బాబు ఇక్కడ సరిగ్గా హ్యాండిల్ చేయడం లేదా?

ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీకి ప‌ట్టుకొమ్మ వంటి అనంత‌పురం జిల్లాలో పార్టీ ప‌రిస్థితి నానాటికీ దిగ‌జారుతోందా? నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు ప్రయ‌త్నిస్తున్నారా ? అంటే.. [more]

Update: 2020-07-16 00:30 GMT

ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీకి ప‌ట్టుకొమ్మ వంటి అనంత‌పురం జిల్లాలో పార్టీ ప‌రిస్థితి నానాటికీ దిగ‌జారుతోందా? నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు ప్రయ‌త్నిస్తున్నారా ? అంటే.. ఔన‌నే అంటు న్నారు ప‌రిశీల‌కులు. నియోజ‌క‌వ‌ర్గానికి ఒక విధంగా నాయ‌కులు త‌న్నుకొంటున్నారు. ప్రతి నియోజ‌క‌వ‌ర్గం లోనూ ఏదో ఒక ర‌గ‌డ రోడ్డెక్కుతోంది. కీల‌క‌మైన అనంత‌పురం అర్బన్ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాక‌ర్ చౌద‌రికి.. జేసీ వ‌ర్గానికి మ‌ధ్య ఎప్పటి నుంచో రాజ‌కీయ ఆధిప‌త్య ర‌గ‌డ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. టీడీపీ అధికారంలో ఉన్న నాటి నుంచి కూడా ఇక్కడ ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఇక‌, ఇప్పుడు జేసీ దివాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు జేసీ ప‌వ‌న్ కుమార్ త‌న ఆధిప‌త్యం నిరూపించుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న ప్రభాక‌ర్ చౌద‌రిపై కాలు దువ్వుతున్నారు. దీంతో ఇరువురు నేత‌ల మ‌ద్య రాజ‌కీయం వేడెక్కింది.

ఎవరికి వారే గ్రూపులతో…..

ఈ విష‌యంపై చంద్రబాబు త‌న‌కు అన్యాయం చేస్తే తాను అవ‌స‌రం అయితే బీజేపీలోకి వెళ్లేందుకు కూడా రెడీగా ఉన్నాన‌న్న సంకేతాలు ప్రభాక‌ర్ చౌద‌రి పంపుతున్నారు. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గమైన శింగ‌న‌మ‌ల‌లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి నెల కొంది. ఇక్కడ పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న బండారు శ్రావ‌ణికి, రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజుకు మ‌ధ్య రాజ‌కీయం భ‌గ్గుమంటోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి పోటీ చేయాల‌ని రాజు ప్రయ‌త్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ప‌ట్టు పెంచుకునేందుకు ఆయ‌న ప్రయ‌త్నిస్తుండ‌గా… శ్రావ‌ణి కూడా అదే త‌ర‌హా రాజ‌కీయాలు చేస్తుండ‌డంతో పార్టీ ప‌రిస్థితి రోడ్డున ప‌డింది. నియోజ‌క‌వ‌ర్గంలో శ్రావ‌ణికి వ్యతిరేకంగా మ‌రో బ‌ల‌మైన గ్రూపును రాజు కూడ‌గ‌డుతున్నారు.

రెండుగా చీలిపోయి….

మ‌రో ముఖ్యమైన నియోజ‌క‌వ‌ర్గం కదిరిలోనూ త‌మ్ముళ్ల మ‌ధ్య పొస‌గ‌డం లేదు. ఇక్కడ నియోజ‌క‌వ‌ర్గం ఇం చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంక‌ట ప్రసాద్ ఉన్నారు. అయితే, వైసీపీ నుంచి 2016లో టీడీపీలోకి వ‌చ్చిన అప్పటి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషాకు కందికుంట‌కు ఇక్కడ ఆధిప‌త్య రాజకీయాలు పెరుగుతున్నాయి. త‌న మాటే నెగ్గాల‌ని కందికుంట‌, అత్తార్‌లు ప‌ట్టుబ‌డుతుండడంతో పార్టీ శ్రేణుల ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది. క‌ళ్యాణ‌దుర్గంలోనూ నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ ఉమామ‌హేశ్వర‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే హ‌నుమంత‌రాయ చౌద‌రిల మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేస్తే.. భ‌గ్గుమ‌నే ప‌రిస్తితి నెల‌కొంది. గ‌త ఎన్నిక‌ల్లో త‌న ఓట‌మికి హ‌నుమంత‌రాయ చౌద‌రే కార‌ణ‌మ‌ని.. ఉమా ఆరోపిస్తున్నారు. తాను నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నందున హ‌న్మంత‌రాయ చౌద‌రి ఎవ‌ర‌ని ఉమా మ‌హేశ్వర‌నాయుడు ప్రశ్నిస్తున్నారు. దీంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే నేత‌లు కూడా రెండుగా చీలిపోయారు.

రోడ్డున పడుతుండటంతో…..

ఇక‌, మ‌రో అత్యంత ముఖ్యమైన నియోజ‌క‌వ‌ర్గం, టీడీపీకి కంచుకోట వంటి పెనుకొండ‌లోనూ టీడీపీ నేత‌ల మ‌ధ్య దుమారం రేగింది. ఇక్కడ కుర‌బ సామాజిక వ‌ర్గం ఆధిప‌త్యం ఎక్కువ‌గా ఉంది. దీంతో మాజీ ఎమ్మెల్యే పార్థసార‌ధిపై పైచేయి సాధించి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి సీటు ద‌క్కించుకునేందుకు రాష్ట్ర కురుబ కార్మొరేష‌‌న్ మాజీ చైర్మన్ స‌విత‌మ్మ ప్రయ‌త్నిస్తున్నారు. ఇప్పటికే పార్థసార‌థి సీనియ‌ర్‌గా ఉండ‌డంతో పాటు ప‌లు అవ‌కాశాలు, ప‌ద‌వులు ద‌క్కించుకున్నార‌ని.. ఈ సారి ఎలాగైనా సీటు త‌న‌దే అని స‌విత‌మ్మ చెప్పుకుంటున్నార‌ట‌. దీంతో ఇరువురు కూడా ఎడ‌మొహం .. పెడ‌మొహంగా రాజ‌కీయాలు చేసుకుంటున్నారు. ఈ ప‌రిణామాల‌తో అత్యంత కీల‌క‌మైన అనంత‌పురంలో టీడీపీ రాజ‌కీయాలు రోడ్డున ప‌డ్డాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News