కొత్త నేత దొరికాడా?

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరు నియోజ‌క‌వ‌ర్గంలో నిన్న మొన్నటి వ‌ర‌కు టీడీపీకి అండగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బ‌డేటి కోట రామారావు ఉర‌ఫ్ బుజ్జి.. ఇటీవ‌ల ఆక‌స్మికంగా మృతి [more]

Update: 2020-02-19 08:00 GMT

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరు నియోజ‌క‌వ‌ర్గంలో నిన్న మొన్నటి వ‌ర‌కు టీడీపీకి అండగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బ‌డేటి కోట రామారావు ఉర‌ఫ్ బుజ్జి.. ఇటీవ‌ల ఆక‌స్మికంగా మృతి చెందారు. దీంతో ఇక్కడ పార్టీని న‌డిపించేవారు క‌నిపించ‌కుండా పోయారు. ఈ క్రమంలో దృష్టి పెట్టిన పార్టీ అధినేత చంద్రబాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త్వర‌లోనే స్థానిక సంస్థల‌కు ఎన్నిక‌లు కూడా ఉండ‌డంతో ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని బ‌ల‌మైన నాయ‌కుడి కి అప్పగించాల‌ని ఆయ‌న నిర్ణయించుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల ఇక్కడ పార్టీ స‌మ‌న్వయక‌ర్తల స‌మావేశం నిర్వహించి.. పార్టీ ఇంచార్జ్‌పై ఓ క్లారిటీకి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

తెరవెనక చక్రం…….

ఏలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆకస్మిక మరణంతో ఈ స్థానాన్ని ఆయన సోదరుడు బడేటి రాధాకృష్ణ ఉర‌ఫ్ చంటితో భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ నేతలు రాధాకృష్ణకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. వాస్తవానికి గడిచిన కొన్నేళ్ళుగా ఏలూరు టీడీపీ రాజకీయాలతోపాటు తన సోదరుడు బుజ్జి పోటీ చేసినప్పుడల్లా తెరవెనుక చక్రం తిప్పేది బడేటి చంటి మాత్రమేనని, ఆయనకే పూర్తి బాధ్యతలు ఇవ్వాలని మిగతా నేతలు ఉమ్మడిగా పట్టుబడుతున్నారు. త్వరలోనే ఏలూరు వ్యవహారాన్ని కూడా పూర్తిగా చక్కదిద్దబోతున్నారు.

పట్టు ఉన్న కుటుంబం కావడంతో….

ఎందుకనంటే ఏలూరు కార్పొరేషన్‌లో టీడీపీకి గట్టి పట్టు ఉండేలా బడేటి సోదరులు వ్యవహరించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి బ‌డేటి సోద‌రులు గత రెండు ద‌శాబ్దాలుగా సేవ‌లు అందిస్తున్నారు. 2005 కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాని ప‌క్షంలో బ‌డేటి బుజ్జితో పాటు ఆయ‌న భార్య కార్పొరేట‌ర్లుగా గెలుపొందారు. ఆ త‌ర్వాత 2009లో ప్రజారాజ్యంలోకి వెళ్లి ఎమ్మెల్యేగా ఓడినా.. తిరిగి 2014లో ఆయ‌న టీడీపీ నుంచి 24 వేల ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

స్వల్ప ఓట్ల తేడాతో….

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ చిత్తుగా ఓడినా ఏలూరులో బుజ్జి మాత్రం కేవ‌లం 4 వేల ఓట్లతో మాత్రమే ఓడిపోయారు. బుజ్జి ఫ్యామిలీకి స్థానికంగా తిరుగులేని గ్రిప్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికీ కేడర్‌ ఆ కుటుంబంవైపే ఉంది. నేరుగా బడేటి రాధాకృష్ణకి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తే స్థానిక సమరంలో కూడా పార్టీ వెన్నుదన్నుగా ఉంటుందని భావిస్తున్నారు. దీనికి దాదాపు సీనియర్‌లు కూడా పచ్చజెండా ఊపుతున్నారు. ఇదే విష‌యంపై దృష్టి పెట్టిన చంద్రబాబు త్వర‌లోనే ఆయ‌న‌కు బాధ్యత‌లు అప్పగించే అవ‌కాశం ఉంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. మ‌రి చంటి కూడా త‌న సోదరుడి మాదిరిగా దూకుడు ప్రద‌ర్శిస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News