిపోదామనికల లు కని కారు కింద పడి తుక్కు తుక్కు అయిపోయారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం ఏక నాయకత్వం కాకుండా బహు నాయకత్వాన్ని ప్రోత్సహించడం తో గ్రూప్ ల మధ్య విభేదాలు టికెట్ల లొల్లి అధికార టిఆరెస్ కు మంచి అవకాశాన్ని కల్పించాయి. దానికి తోడు వచ్చే ఎన్నికల వరకు విపక్షంలో కూర్చోవడం ప్రజల్లో వుంటూ పోరాటాలు చేసే ఓపిక కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచిన వారికి లేకుండా పోయింది. తొందరగా అధికార పార్టీ చెంతన చేరితే అన్నివిధాలా అభివృద్ధి ఉంటుందని భావించడంతో తమకు టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీకి హ్యాండ్ ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. కారు ఎక్కిన వారిని మినహాయిస్తే ఇప్పుడు కమలం వైపు వెళ్లేవారు ఎందరో లెక్క తేలితే నికరంగా కాంగ్రెస్ లో ఎవరు మిగులుతారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News